పేకాట మొదలు | Starting a poker club without permits | Sakshi
Sakshi News home page

పేకాట మొదలు

Published Fri, Jun 28 2024 5:30 AM | Last Updated on Fri, Jun 28 2024 5:30 AM

Starting a poker club without permits

మళ్లీ తెరుచుకుంటున్న క్లబ్‌లు, శిబిరాలు 

అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండాదండా

గుంటూరు నడిబొడ్డున ఏ అనుమతులు లేకుండా పేకాట క్లబ్‌ ప్రారంభం

టీడీపీ హయాంలో క్లబ్‌లది ప్రత్యేక చరిత్ర 

రిక్రియేషన్‌ పేరుతో పేకాట, బెట్టింగ్, అసాంఘిక కార్యకలాపాలు.. వీటి బారిన పడి ఆస్తులు కోల్పోయి అప్పుల పాలైన వారెందరో 

ఆత్మహత్యలతో రోడ్డున పడ్డ కుటుంబాలు 

2019లో వీటిని మూసివేయించిన వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. మళ్లీ తెరుచుకోకుండా చర్యలు 

అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్‌లపై నిషేధం.. టీడీపీ కూటమి విజయంతో మళ్ళీ ప్రారంభమవుతున్న క్లబ్‌లు

 సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేకాట మళ్లీ మొదలైంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మూసేయించిన పేకాట క్లబ్‌లు టీడీపీ అధికారంలోకి రావడంతో మళ్లీ తెరుచుకుంటున్నాయి. అధికార కూటమి నేతలు క్లబ్‌లను ప్రారంభించేందుకు వారం రోజులుగా సన్నాహాలు చేస్తున్నారు. ఎటువంటి అనుమతులు లేకుండానే అధికారాన్ని అడ్డం పెట్టుకుని క్లబ్‌లను ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే గుంటూరు నగరంలో నడిబొడ్డున ఉన్న ప్రముఖ క్లబ్‌లో బుధవారం నుంచి పేకాట ప్రారంభమైంది.

గత టీడీపీ ప్రభుత్వాల హయాంలో పేకాట క్లబ్బులది ప్రత్యేక చరిత్ర. రిక్రియేషన్‌ పేరుతో ఈ క్లబ్‌లలో పేకాటే కాదు.. బెట్టింగులు, అసాంఘిక కార్యకలాపాలూ కొనసాగేవి. ఊర్ల శివార్లు, తోటల్లో ప్రత్యేక శిబిరాలు కూడా నిర్వహించేవారు. అంతా ఆ పార్టీ నేతల నిర్వహణలో, వారి కనుసన్నల్లోనే జరుగుతుండేవి. వీటిని మూసి వేయాలని ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశాయి. 

అయినా అధికార పార్టీ ఎమ్మెల్యేల అండతో అవి నిరాఘాటంగా కొనసాగాయి. 2019లో రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా క్లబ్‌లను మూసివేయించింది. రిక్రియేషన్‌ పేరుతో క్లబ్‌లలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, పేకాట, బెట్టింగ్‌లను పూర్తిగా నిషేధించింది. వీటి మూసివేతకు ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. గత ఐదేళ్లలో ఎక్కడా పేకాట క్లబ్‌లు నడవకుండా చర్యలు తీసుకుంది.

టీడీపీ కూటమి అధికారంలోకి రాగానే
రాష్ట్రంలో మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు మళ్లీ క్లబ్‌లు, శిబిరాలు తెరిచి పేకాట, బెట్టింగ్, ఇతర కార్యకలాపాలకు రంగం సిధ్ధం చేస్తున్నారు. క్లబ్‌ల నిర్వాహకులు ఇప్పటికే స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించగా, తాము చూసుకుంటామని, క్లబ్‌లు ప్రారంభించుకోండని భరోసా ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఎలాంటి అనుమతులు లేకపోయినా 2019కి ముందు మాదిరిగానే మళ్లీ క్లబ్‌ల వ్యవహారాలు నడిపించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గతంలో ఆడిన క్లబ్‌ సభ్యులకు మళ్ళీ పేకాట ప్రారంభిస్తున్నట్టు సమాచారం అందించారు.

రోజూ లక్షల్లో వ్యాపారం
క్లబ్‌లో ప్రతి ఆటకు ప్రతి టేబుల్‌ నుంచి సుమారు రూ.1000 చొప్పున కమీషన్‌ తీసుకుంటారు. అలా 20కి పైగా టేబుల్స్‌తో పేకాట, సైడ్‌ బిజినెస్‌లతో రోజూ లక్షల్లో వ్యాపారం జరుగుతుంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ పేకాట కొనసాగుతూనే ఉంటుంది. ఈ క్లబ్‌ల బారిన పడి ఉన్నతస్థాయిలో ఉన్న వారు, మధ్యతరగతి వారు అనేక మంది ఆస్తులు పోగొట్టుకొని, అప్పుల పాలైపోయారు. 

వారిలో కొందరు దిక్కు తోచక ఆత్మహత్యలు కూడా చేసుకొన్నారు. దీంతో వారి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. బాగు పడిందల్లా క్లబ్‌ల నిర్వాహకులు, వాటి నుంచి నెలనెలా మామూళ్ల రూపంలో లక్షలాది రూపాయలు దండుకొనే కొందరు టీడీపీ ప్రజాప్రతినిధులే. ఇప్పుడు మళ్లీ ప్రజల జేబులను పీల్చి పిప్పి చేసి, తమ జేబులు నింపుకొనేందుకు అధికార కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. 

ఇవి మళ్లీ ప్రారంభమైతే మధ్య తరగతి కుటుంబాల జీవితాలు చీకటిమయం కావడం ఖాయం. అధికార పార్టీ నాయకులకు భయపడి ఇలాంటి క్లబ్‌లను పోలీసులు చూసీ చూడకుండా వదిలేస్తారా లేక వాటిపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement