టిడ్కో ఇళ్లకూ రూ.8,929 కోట్ల ‘టెండర్‌’ Sketch to rob five lakh poor people | Sakshi
Sakshi News home page

టిడ్కో ఇళ్లకూ రూ.8,929 కోట్ల ‘టెండర్‌’

Published Sun, Sep 10 2023 5:15 AM | Last Updated on Sun, Sep 10 2023 5:15 AM

Sketch to rob five lakh poor people - Sakshi

సాక్షి, అమరావతి :  మాజీ సీఎం చంద్రబాబునాయుడు తన అక్రమాలకు, అవినీతికీ పట్టణాల్లోని టిడ్కో ఇళ్లనూ వదిలిపెట్టలేదు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు 2016–17లో ఎక్కడా లేనంతగా నిర్మాణ వ్యయాన్ని చూపించి దోచుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ టౌన్‌షిప్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఏపీ టిడ్కో) ద్వారా రాష్ట్రంలోని పట్టణాల్లో నివసిస్తున్న ఇళ్లులేని 5 లక్షల మంది పేదలకు ప్రభుత్వ స్థలాల్లో 300, 365, 415 చ.అ విస్తీర్ణంలో జీ+3 విధానంలో ఫ్లాట్లు కట్టిస్తామని నమ్మబలికారు.

300 చ.గ విస్తీర్ణం గల ఫ్లాట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి బ్యాంకు రుణాలు ఇప్పించి, నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని (రూ.7.20 లక్షలు) షరతు పెట్టారు. ఇక్కడే చంద్రబాబు బృందం నిర్మాణ కంపెనీల నుంచి ముడుపులు తీసుకుని, ఎక్కువ ముడుపులు చెల్లించిన కంపెనీకి అధిక ధరకు.. తక్కువ ఇచ్చిన కంపెనీకి ఆ మేర తక్కువ ధరకు నిర్మాణ అనుమతులు కట్టబెట్టారు. ఎంతగా అంటే.. ఆనాడు మార్కెట్‌లో ఏ ప్రైవేటు బిల్డర్‌ కూడా వసూలుచేయనంత ధర నిర్ణయించారు.  

ఇచ్చుకున్నోడికి ఇచ్చుకున్నంత.. 
నిజానికి.. 2016–17లో మార్కెట్‌లో చ.అడుగు నిర్మాణ ధర రూ.వెయ్యి కంటే తక్కువే ఉండగా.. చంద్రబాబు మాత్రం కంపెనీలు ఇచ్చుకున్న ముడుపుల స్థాయిని బట్టి రూ.2,534.75 నుంచి రూ.2,034.59గా నిర్ణయించి, సగటున చ.అ నిర్మాణ ధర రూ.2,203.45గా చెల్లించారు. అంటే అప్పటి మార్కెట్‌ ధరతో పోలిస్తే రూ.1,203.45 అదనంగా నిరుపేదల నుంచి వసూలు చేశారు.

వాస్తవానికి ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు మార్కెట్‌ ధర కంటే ఇంకా తగ్గాల్సింది పోయి భారీగా పెంచేశారు. ఇలా టీడీపీ ప్రభుత్వం తలపెట్టిన 5 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప్లాన్‌ చేసిన చంద్రబాబు ప్రభుత్వం 3.15 లక్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో తొలి విడతగా 2,08,160 యూనిట్లను 7,42,01,820 చ.అ. విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతులిచ్చి చంద్రబాబు సర్కారు రూ.8,929.81 కోట్ల అవినీతికి పాల్పడింది.   

వ్యాట్‌ నుంచి గడ్డి వరకు.. 
సాక్షి, అమరావతి: చంద్రబాబు జమానా అంతా అవినీతి, అక్రమాలే. రాష్ట్ర విభజన నాటికి రైసు మిల్లర్లకు బకాయి పడిన రూ.500 కోట్ల వ్యాట్‌ బకాయిలను మాఫీ చేస్తూ 2015లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం వెనుక లోకేశ్‌ హస్తం ఉందని బహిరంగంగానే ఆరోపణలు విన్పించాయి. మిల్లర్లతో లోకేశ్‌  రాయబేరాలు సాగించి బకాయిలు రద్దు చేయాలంటే రూ.200 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్‌లో బియ్యం ఎగుమతులపై కూడా వ్యాట్‌ రద్దు చేస్తే, అడిగింది ఇచ్చేందుకు సిద్ధమని మిల్లర్లు చెప్పారు. దీంతో మిల్లర్ల వ్యాట్‌ బకాయిల మాఫీ అతి వేగంగా జరిగిపోయింది. 

పత్తి రైతుల పేరిట రూ.200 కోట్లు స్వాహా
నాసిరకం పత్తిని సీసీఐకు అమ్మేసి, చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన ప్రత్తిపాటి పుల్లారావు రూ.200 కోట్లు తినేసినట్లు ఆరోపణలు వచ్చాయి.  ఇందులో సగభాగం చంద్రబాబుకు ముట్టినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది. పుల్లారావు ఓ వ్యాపారితో కలిసి రైతుల పేరిట నాసిరకం పత్తిని కొన్నారు. దీనిని బంధువులు, దళారుల పేర్లతో సీసీఐకు అమ్మేశారు. అంతేకాదు సీసీఐ సేకరించిన పత్తిలో 80 శాతం బోగస్‌ రైతుల నుంచి కొన్నట్లు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం కూడా తేల్చింది. 

పచ్చిగడ్డిలోనూ పచ్చ నేతల మేత
పశువుల గడ్డిలోనూ టీడీపీ నేతల మేత బాగానే ఉంది. సైలేజ్‌ (పాతర గడ్డి) పేరిట ‘కోట్లు’ స్వాహా చేశారు. ప్రభుత్వం ఏటా 75 శాతం సబ్సిడీపై రైతులకు పశుగ్రాసం సరఫరా చేస్తుంటుంది.  అప్పటి  స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కుమార్తె సాయికృపా పేరిట ఏర్పాటు చేసిన కంపెనీ పేరుతో  రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు సబ్సిడీ సొమ్మును కాజేశారు. రైతులు చెల్లించాల్సిన వాటాను బినామీల పేరిట చెల్లించి 75 శాతం సబ్సిడీ సొమ్మును స్వాహా చేశారు. ఈ వ్యవహారంపై జరిగిన విజిలెన్స్‌ విచారణను సైతం చంద్రబాబు బుట్టదాఖలు చేశారు. 

చంద్రన్న కానుక పేరిట కోట్లు స్వాహా
2015 సంక్రాంతి పండుగ వేళ చంద్రన్న కానుక పేరిట నాణ్యత లేని రేషన్‌ సరుకులను కార్డుదారులకు పంచిపెట్టారు. ఈ పథకం కింద ఒక్కో కార్డుదారునికి కానుక కోసం రూ.270 చొప్పున కాంట్రాక్టర్లకు రూ.430 కోట్లు ఇచ్చారు. అయినా ఎందుకూ పనికిరాని రేషన్‌ సరుకులు సరఫరా చేశారు. పురుగులు పట్టిన కందిపప్పు, పనికిరాని బెల్లం, దుర్వాసన కొట్టే గోధమ పిండి పంచి పెట్టి రూ.100 కోట్లకు పైగా వెనకేసుకున్నారు.  

కార్మికుల సొమ్మూ తినేశారు
సాక్షి, అమరావతి: నెలనెలా జీతం నుంచి ఈఎస్‌ఐ కోసం డబ్బులు చెల్లించే కార్మికుల సొమ్మునూ కాజేశారు టీడీపీ నేతలు. 2014 – 2019 మధ్య రూ.150 కోట్లకు పైగా కార్మికుల సొమ్మును తినేశారు. అప్పటి కార్మిక శాఖ మంత్రి హోదాలో అచ్చెన్నాయుడు ఇచ్చిన సిఫార్సు లేఖలతో నామినేషన్‌పై ఆర్డర్లు ఇచ్చి ఈఎస్‌ఐలో మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో భారీ దోపిడీకి పాల్పడినట్లు విజిలెన్స్‌ విచారణలో వెల్లడైంది. ఈ అవినీతి బాగోతంపై విచారణ జరిపిన ఏసీబీ అధికారులు 2020లో అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారు. ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్లు డాక్టర్‌ సీకే రమేష్‌కుమార్, డాక్టర్‌ జి.విజయ్‌కుమార్‌ సహా పలువురిని కూడా అప్పట్లో అరెస్టు చేశారు. ఈ కుంభకోణం దర్యాప్తు తుది దశకు చేరింది. త్వరలో ఏసీబీ చార్జిషీట్‌ను కోర్టులో దాఖలు చేయనుంది.

కార్మికుల సొమ్ము తినేశారిలా..
నిబంధనల ప్రకారం ఏ కాంట్రాక్టు అయినా రూ.10 లక్షల విలువ దాటితే ఈ–టెండర్లు నిర్వహించాలి. ఇందుకు విరుద్ధంగా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఎవరికి ఏ కాంట్రాక్టు ఇవ్వాలో అధికారులను ముందే ఆదేశించారు. ఈమేరకు లెటర్‌హెడ్‌పై సిఫార్సులు చేస్తూ అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్‌కు లేఖ రాశారు. ఈ లేఖ ఆధారంగా ఆయన సూచించిన కంపెనీలకు మందులు, వైద్య పరికరాల సరఫరా, ఇతర కాంట్రాక్టులు అప్పజెప్పారు. అప్పటి మంత్రి అచ్చెన్నాయుడు ఒత్తిడితో టెలీ హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కాల్‌ సెంటర్, టోల్‌ఫ్రీ, ఈసీజీ కాంట్రాక్టు ఇచ్చారు. ఎక్కడైనా రూ.200 మాత్రమే ఉండే ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించారు.

కాల్‌ సెంటర్‌లో కాల్స్‌కి కాకుండా సర్వీస్‌ ప్రొవైడర్‌ మొత్తం రిజిస్టర్‌ ఐపీ, ఫేక్‌ కాల్‌ లాగ్స్‌కి కూడా రూ.1.80 చొప్పున బిల్‌ క్లెయిమ్‌ చేశారు. ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్‌ ప్రాతిపదికన రూ.89.58 కోట్ల విలువైన మందులు కొన్నారు. లెజెండ్‌ ఎంటర్‌ప్రై జెస్, ఎవెంటార్, ఓమ్ని మెడి తదితర సంస్థలకు భారీ లబ్ధి చేకూర్చారు. ఆయా సంస్థల నుంచి అచ్చెన్న, కొందరు అధికారులు భారీగా ప్రయోజనం పొందారు. లేబొరేటరీ కిట్‌ల కోసం రూ.237 కోట్లు ఖర్చు చేశారు.

రూ.16 వేలు విలువ చేసే బయోమెట్రిక్‌ మెషీన్లను రూ.70 వేలకు కొన్నారు.  ఫ్యాబ్రికేటెడ్‌ కొటేషన్ల ద్వారా మందులు, శస్త్రచికిత్సల పరికరాలు, ఫర్నీచర్, ఈసీజీ మెషీన్లు కొన్నారు. సీవరేజీ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు పనులు ఎలాంటి టెండరు లేకుండా జలం ఎన్విరాన్‌మెంట్‌ సంస్థకు అప్పగించారు. కార్మికులకు షాంపూలు, క్రీముల పేరుతో రూ.10.50 కోట్లు ఖర్చు చేశారు. ఏటా బడ్జెట్టే రూ. 300 కోట్లు ఉండగా, రూ.500 కోట్లకు పైగా ఆర్డర్లు పెట్టి దోచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement