కౌంటింగ్‌ ముంగిట మరో కుట్ర | Suddenly Posting For AR Damodar | Sakshi
Sakshi News home page

కౌంటింగ్‌ ముంగిట మరో కుట్ర

Published Tue, Jun 4 2024 2:32 AM | Last Updated on Wed, Jun 5 2024 8:51 AM

Suddenly Posting For AR Damodar

పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌లో ‘పచ్చ’ఖాకీ 

వివాదాస్పద పోలీసు అధికారి ఏఆర్‌ దామోదర్‌కు హఠాత్తుగా కీలక పోస్టింగ్‌ 

పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలు అప్పగింత 

టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకేనా!? 

విస్మయం కలిగిస్తున్న ఈసీ, పోలీసు ఉన్నతాధికారుల నిర్ణయం

సాక్షి, అమరావతి: కీలకమైన ఓట్ల లెక్కింపు సందర్భంగా పోలీసు శాఖ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం విస్మయపరుస్తోంది. చంద్రబాబు ఒత్తిడికి ఎన్నికల కమిషన్‌ (ఈసీ), రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులు తలొగ్గి వ్యవహరిస్తున్నారన్నది మరోసారి స్పష్టమైంది. అత్యంత వివాదాస్పద పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఒంగోలు పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజ్‌ (పీటీసీ) ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌కు హఠాత్తుగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతలు అప్పగించారు.

రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలోని ఈ కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలు అప్పగించడం గమనార్హం. అదీ పంజాబ్‌ ఎన్నికల పరిశీలకుడిగా వెళ్లిన ఆయన పోలింగ్‌ ముగిసిన తరువాత వ్యక్తిగత పనులపై సెలవులో ఉన్నారు. సెలవులో ఉన్న దామోదర్‌ను హఠాత్తుగా పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలని.. కంట్రోల్‌ రూమ్‌ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలని ఉత్తర్వులు జారీచేయడం వెనుక ఏదో పెద్ద గూడుపుఠాణి ఉందన్నది స్పష్టమవుతోంది.  

టీడీపీకి వీర విధేయుడు.. 
2007 గ్రూప్‌–1 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ దామోదర్‌ అత్యంత వివాదాస్పద అధికారిగా గుర్తింపు పొందారు. ప్రధానంగా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా వైఎస్సార్‌సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేరడంలో కీలకపాత్ర పోషించిన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. వారి మధ్య బంధుత్వం కూడా ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, ఏబీ వెంకటేశ్వరరావు అండతో ఆయన అడ్డగోలుగా వ్యవహరించారు. పశి్చమ గోదావరి జిల్లా అదనపు ఎస్పీగా ఆయన వివాదాలకు కేంద్ర బిందువయ్యారు.

ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇక నాన్‌ కేడర్‌ ఎస్పీ అయినప్పటికీ దామోదర్‌ను 2019 సంవత్సరంలో ఎన్నికల కోసమని విజయనగరం జిల్లా ఎస్పీగా నియమించారు. వైఎస్సార్‌సీపీ పటిష్టంగా ఉన్న విజయనగరం జిల్లాలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే ఆయనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించారు. అనుకున్నట్లుగానే 2019 ఎన్నికల పోలింగ్‌ రోజున టీడీపీ రౌడీమూకలు కర్రలు, కత్తులతో బీభత్సం సృష్టించి కురుపాం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని బంధించాయి.

దాదాపు నాలుగు గంటలపాటు టీడీపీ రౌడీమూకలు స్వైర విహారం చేసినా పోలీసులు,  ఎస్పీగా ఉన్న దామోదర్‌ సైతం పట్టించుకోలేదు. సరికదా అదనపు బలగాలను కూడా అక్కడికి పంపించలేదు. అప్పట్లో విశాఖపట్నం డీఐజీ స్పందించి అదనపు బలగాలను కురుపాం పంపించడంతో నాలుగు గంటల తరువాత పరిస్థితి అదుపులోకి వచ్చింది. అదీ దామోదర్‌ అసమర్థ, నిర్లక్ష్యపూరిత ట్రాక్‌ రికార్డ్‌.

అలాంటి అధికారికి కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలా?
ఎన్నికల విధుల్లో ఉద్దేశపూర్వకంగా అంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్‌ దామోదర్‌కు ప్రస్తుతం రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలు అప్పగించారు. డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా, ఈసీకి నోడల్‌ అధికారిగా ఉన్న అదనపు డీజీ (శాంతి, భద్రతలు) శంకబాత్ర బాగ్చీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా విధ్వంసకర సంఘటనలు జరిగితే వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం, అందుకోసం జిల్లా ఎస్పీలకు తగిన ఆదేశాలు జారీచేయడం ఆయన బాధ్యత. అంటే.. డీజీపీ తరఫున జిల్లా ఎస్పీలకు ఆయనే ఆదేశాలు జారీచేస్తారు.

2019 ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలను అడ్డుకోవడంలో విఫలమైన ఆయన ప్రస్తుతం కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలను ఎలా నిర్వహించగలరని డీజీపీ, అదనపు డీజీ భావించారో అర్థంకావడంలేదు. టీడీపీకి అనుకూలంగా వ్యవహరించేందుకే దామోదర్‌కు ఈ బాధ్యతలు అప్పగించారా అనే సందేహాలు బలపడుతున్నాయి. ఇటీవల పోలింగ్‌ రోజున పల్నాడు నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ గూండాలు విధ్వంసానికి పాల్పడ్డాయి.

అదే రీతిలో కౌంటింగ్‌ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా దాడులు, దౌర్జన్యానికి కుట్ర పన్నుతున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి. అయినాసరే.. టీడీపీకి అనుకూల అధికారిగా గుర్తింపు పొందిన దామోదర్‌కు కంట్రోల్‌ రూమ్‌ బాధ్యతలు అప్పగించడం వెనుక పక్కా కుట్ర ఉన్నట్లుగా స్పష్టమవుతోంది. టీడీపీ విధ్వంసకాండకు కొమ్ముకాసేందుకు.. టీడీపీ గూండా మూకలపై కఠిన చర్యలు తీసుకోకుండా ఎస్పీలను నిలువరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement