Naturals Ice Cream: Amazing Startup Story Behind Natural Ice Cream Success - Sakshi
Sakshi News home page

నేచురల్స్‌ విజయం.. ఆ రుచి వెనుక రహస్యం ఇదే

Published Sun, Aug 8 2021 5:32 PM | Last Updated on Mon, Aug 9 2021 4:43 PM

Secret Mantra Behind Naturals Ice Cream Success - Sakshi

మంచి వ్యాపారి కావాలంటే ఉండాల్సిన అర్హతలు కుటుంబ నేపథ్యం, పెట్టుబడి, మేనేజ్‌మెంట్‌ డిగ్రీలు ఇవేమీ అక్కర్లేదనీ నిరూపించాడీ వ్యాపారి. పదో తరగతి పాస్‌ కావడానికే నానా తంటాలు పడ్డా కామన్ సెన్స్ తో బిజినెస్‌లో సక్సెస్‌ అయ్యాడు. సహజత్వాన్ని మరో మెట్టుపైకి చేర్చాడు

Naturals Ice Cream Success Story: రఘునందన్‌ శ్రీనివాస్‌ కామత్‌ అంటే ఎవరికీ తెలియదు. కానీ ఆయన స్థాపించిన నాచురల్స్‌ ఐస్‌క్రీం అంటే తెలియని వారు తక్కువ. అక్కడి రుచిని తలచుకుని నోరూరని వారు అరుదు. అమితాబ్‌ బచ్చన్‌ నుంచి వివియన్‌ రిచర్డ్స్‌ వరకు ఆ ఐస్‌క్రీంకి ఫిదా అయిపోయారు.  ఐస్‌క్రీం తింటున్నామా లేక పళ్లు తింటున్నామా అనేంత సహజంగా ఇక్కడ హిమక్రీములు తయారవుతాయి. ఒక్కసారి ఇక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వారు రెండో సారి గుర్తు పెట్టుకుని మరీ తింటారు. ఇంతకీ అంతలా ఆకట్టుకునే ఆ ఐస్‌క్రీం తయారీకి బీజం ఎలా పడింది.

మంగళూరు టూ ముంబై
కర్నాటకలోని మంగళూరుకి చెందిన శ్రీనివాస్‌ కామత్‌ పళ్ల వ్యాపారి. మార్కెట్‌లో వందల పళ్ల మధ్య పక్వానికి వచ్చి రుచి ఎక్కువగా పండుని ఎంపిక చేయడంలో ఆయన దిట్ట. దీంతో పళ్ల మంగళూరులో పళ్ల వ్యాపారం చేస్తూ భార్య, ఏడుగురు సంతానాన్ని పోషించేవాడు. అయితే పళ్లపై వచ్చే వ్యాపారం సరిపోకపోవడంతో కుటుంబాన్ని ముంబైకి మార్చాడు. అలా తన పదిహేనవ ఏట తల్లిదండ్రులతో కలిసి ముంబైలో అడుగు పెట్టాడు రఘునందన్‌ శ్రీనివాస్‌ కామత్‌. 

తినుబండారాల షాప్‌
పళ్ల వ్యాపారం వద్దనుకుని ముంబైలో తినుబండరాల షాప్‌ని ఓపెన్‌ చేసింది ఆ కుటుంబం. మిగిలిన అక్కడున్న మిగిలిన షాప్‌లని కాదని తమ దగ్గరికే కష్టమర్లు వచ్చేలా చేసేందుకు రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేసేది రఘునందన్‌ తల్లి ప్రయత్నించేది. అయితే అంత తేలిగ్గా ఆ టేస్టీ ఫుడ్‌ రెసీపీ దొరికేది కాదు. అయినా ఆమె  ప్రయత్నిస్తూనే ఉండేది. ఆమెకు తోడుగా రఘునందన్‌ వంటింట్లో ఎక్కువ సేపు గడిపేవాడు. వారి ప్రయత్నం ఫలించి రుచికరమైన రెసిపీలతో ఆ షాప్‌ బాగా నడిచింది. ఆర్థిక ఇబ్బందులు లేని స్థితికి ఆ కుటుంబం చేరుకుంది. దీంతో అక్కడే ఐస్‌క్రీంలు అమ్మడం కూడా ప్రారంభించారు. 

సొంత ప్రయత్నం
ముంబైలోని ఈటెరీ షాప్‌లో ఇంట్లోనే తయారు చేసిన వెనీలా, చాక్లెట్‌ ఫ్లేవర్లు అమ్మేవారు. అయితే అన్నతో వచ్చిన విబేధాల కారణంగా ఆ షాప్‌ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. కొత్తగా తనను తాను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చింది. దీంతో ఎవరూ చేయనిది ఏదైనా చేయాలని ఆలోచించాడు.

ఫ్రూట్‌ ఫ్లేవర్లు
అప్పటి వరకు వెనీలా, స్ట్రాబెరీ, చాక్లెట్‌ ఫ్లేవర్‌ ఐస్‌క్రీమ్‌లే అమ్మేవారు. మ్యాంగో, జామ, ద్రాక్ష ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు ఎందుకు అమ్మకూడదనే ఆలోచన రఘునందన్‌లో కలిగింది. రుచి ఎక్కువగా ఉండే పళ్లను గుర్తించడంలో తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న నైపుణ్యం, కొత్త రెసిపీలు తయారు చేయడంలో తల్లి నుంచి నేర్చుకున్న మెళకువలు రంగరించి ఫ్రూట్‌ఫ్లేవర్లలో ఐస్‌క్రీమ్‌లు తయారు చేశాడు. 

ఫస్ట్‌ స్టోర్‌
ముంబైలో జనసంచారం ఎక్కువగా ఉండే జూహు రోడ్‌లో 1984లో కేవలం నాలుగు టేబుళ్లతో నాచురల్స్‌ ఐస్‌క్రీం ‍స్టోర్‌ని ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు రెగ్యులర్‌ ఫ్లేవర్ల తిని మోహం మొత్తిపోయిన జనాలకు ఈ ఫ్రూట్‌ ఫ్లేవర్లు బాగా నచ్చాయి. అంతే మరుసటి ఏడాదికే విల్లేపార్లేలో మరో స్టోర్‌ ఓపెన్‌ చేశాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే ముంబైలో ఐస్‌క్రీమ్‌ అంటే నాచురల్స్‌ అనే పరిస్థితి మారింది. 

వివ్‌ మాటలతో
లెజండరీ క్రికెటర్‌ సునిల్‌ గవాస్కర్‌ హోస్ట్‌గా 1986లో సన్నీడేస్‌ కార్యక్రమం వచ్చేది. దానికి అతిధిగా వచ్చిన వివ్‌ రిచర్డ్స్‌ మాట్లాడుతూ.. తానెప్పుడు ముంబై వచ్చినా నాచురల్స్‌లో ఐస్‌క్రీమ్స్‌ తప్పక తింటానని, అక్కడ దొరికే రుచి మరెక్కడా దొరకదంటూ కితాబిచ్చాడు. ఆ కార్యక్రమంలో ఒక్కసారిగా నాచురల్స్‌ పేరు మార్మోగిపోయింది. 

మౌత్‌టాక్‌
నాచురల్స్‌ ప్రయాణం ప్రారంభైనప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రాండ్‌ ప్రచారంపై ఒక్క రూపాయి కూడా ఖర్చు రఘునందన్‌ కామత్‌ ఖర్చు పెట్టలేదు. అక్కడ ఐస్‌క్రీం రుచి చూసిన వాళ్లే ప్రచారం చేసి పెట్టారు. అందులో వివియన్‌ నుంచి అమితాబ్‌ బచ్చన్‌ వరకు ఎందరో ఉన్నారు. అలా నోటిమాట సాయంతోనే ముంబై నుంచి దేశమంతటా నాచురుల్స్‌ రుచులు విస్తరించాయి. 

రూ.300 కోట్ల టర్నోవర్‌
రోడ్డు పక్కన చిన్న తినుబండరాల షాప్‌ నుంచి ప్రారంభమైన రఘునందన్‌ శ్రీనివాస్‌ కామత్‌ ప్రయాణం రోజు రూ. 300 కోట్ల టర్నోవర్‌కి చేరుకుంది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో 135 పైగా ఔట్‌లెట్లు ఉన్నాయి. ఇక్కడ దాదాపు దోస, కోకోనట్‌, ద్రాక్ష, లిచి, జామ ఒకటేమిటి ఇలా అన్ని రకాల ఫ్లేవరల్లో ఐస్‌క్రీమ్‌లు దొరుకుతాయి. 

అదే రహస్యం
నాచురల్స్‌ సక్సెస్‌ వెనుక ఉన్న రహాస్యం కామన్‌సెన్స్‌ అంటారు రఘునందన్‌ కామత్‌. తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ జ్ఙానంతోనే నాచురల్స్‌ స్థాపించానని చెబుతారు. వాళ్ల నుంచి నేర్చరుకున్న విషయాలనే మరింత సాన పెట్టానంటారు. అందులో కృత్రిమత్వం ఏమీ లేదనే. అందుకే తమ ఐస్‌క్రీమ్‌లు అంత సహాజంగా ఉంటాయంటారు. 

- సాక్షి, వెబ్‌డెస్క్‌
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement