అడవి ఒడికి పులి కూనలు The tiger cubs will be born in the Nallamala sanctuary very soon | Sakshi
Sakshi News home page

అడవి ఒడికి పులి కూనలు

Published Wed, Mar 20 2024 4:58 AM | Last Updated on Wed, Mar 20 2024 4:58 AM

The tiger cubs will be born in the Nallamala sanctuary very soon - Sakshi

తిరుపతి జూలో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లల కోసం నల్లమలలో ఎన్‌క్లోజర్లు  

వేటాడి ఆహారాన్ని సేకరించుకునేలా చర్యలు 

ఇందుకోసం కాకినాడ నుంచి చారల దుప్పులు  

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే తొలిసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు

పెద్దదోర్నాల: తల్లి నుంచి విడిపోయి తిరుపతి జూ పార్క్‌లో ఆశ్రయం పొందుతున్న పులి పిల్లలు అతి త్వరలో నల్లమల అభయారణ్యంలో అడుగిడనున్నాయి. తల్లినుంచి తప్పిపోయి జనారణ్యంలో దొరికిన పులి కూనలకు నల్లమల అభయారణ్యంలోని ఇతర జంతువులను వేటాడటం నేర్పించేందుకు భారీ టైగర్‌ ఎన్‌క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

సుమారు 14 నెలల క్రితం నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమ్మడాపురంలో నాలుగు ఆడ పులి పిల్లలు తల్లి నుంచి విడిపోయి దిక్కుతోచని స్థితిలో ప్రజల కంటపడిన విషయం విదితమే. తల్లి జాడ లేకపోవటంతో పులి పిల్లలను అటవీ శాఖ సిబ్బంది తిరుపతిలోని వెంకటేశ్వర జూ పార్కుకు తరలించి సంరక్షిస్తున్నారు.

ఆరోగ్యం విషమించి ఓ పులిపిల్ల మృతి చెందగా.. మిగిలిన పులి పిల్లలకు రుద్రమ్మ, హరిణి, అనంతగా నామకరణం చేశారు. మూడు పిల్లలు పెరిగి పెద్దవవుతుండటంతో వాటిని అటవీ వాతావరణంలో వదిలి పెట్టేందుకు అటవీ శాఖ నిర్ణయం తీసుకోవటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో తొలి ప్రయోగం 
తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా పులి పిల్లల సంరక్షణ కేంద్రాన్ని ప్రయోగాత్మకంగా కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో ఏర్పాటు చేశారు. తిరుపతి జూలో పెరుగుతున్న పెద్దపులులు సహజసిద్ధంగా వాటి ఆహారాన్ని అవి వేటాడగలిగేలా చేయటంతోపాటు అనాథలైన, తీవ్ర గాయాల పాలైన పెద్దపులులను ఇక్కడి నర్సరీ ఎన్‌క్లోజర్‌లలో పెట్టి సంరక్షిస్తారు. పులుల సంరక్షణకు అక్కడి వాతావరణం అనుకూలంగా ఉండటంతో 15 హెక్టార్లలో ప్రత్యేకమైన ఎన్‌క్లోజర్లను అధికారులు సిద్ధం చేస్తున్నారు.

ఇక్కడ పులులను సంరక్షించేందుకు ఎల్లవేళలా వెటర్నరీ వైద్యులు ఎన్‌క్లోజర్ల వద్ద అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుపతి జూ పార్కులో ఉన్న పులి పిల్లలు వేటాడే సహజసిద్ధ గుణాన్ని మరిచిపోయి జూ అధికారులు అందజేసే ఆహారంతోనే జీవిస్తున్నాయి. వాటిని జూ పార్కు నుంచి తరలించి నేరుగా అభయారణ్యంలో వదిలి పెడితే అవి ప్రమాదాల బారినపడే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వాటిని ఎన్‌క్లోజర్లలో ఉంచుతారు. స్వతహాగా కొన్ని వన్యప్రాణులను వేటాడి ఆహారాన్ని అవి సేకరించుకోగలిగేలా చూస్తారు.

పులి పిల్లలు వేట నేర్చుకోవటం కోసం కాకినాడలోని నాగార్జున ఫెర్టిలైజర్స్‌ జూ పార్కు నుంచి ప్రత్యేకంగా 37 చారల దుప్పులను నల్లమలకు తరలించి వాటిని ఎన్‌క్లోజర్లలో సంరక్షిస్తున్నారు. కొద్దిరోజుల అనంతరం వీటిని పులుల కోసం ఏర్పాటు చేసిన ఎన్‌క్లోజర్లలో వదలటం ద్వారా పులులకు వేటాడటాన్ని అలవాటు చేస్తారు. అవి వ్యక్తిగతంగా 50 వన్యప్రాణులను వేటాడిన తరువాత వాటి శక్తి యుక్తులను గుర్తించి తదుపరి చర్యలను తీసుకుంటారు.  

చారల దుప్పుల కోసం ప్రత్యేక ఎన్‌క్లోజర్‌ 
కాకినాడ నుంచి ప్రత్యేకంగా రప్పించిన చారల దుప్పుల కోసం కొర్రప్రోలు రేంజి పరిధిలోని పెద్దపెంటలో 20 మీటర్ల పొడవు, వెడల్పుతో ప్రత్యేకంగా ఓ ఎన్‌క్లోజర్‌ను ఏర్పాటు చే­శా­రు. వీటికోసం ఎన్‌క్లోజర్‌ బయట రూ.2.50 లక్షలతో సోలార్‌ బోరు అమర్చారు. దానినుంచి ఎన్‌క్లోజర్‌లోకి ప్రత్యేకంగా పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసి నీటిని విడుదల చేస్తున్నారు. వీటి అవసరాలను తీర్చేందుకు సాసర్‌పిట్లు, నీటి గుంతలను ఏర్పాటు చేశారు.

వేసవిని తట్టుకునేలా ఎన్‌క్లోజర్‌ చలువ పందిళ్లు వేసి నీటిని వెదజల్లేలా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేశారు. వీటి ఆహారం కోసం వినుకొండ, మార్కాపురం ప్రాంతాల నుంచి సుబాబుల్, బుల్‌ ఫీడ్‌ను రప్పించి ఆహారంగా వేస్తున్నారు. చారల దుప్పులు సంతానోత్పత్తి చేసేలా పెద్దదో­ర్నాల రేంజి పరిధిలోని తుమ్మలబైలు వద్ద ఒక ఎన్‌క్లోజర్, నెక్కంటి రేంజి పరిధిలో మరో రెండు ఎన్‌క్లోజర్లను సిద్ధం చేస్తున్నారు.

యుద్ధప్రాతిపదికన ఎన్‌క్లోజర్ల ఏర్పాటు యుద్ధ ప్రాతిపదికన టైగర్‌ ఎన్‌క్లోజర్లను సిద్ధం చేస్తున్నాం. కాకినాడ నుంచి ఇక్కడకు రప్పించిన చారల దుప్పుల కోసం కూడా ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేసి సోలార్‌ బోర్‌ ద్వారా నీరు, ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకుంటున్నాం. పులి పిల్లలకు వేటాడటంలో శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం.    – ప్రసన్నజ్యోతి, ఫారెస్ట్‌ రేంజి అధికారి, కొర్రప్రోలు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement