ఎకానమీకి విస్తృత వ్యాక్సినేషన్‌ దన్ను! | India set to become world’s fastest-growing economy | Sakshi
Sakshi News home page

ఎకానమీకి విస్తృత వ్యాక్సినేషన్‌ దన్ను!

Published Thu, Nov 11 2021 5:03 AM | Last Updated on Thu, Nov 11 2021 5:03 AM

India set to become world’s fastest-growing economy - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగవంతమైన పురోగతిని సాధిస్తోందని ఆర్థిక మంత్రిత్వశాఖ తన తాజా నివేదికలో పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మూల స్తంభాలు పటిష్టంగా ఉండడంతోపాటు, వేగవంతంగా వ్యాక్సినేషన్‌ పక్రియ జరుగుతుండడం, పండుగల సీజన్‌ వంటి అంశాలు దేశంలో డిమాండ్‌ రికవరీ పటిష్టతకు దారితీస్తున్నట్లు తెలిపారు. డిమాండ్‌–సరఫరాల్లో అంతరం తగ్గుతోందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా మెరగుపడుతున్నాయని కూడా ఆర్థిక వ్యవస్థ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

► భారతదేశ ఆర్థిక పునరుద్ధరణలో ఆత్మనిర్భర్‌ భారత్‌ మిషన్, వ్యవస్థాగత సంస్కరణలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఆయా కార్యక్రమాలు, చర్యల వల్ల వ్యాపార అవకాశాలు, డిమాండ్, వ్యయాలు పెరుగుతున్నాయి.  
► అధిక విస్తీర్ణంలో రబీ సాగు, మెరుగైన రిజర్వాయర్‌ స్థాయిలు,  ఎరువులు, విత్తనాల విషయంలో రైతులకు తగినంత లభ్యత వంటి అంశాలు వ్యవసాయ రంగం పురోగతికి దోహద పడుతోంది. ఆర్థిక పునరుద్ధరణలో ఈ రంగం కీలక పాత్ర పోషిస్తోంది.
► వ్యవసాయ–ఎగుమతుల్లో స్థిరమైన పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య ఈ విభాగంలో 22 శాతం వృద్ధి చెందడం గమనార్హం. ఆయా అంశాలు రైతుల ఆదాయాన్ని పెంచడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. గ్రామీణ డిమాండ్‌ పటిష్టంగా ఉంది. 2021 సెప్టెంబర్‌లో ట్రాక్టర్‌లు, ద్విచక్ర, త్రి చక్ర వాహనాల విక్రయాలు పటిష్ట రికవరీని సూచిస్తున్నాయి.  
► రిటైల్‌ ద్రవ్యోల్బణం కట్టడి, మార్కెట్‌లో తగినంత లిక్విడిటీ (ద్రవ్య లభ్యత), బాండ్ల రేట్ల స్థిరత్వం వంటి అంశాలు ఎకానమీకి సానుకూల అంశాలుగా ఉన్నాయి.  
► బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) తగ్గింపు ప్రయోజనం వ్యవస్థలో ప్రతిబింబిస్తోంది. 2020 ఫిబ్రవరి– 2021 సెప్టెంబర్‌ మద్య తాజా రూపీ రుణాలపై సగటు రుణ రేటు 130 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) తగ్గిడం సానుకూలాంశం.
► భారత్‌ ఎకానమీ 2021–22 ఆర్థిక సంవత్సరంలో 11 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని 2020–21 ఎకనమిక్‌ సర్వే పేర్కొంటోంది. పలు రేటింగ్, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాలు 9–10 శాతం శ్రేణిలో ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement