స్మార్ట్‌ ఫోన్‌లా ట్యాబ్‌లను వాడలేరు | Tabs cannot be used like a smart phone | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ ఫోన్‌లా ట్యాబ్‌లను వాడలేరు

Published Fri, Dec 29 2023 5:34 AM | Last Updated on Fri, Dec 29 2023 5:34 AM

Tabs cannot be used like a smart phone - Sakshi

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని 8వ తరగతి విద్యార్థులకు టెక్నాలజీ విద్యను చేరువ చేస్తూ ఉచితంగా అందించిన బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌ల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ఐటీ సెల్‌ డిజిటల్‌ ఇనీషియేటివ్స్‌ రాష్ట్ర నోడల్‌ అధికారి సీహెచ్‌వీఎస్‌ రమేష్‌కుమార్‌ చెప్పారు. గురువారం గుంటూరులో ట్యాబ్‌ల యాక్టివేషన్‌పై ఉపాధ్యాయులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రమేష్‌కుమార్‌ ‘సాక్షి’తో మాట్లాడారు.

ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్‌లను స్మార్ట్‌ఫోన్‌లా ఉపయోగించేందుకు ఆస్కారం లేదని, ప్రీ లోడెడ్‌ యాప్స్‌ను గూగుల్‌  సంస్థ ద్వారా బ్లాక్‌ చేయించినట్లు తెలిపారు. బైజూస్‌ కంటెంట్‌తో కూడిన యాప్‌తో పాటు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌తో కూడిన స్విఫ్ట్‌చాట్, ఈ–పాఠశాల, డ్యూలింగో, డిక్షనరీ యాప్‌లు మినహా మరే ఇతర యాప్‌లు ట్యాబ్‌లు ఉండవని స్పష్టం చేశారు. 

ఇంటర్నెట్‌తో పనిలేకుండా బైజూస్‌ కంటెంట్‌ను విద్యార్థులు చూడవచ్చని.. మిగిలిన 4 యాప్స్‌ను చూడాలంటే పాఠశాలల్లోని వైఫై ద్వారా కనెక్ట్‌ కావాలని చెప్పారు. సిమ్‌కార్డ్‌ స్లాట్‌ను బ్లాక్‌ చేశామని, 256 జీవీ సామర్ధ్యం కలిగిన ఎస్‌డీ కార్డు ద్వారా 4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీబీఎస్‌ఈ సిలబస్‌లో అన్ని పాఠ్యాంశాలను లోడ్‌ చేశామని తెలిపారు. డ్యూలింగో యాప్‌ ద్వారా విద్యార్థులు విదేశీ భాషలు నేర్చుకోవచ్చన్నారు. స్విఫ్ట్‌ చాట్‌ యాప్‌ ద్వారా విద్యార్థి ఏ సబ్జెక్టుకు సంబంధించిన సమాచారాన్నైనా తెలుసుకోవచ్చని.. సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని చెప్పారు. 

ట్యాంపరింగ్‌ చేస్తే కఠిన చర్యలు..
ట్యాబ్‌లలో ఇన్‌బిల్ట్‌గా ఉన్న మొబైల్‌ డివైజ్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ద్వారా విద్యార్థుల ట్యాబ్‌లను ఐటీ సెల్‌ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రమేష్‌కుమార్‌ చెప్పారు. ట్యాబ్‌లలో ఆధునిక భద్రతా వ్యవస్థ ఇమిడి ఉందన్నారు. ఈ ట్యాబ్‌లను విద్యార్థులు, ఉపాధ్యాయులు మినహా ఇతరులెవ్వరూ వినియోగించేందుకు అవకాశం లేదన్నారు.

బ్లాక్‌ చేసిన యాప్‌లను అన్‌లాక్‌ చేసేందుకు సెల్‌ఫోన్‌ షాపులవాళ్లు, ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నిస్తే వారిపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. దీనిపై అన్ని జిల్లాల ఎస్పీలకు ప్రభుత్వం సమాచారం చేరవేసిందని తెలిపారు. విద్యార్థులు ట్యాబ్‌లలో ఏ సబ్జెక్టు ఎంతసేపు చూశారనే సమాచారం కూడా నమోదవుతుందని వివరించారు. 

సర్వీస్‌ సెంటర్ల ద్వారా ఉచిత సేవలు
ట్యాబ్‌లలో ఏదైనా సాంకేతిక సమస్య ఎదురైతే.. ఆ సంస్థ సర్వీసు సెంటర్ల ద్వారా ఉచిత సేవలు పొందవచ్చని రమేష్‌కుమార్‌ చెప్పారు. పని చేయని ట్యాబ్‌ను సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయంలో డిజిటల్‌ అసిస్టెంట్‌కు అందిస్తే, వాళ్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి టోకెన్‌ ఇస్తారని పేర్కొన్నారు. అనంతరం ఆ ట్యాబ్‌ను సర్వీసు కేంద్రానికి పంపించి.. బాగు చేయించి మూడు రోజుల వ్యవధిలో తిరిగి అందజేస్తారని చెప్పారు. ట్యాబ్‌ కింద పడినా పాడవకుండా సురక్షితమైన కవర్‌ కేస్‌తో పాటు స్క్రీన్‌ గార్డు, చార్జర్, ఇయర్‌ ఫోన్‌ అందిస్తున్నట్లు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement