సింగరేణి ఆత్మను ఆవిష్కరించేలా పాట.. - | Sakshi
Sakshi News home page

సింగరేణి ఆత్మను ఆవిష్కరించేలా పాట..

Published Sat, Jun 22 2024 12:20 AM | Last Updated on Sat, Jun 22 2024 12:20 AM

సింగర

గాయకుడు, రచయిత మిట్టపల్లి సురేందర్‌

కొత్తగూడెంటౌన్‌: బొగ్గు గని నుండి పుట్టుతున్న అగ్గిధారల్‌.. గనులెన్నో తవ్వుతున్న గడ్డపారల్‌.. సింగరేణి యువకుల్‌ అంటూ సాగే పాట సింగరేణి ఆత్మను ఆవిష్కరించేలా ఉంటుందని ప్రముఖ కవి, గాయకుకు మిట్టపల్లి సురేందర్‌ తెలిపారు. ఆయన సింగరేణిపై రాసిన పాట చిత్రీకరణలో పాల్గొనేందుకు కొరియోగ్రాఫర్లు, గాయకులు, నటీనటుల ఎంపిక కోసం కొత్తగూడెంలో శుక్రవారం ఆడిషన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు యువతీ, యువకులు ప్రదర్శన ఇచ్చారు. అనంతరం సురేందర్‌ మాట్లాడుతూ ఇటీవల మిట్టపల్లి స్టూడియో నుండి విడుదలైన అమ్మపాడే జోల పాట ఘన విజయాన్ని సాధించిందని తెలిపారు. ఈనేపథ్యాన సింగరేణిపై రాసిన పాట సైతం అందరికీ గుర్తుండిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. రచయిత, కొరియోగ్రాఫర్‌ కళ్యాణ్‌, సుమిత్రతో పాటు హనుమండ్ల మధు, రాయికం సంతోష్‌, గాజుల శ్రీనివాసరావు, మిట్టపల్లి స్టూడియో సీఈఓ పుల్ల సతీష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

నా భూమికి రక్షణ కల్పించాలి

మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య దొర

కరకగూడెం: తన భూమికి రక్షణ కల్పించాలని మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్‌, ఆదివాసీ జాతీయ సంఘాల జేఏసీ అధ్యక్షుడు చందా లింగయ్య దొర కోరారు. మండల కేంద్రంలోని తన భూమిలోకి వెళ్లే రహదారిని ఓ వ్యక్తి ట్రాక్టర్‌ ద్వారా దున్ని, సరిహద్దుల ఫెన్సింగ్‌ స్తంభాలను ధ్వంసం చేశారని వాపోయాడు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏజెన్సీలో ఆదివాసీల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. 2003లో మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజనేతర వ్యక్తి నుంచి 10 కుంటల భూమి కొని, తన భూమిలోకి రోడ్డు నిర్మించుకున్నట్లు తెలిపారు. అప్పటి నుంచి తమ స్వాధీనంలోనే ఉంటున్నా, ఓ వ్యక్తి రోడ్డును దున్ని, ఫెన్సింగ్‌ పోల్స్‌ ధ్వంసం చేశాడని ఆరోపించారు. సంబంధిత అధికారులు స్పందించి బాధ్యులపై, అతనికి సహకరించిన మరో వ్యక్తిపై అట్రాసిటీ, 1/70 చట్టాల ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా ఈ ఘటనపై ఫిర్యాదు అందిందని, పరిశీలిస్తున్నామని ఎస్‌ఐ రాజేందర్‌ తెలిపారు.

గిరిజనులు, అటవీశాఖ సిబ్బందికి మధ్య వాగ్వాదం

దుమ్ముగూడెం : మండలంలోని గౌరారం గ్రామ శివారులో అటవీశాఖ సిబ్బందికి, గిరిజనులకు మధ్య శుక్రవారం వాగ్వాదం నెలకొంది. అటవీశాఖ సిబ్బంది అటవీశాఖ భూముల్లో ట్రెంచ్‌ కొట్టేందుకు జేసీబీ వాహనం తీసుకుని వెళ్లారు. దీంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కుంటే తమ పరిస్థితి ఏంటని అటవీశాఖ సిబ్బందిని నిలదీశారు. ఈ క్రమంలో వాగ్వాదం నెలకొంది. రేంజర్‌ కనకమ్మ జోక్యం చేసుకుని పట్టాలు తీసుకువస్తే అటవీహక్కుల చట్టం కమిటీల సమక్షంలో సమస్యను పరిష్కరించుకుందామని సూచించడంతో గిరిజనులు వెనక్కి తగ్గారు.

చర్లలో..

చర్ల రూరల్‌: బట్టిగూడెం గ్రామస్తులు, న్యూడెమోక్రసీ నాయకులు సతీష్‌కు అటవీశాఖ అధికా రులకు మధ్య శుక్రవారం స్వల్పంగా తోపులాట జరిగింది. ప్లాంటేషన్‌ వేసేందుకు సిద్ధంగా ఉన్న అటవీ భూమిలోకి రావడంతో తోపులాట జరిగిందని ఎఫ్‌ఆర్వో ఉపేంద్ర తెలిపారు.

నాటుసారా స్వాధీనం

దుమ్ముగూడెం : మండలంలోని నర్సాపురంలో అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న వ్యక్తిపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గోపయ్య అనే వ్యక్తి నర్సాపురం గ్రామానికి వచ్చి నాటుసారా విక్రయిస్తుండగా, మహిళలు పట్టుకునేందుకు ప్రయత్నించారు. దీంతో సారా ప్యాకెట్లను అక్కడే వదిలేసి పారిపోయాడు. మహిళల ఫిర్యాదు మేరకు గోపయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ గణేష్‌ తెలిపారు.

వ్యక్తి అదృశ్యం

పాల్వంచరూరల్‌: వ్యక్తి అదృశ్యంపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని యానంబైల్‌ గ్రామానికి చెందిన శిరసాని వెంకటరమణ పట్టణంలోని గట్టాయిగూడెంలో నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌లో పని ఉందంటూ ఈ నెల 17న సాయంత్రం 6 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్‌ చేస్తే సెల్‌ఫోన్‌ స్విచ్చాప్‌ వస్తోంది. బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లేదు. వెంకటరమణ భార్య మీనాక్షి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పట్టణ ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

No comments yet. Be the first to comment!
Add a comment
సింగరేణి ఆత్మను ఆవిష్కరించేలా పాట..
1/1

సింగరేణి ఆత్మను ఆవిష్కరించేలా పాట..

Advertisement
 
Advertisement
 
Advertisement