సంపదకు మించిన స్ఫూర్తి.. బిజినెస్‌లో స్ఫూర్తివంతమైన తండ్రీకొడుకులు Fathers Day 2023 Most Inspiring Father Son Duos In Business | Sakshi
Sakshi News home page

Fathers Day 2023: సంపదకు మించిన స్ఫూర్తి.. బిజినెస్‌లో స్ఫూర్తివంతమైన తండ్రీకొడుకులు

Published Sun, Jun 18 2023 8:46 PM | Last Updated on Sun, Jun 18 2023 8:54 PM

Fathers Day 2023 Most Inspiring Father Son Duos In Business - Sakshi

ప్రపంచంలో అద్భుతమైన బంధం తండ్రీకొడులది. తండ్రి పిల్లలకు అన్నీ ఇస్తాడు. చాలా మంది తండ్రులు జీవితాంతం కష్టపడి ఆస్తులు సంపాదించి పిల్లలకు ఇస్తారు. కానీ కొంత మంది సంపదకు అంతకు మించిన స్ఫూర్తిని వారసత్వంగా అందిస్తారు. పిల్లలు కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తానే ఆ తండ్రుల పేరు శాశ్వతంగా నిలబడుతుంది. 

ఏటా జూన్‌ నెలలో మూడో ఆదివారం ఫాదర్స్‌ డేగా జరుపుకొంటున్నాం. ఎంతో మంది విజయవంతమైన బిజినెస్‌మెన్‌ వేలు, లక్షల కోట్ల సంపదను సృష్టించి వారసులకు అందించారు. కానీ కొంతమందే సంపదతోపాటు అంతకుమించిన స్ఫూర్తిని వారసులకు పంచారు. అటువంటి కొందరు బిజినెస్‌మన్‌ ఫాదర్స్‌ గురించి తెలుసుకుందాం.. 

జమ్‌సెట్‌జీ టాటా
భారత పరిశ్రామిక పితామహుడిగా పరిగణించే జమ్‌సెట్‌జీ టాటా 1839 మార్చి 3న జన్మించారు. జంషెడ్‌పూర్‌లో టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ ఏర్పాటు చేసి ప్రసిద్ధి చెందారు. క్లీన్ ఎనర్జీ కోసం జలపాతం శక్తిని ఉపయోగించుకోవాలనే ఆలోచన మొదట మహారాష్ట్రలోని రోహా క్రీక్‌లో విహారయాత్ర సందర్భంగా జమ్‌సెట్‌జీ టాటాకు తట్టింది. ఈ సమయంలో టెక్స్‌టైల్ మిల్లుల పొగలతో ముంబై నగరం ఉక్కిరిబిక్కిరి అవుతోంది.

పశ్చిమ కనుమలలో మొదటి జలవిద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని భావించిన ఆయన నిర్మాణం పూర్తి కాకముందే మరణించారు. తండ్రి సాధించలేకపోయినప్పటికీ ఆయన కుమారులు డోరాబ్, రతన్ టాటాలు తదనంతరం బొంబాయి నగరానికి సరసమైన, స్వచ్ఛమైన విద్యుత్తు అందించేందుకు పునాది వేసినట్లు టాటా గ్రూప్ వారి వెబ్‌సైట్‌లో పేర్కొంది. అప్పటి నుంచి రతన్‌ టాటా తండ్రి స్ఫూర్తిని కొనసాగిస్తూ ఆయన పేరును ఉన్నత స్థాయిలో నిలిపారు.


ధీరూభాయ్‌ అంబానీ
అంబానీ అనే పేరు దాదాపు ప్రతి భారతీయుడికి సుపరిచితమే. ధీరూభాయ్ అంబానీ అని కూడా పిలిచే ధీరజ్‌లాల్ హరిచంద్ అంబానీ.. రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్‌ను స్థాపించారు. నిరాడంబరమైన సంపన్న కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఆయన స్థాపించిన వ్యాపారం భారతదేశం అత్యంత గుర్తించదగిన, విజయవంతమైన బ్రాండ్‌లలో ఒకటిగా మారింది. ధీరూభాయ్‌ అంబానీ తర్వాత ఆయన ఇద్దరు కుమారులు ముఖేష్, అనిల్ అంబానీలు వారసత్వం కొనసాగిస్తున్నారు.

ముఖ్యంగా పెద్ద కొడుకుగా ముఖేష్ అంబానీ తండ్రి స్ఫూర్తివంతమైన వారసత్వాన్ని కొనసాగించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు. నేడు అదే చర్యను ఆకాష్ అంబానీ చేతుల మీదుగా అంబానీ మూడవ తరం అమలు చేస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, జియో ప్లాట్‌ఫారమ్‌లు, గ్రూప్‌లోని ఇతర కంపెనీల వృద్ధి, విజయానికి ఆయన చేసిన కృషి, నాయకత్వ నైపుణ్యాలు, వ్యూహాత్మక దృష్టికి నిదర్శనం.

సజ్జన్ జిందాల్
సజ్జన్ జిందాల్ జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఇది భారీ మల్టీ బిలియన్ల వ్యాపార సంస్థ. సజ్జన్‌ జిందాల్‌ కుమారుడు పార్త్ జిందాల్ తండ్రి అడుగుజాడలను అనుసరిస్తూ ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ సిమెంట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. తనకు అందించిన దానికంటే మించి సాధించారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ యాజమాన్యంలో ఉన్న బెంగళూరు ఎఫ్‌సీకి సీఈవో అయ్యారు. ఉక్కు, ఇంధనం, మౌలిక సదుపాయాల వంటి రంగాలలో తిరుగులేని సంస్థగా ఉన్న జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ను మరింత వైవిధ్యభరితంగా తీర్చిదిద్దేందుకు తండ్రీ కొడుకులు పెద్ద కలలు కన్నారు. ఈ డైనమిక్ తండ్రీ కొడుకుల వ్యాపార విజయ గాథలు నిజంగా ఆదర్శవంతమైనవి.

లాలా కేదార్‌నాథ్ అగర్వాల్
లాలా కేదార్‌నాథ్ అగర్వాల్ 1947లో దేశ విభజన తర్వాత బికనీర్ నుంచి జీవనోపాధి కోసం ఢిల్లీకి వెళ్లారు. చాందినీ చౌక్‌లో ట్రాలీలో సంప్రదాయ స్వీట్లు, సావరీస్ అమ్మడం ప్రారంభించారు. ఆయన కృషికి అదృష్టం తోడైంది. తక్కువ కాలంలోనే అదే ప్రాంతంలో 'బికనేర్ నమ్‌కీన్‌ భండార్‌' పేరుతో చిన్నపాటి దుకాణాన్ని ప్రారంభించి నంకీన్‌లు, చిరుతిళ్లు విక్రయించారు. కాలక్రమేణా అది 'బికనీర్‌వాలా'గా గుర్తింపు పొందింది. బికనేరి భుజియా, ఇతర ప్రామాణికమైన భారతీయ చిరుతిళ్ల వ్యాపారంలో ప్రసిద్ధి చెందింది.

1965లో వ్యాపారంలోకి అడుగుపెట్టిన లాలా కుమారుడు శ్యామ్ సుందర్ అగర్వాల్ బికనీర్‌వాలాను ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తరించారు. ప్యాకేజ్డ్ ఫుడ్ బ్రాండ్ బికానోను ప్రారంభించారు. బికనీర్‌వాలా వారసత్వాన్ని కొనసాగిస్తూ మూడో తరం వ్యాపారవేత్త మనీష్ అగర్వాల్ 2000లో వ్యాపారంలో చేరారు. బికానో ఇప్పుడు వివిధ రకాల నామ్‌కీన్‌లు, కుకీలు, స్వీట్లు, పాపడ్, సిరప్‌లు, సమోసా వంటి పిండి పదార్థాలను విక్రయిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement