నేరానికి శిక్ష తప్పదు | YS Jagan Govt orders police department for Crime prevention | Sakshi
Sakshi News home page

నేరానికి శిక్ష తప్పదు

Published Sun, Dec 25 2022 5:28 AM | Last Updated on Sun, Dec 25 2022 2:53 PM

YS Jagan Govt orders police department for Crime prevention - Sakshi

సాక్షి, అమరావతి: నేరాల కట్టడితోపాటు నేరస్తులకు శిక్షలు పడేలా దర్యాప్తు చేయడానికి రాష్ట్ర పోలీసులు చేపట్టిన చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. కేసుల నమోదుతో సరిపెట్టకుండా నేరాన్ని రుజువు చేసి నేరస్తులకు శిక్షపడే విధంగా రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన ‘కన్విక్షన్‌ బేస్‌ పోలీసింగ్‌’ విధానం మంచి ఫలితాలనిస్తోంది. ఈ విధానం కింద కేసుల నమోదుతోపాటు నేర నిరూపణ వరకు ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది.

ఇందుకోసం పోలీస్‌ స్టేషన్‌ స్థాయిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎస్‌ఐ) నుంచి జిల్లా ఎస్పీ, నగర పోలీస్‌ కమిషనర్‌ వరకు స్వీయ పర్యవేక్షణ (రివ్యూ) బాధ్యతలు అప్పగించారు. వీటిలో బాలికలు, మహిళలపై జరిగిన నేరాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

ఈ ఏడాది జూన్‌ నుంచి అమలులోకి తెచ్చిన ఈ విధానంతో కేవలం ఆరు నెలల్లోనే ఏకంగా 90 పోక్సో కేసుల్లో శిక్షలు పడేలా చేయగలిగారు. ఇందులో 42 కేసుల్లో జీవిత ఖైదు పడటం ఓ రికార్డు. మరొక నేరస్తుడికి చనిపోయే వరకు శిక్ష విధించగా, 11 మందికి 16 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు శిక్షలు, తొమ్మిది మందికి 10 నుంచి 15 ఏళ్లలోపు శిక్షలు పడ్డాయి. 


పోలీసు శాఖలో సమూల మార్పులు 
గతంలో కోర్టు మానిటరింగ్‌ సిస్టం ద్వారా నేరాల విచారణ జరిగేది. దీనివల్ల కేసుల దర్యాప్తు, సాక్ష్యాల నమోదు తదితర విషయాల్లో తీవ్ర జాప్యం జరిగేది. అతి తక్కువ కేసుల్లోనే శిక్షలు పడేవి. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత నేర నిరూపణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. పోలీ­సు శాఖలో సమూల మార్పులకు దిశా నిర్దేశం చేశారు.

సీఎం వైఎస్‌ జగన్‌ సూచనల మేరకు కన్విక్షన్‌ బేస్‌ పోలీసింగ్‌ విధానాన్ని తెచ్చారు. దీని కింద రోజువారీగా కేసుల నమోదుతోపాటు దర్యాప్తు, న్యాయస్థానాల్లో వాయిదాలు, సాక్ష్యాలను ప్రవేశపెట్టడం, నేర నిరూపణకు చర్యలు తీసుకోవడంలో పోలీసు శాఖ పక్కా కార్యాచరణ చేపట్టింది. ఎస్‌ఐ స్థాయి నుంచి ఎస్పీ, నగర పోలీస్‌ కమిషనర్‌ వరకు ప్రతి ఒక్కరూ అయిదు ప్రధాన కేసులను రోజువారీగా స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు.

ప్రతి రోజు షెడ్యూల్‌ మేరకు కోర్టులో కేసు విచారణ పురోగతిని సమీక్షిస్తున్నారు. నేరస్తులు తప్పించుకోకుండా చే­య­డంతోపాటు బలమైన సాక్ష్యాలను పెట్టడం, సాక్షులకు రక్షణపై దృష్టి పెట్టారు. తద్వారా త్వరితగతిన నేర నిరూపణ జరిగి, నేరస్తులకు శిక్షలు పడుతున్నాయి.

నేర నిరూపణకు ప్రాధాన్యం 
రాష్ట్రంలో కేసుల నమోదు నుంచి నేర నిరూపణ వరకు ప్రత్యేక దృష్టి సారించాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పక్కా కార్యాచరణ చేపట్టాం. ప్రధానంగా బాలికలు, మహిళలపై జరుగుతున్న నేరాల్లో శిక్షలు పడేలా దృష్టి పెట్టాం. గతంలో ‘కోర్టు మానిటరింగ్‌ సిస్టం’తో కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వడానికే పరిమితమయ్యేవారు. దీని వల్ల శిక్షల శాతం పెరగలేదు.

సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాలతో ఈ సిస్టమ్‌ను ప్రక్షాళన చేసి కన్విక్షన్‌ బేస్‌ పోలీసింగ్‌ విధానం అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్‌లో సమూల మార్పులు తెస్తున్నాం. నేరం జరిగితే కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీటు వేసి బాధ్యత తీరిందని సరిపెట్టుకోకుండా నేర నిరూపణ వరకు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించేలా చేశాం. దీనిపై రోజువారీగా జిల్లా ఎస్పీలు, నగర పోలీస్‌ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిచడంతో ఆరు నెలల్లోనే అద్భుతమైన ఫలితాలు సాధించాం. 
– కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, డీజీపీ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement