South Korean Users File Police Complaint Against Google Ceo Sundar Pichai, Details Inside - Sakshi
Sakshi News home page

డబ్బులెవరికి ఊరికే రావు సార్‌,గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై పోలీసులకు ఫిర్యాదు!

Published Sat, Jun 4 2022 9:18 AM | Last Updated on Sat, Jun 4 2022 11:51 AM

Police Complaint Against Google Ceo Sundar Pichai - Sakshi

ప్రముఖ టెక్‌ దిగ్గజం గూగుల్‌కు చెందిన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లతో పాటు, సీఈవో సుందర్‌ పిచాయ్‌ వ్యవహారం పోలీస్టేషన్‌  వరకు చేరింది. యాప్‌ బిల్లింగ్‌ సిస్టమ్‌లో డొమొస్టిక్‌ యాప్‌ డెవలపర్ల నుంచి భారీ ఎత్తున కమిషన్‌లను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వినియోగదారుల సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కొరియా టైమ్స్‌ కథనం ప్రకారం..సిటిజన్‌ యునైటెడ్‌ ఫర్‌ కన్జ్యూమర్‌ సోవర్జినిటీ (సీయూసీఎస్‌) సభ్యులు సుందర్‌ పిచాయ్‌, గూగుల్‌ కొరియా సీఈవో నాన్సీ మాబెల్‌ వాకర్‌, గూగుల్‌ ఏసియా పసిపిక్‌ ప్రెసిడెంట్‌ స్కాట్‌ బ్యూమాంట్‌లపై సౌత్‌ కొరియా సియో నగరంలోని గంగ‍్నమ్‌ జిల్లా పోలిసుల్ని ఆశ్రయించారు. గూగుల్‌ టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లు దేశ టెలికమ్యూనికేషన్‌ బిజినెస్‌ యాక్ట్‌ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ పోలీసులకు సీయూసీఎస్‌ సభ్యులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 

గూగుల్‌ యాప్‌ పేమెంట్‌ పాలసీ పెంచుతున్న కమిషన్‌ల కారణంగా వినియోగదారులకు భారంగా, క్రియేటర్‌లకు నష్టం వాటిల్లేలా ఉందంటూ కన్జ్యూమర్‌ గ్రూప్‌ అధికార ప్రతినిధి తెలిపారు. "యాప్‌ డెవలపర్లకు ప్రత్యామ్నాయం లేదు. తప్పని సరిగా గూగుల్‌ సంస్థ చెప్పినట్లే వినాలి. ఎందుకంటే యాప్‌స్టోర్‌ మార్కెట్‌ షేర్‌ గూగుల్‌కు 74.6 శాతంగా ఉందని" అన్నారు.

 వివాదం ఏంటంటే 
సంస్థకు సంబంధించిన డిజిటల్‌ ప్రొడక్ట్‌లు సేల్‌ చేయాలన్నా,సంబంధిత యాప్స్‌ సర్వీస్‌లను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అందించాలన్నా గూగుల్‌కు 15శాతం నుంచి 30 వరకు కమిషన్‌ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ కమిషన్‌ ఎక్కువగా ఉండడంతో యాప్‌ డెవలపర్లు 15 శాతం నుంచి 20శాతం మాత్రమే కమిషన్‌ చెల్లించి థర్డ్‌ పార్టీ పేమెంట్‌ సర్వీస్‌ సంస్థల ద్వారా గూగుల్‌కు పేమెంట్‌ చేసేవారు. దీంతో యజమానులకు గూగుల్‌కు పెద్దమొత్తంలో చెల్లించే కమిషన్‌ల భారం తగ్గిపోయిం‍ది. 

యాప్స్‌ను బ్లాక్‌ చేస్తాం
అదే సమయంలో యాప్‌ డెవలపర్ల నుంచి వచ్చే కమిషన్‌ పడిపోవడంతో గూగుల్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యాప్‌ డెవలపర్లు థర్డ్‌ పార్టీ పేమెంట్‌ సర్వీస్‌ సంస్థల నుంచి చెల్లింపులు జరపకూడదని హెచ్చరించింది. అలా చేస్తే సదరు యాప్స్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి బ్లాక్‌ చేస్తామని తెలిపింది. పనిలో పనిగా గూగుల్‌కు లింకైన థర్డ్‌ పార్టీ పేమెంట్‌ సర్వీస్‌లను నిలిపివేసింది. దీంతో వినియోగదారుల సంఘం సభ్యులు గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గూగుల్‌ తీరు మారలేదు!
ఈ ఏడాది మార్చి నెలలో గూగుల్‌ తీరుతో సౌత్‌ కొరియా కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్‌ డెవలపర్లు వారి ఇష‍్ట ప్రకారమే చెల్లింపులు చేసుకోవచ్చని, ఆ విషయంలో గూగుల్‌ ఒత్తిడి చేయకూడదని సవరించిన బిల్లుపై కేబినెట్‌ ఆమోదం తెలిపింది.అయినా సౌత్‌ కొరియా కేబినెట్‌ తెచ్చిన ప్రతిపాదనల్ని తిరస్కరించింది. ఏప్రిల్‌ 1 నుంచి డెవలపర్లను తమ బిల్లింగ్‌ పేమెంట్‌ సిస్టమ్‌ను ఉపయోగించాలని సూచించింది. లేని పక్షంలో యాప్స్‌లను ప్లేస్టోర్‌ నుంచి తొలగిస్తామని వార్నింగ్‌ ఇచ్చింది. గూగుల్‌ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యునైటెడ్‌ ఫర్‌ కన్జ్యూమర్‌ సోవర్జినిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చదవండి👉సీఈఓ సుందర్‌ పిచాయ్‌కు గూగుల్‌ భారీ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement