వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే! | Sakshi Exclusive Interview With YS Vivekananda Reddy PA MV Krishna Reddy | Sakshi
Sakshi News home page

వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే!

Published Tue, Mar 5 2024 4:23 AM | Last Updated on Tue, Mar 5 2024 1:03 PM

Sakshi Exclusive Interview With YS Vivekananda Reddy PA MV Krishna Reddy

వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదం

వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు

రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని భావించిన వివేకా

వివేకా లెటర్‌ను దాచిపెట్టమని అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు

అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారు

ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి 

పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారు

నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి 

జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారు

దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర

అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషిచేశారు 

‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి

సాక్షి, అమరావతి: ‘వైఎస్‌ వివేకానందరెడ్డిని ఆయన కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డే హత్య చేయించి ఉండొచ్చు. ఈ హత్య వెనుకనున్న ఏదో విషయాన్ని దాచిపెట్టాలని వారు ప్రయత్నిస్తున్నారు. వివేకం సార్‌ రెండో పెళ్లితో ఆ ఇంట్లో తలెత్తిన ఆస్తి గొడవలకు ఆయన హత్యకు ఏదైనా సంబంధం ఉందా.. అనిపిస్తోంది. కూతురు, అల్లుడు, పెద్ద బావమరిదే ఈ దారుణానికి తెగించి ఉండొచ్చు’.. అని వైఎస్‌ వివేకానందరెడ్డి పీఏగా చేసిన ఎంవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ‘వివేకానందరెడ్డి రాసిన లెటర్‌ పోలీసులకు వెంటనే ఇచ్చేసి ఉంటే దర్యాప్తు సక్రమంగా సాగేది.

కానీ, ఆ లెటర్‌ను దాచిపెట్టమని ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఎందుకు చెప్పారు? ఈ కేసుతో సంబంధంలేని ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిల పేర్లు చెప్పాలని నన్ను ఎందుకు బెదిరించారు? నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’ అని సునీత ఎందుకు అన్నారని కూడా ఆయన వెల్లడించడం ప్రాధాన్యం సంతరించుకుంది. వివేకానందరెడ్డిని పాశవికంగా హత్య చేశానన్న దస్తగిరిని అప్రూవర్‌గా మార్చడం ఏమిటీ? అతను చెప్పే కట్టుకథలను పట్టుకుని సీబీఐ దర్యాప్తు చేయడమేమి­టని ఆయన ప్రశ్నించారు.

వైఎస్‌ వివేకానందరెడ్డి చివరివరకు కూడా వైఎస్‌ జగన్‌ను సీఎం చేయడానికి, వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడానికే కృషిచేశారని ఆయన స్పష్టంచేశారు. వివేకాకు పీఏగా దాదాపు 37ఏళ్ల పాటు పనిచేసిన కృష్ణారెడ్డి.. ఆయనకు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తునిగా గుర్తింపు పొందారు. ఆయన కుటుంబ వ్యవహారాలతో సహా అన్ని విషయాలు సమగ్రంగా తెలిసిన వ్యక్తి. 2019, మార్చి 15 ఉదయం వివేకానందరెడ్డి మృతిచెందిన విషయాన్ని కృష్ణారెడ్డే మొదటగా గుర్తించి ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో పోలీసులు, తరువాత సీబీఐ అధికారుల చేతిలో చిత్రహింసలకు గురైన బాధి­తుడు కూడా కృష్ణారెడ్డే. వైఎస్‌ వివేకా హత్య కేసుకు సంబంధించిన అన్ని పరిణామాలను సమీపం నుంచి పరిశీలిస్తున్న కీలకవ్యక్తి అయిన కృష్ణారెడ్డి ‘సాక్షి’కి ఇచి్చన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విషయాలను వెల్లడించారు. 

సాక్షి: 2019, మార్చి 15న ఏ సమయంలో మీరు వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లారు? 
కృష్ణారెడ్డి:
రోజూ వెళ్లినట్లే ఆ రోజు కూడా ఉ.5.30కే వివేకం సార్‌ ఇంటికి వెళ్లాను. ఇంట్లో లైట్‌వేసి లేదు. అంటే సారు ఇంకా నిద్ర నుంచి లేవలేదని అనుకున్నా. బయట లైట్‌ దగ్గర కూర్చుని పేపర్‌ చదువుకుంటూ ఉన్నా. కాసేపటి తరువాత సౌభాగ్యమ్మకు ఫోన్‌చేసి సార్‌ ఇంకా నిద్ర లేవలేదు.. మీరు ఫోన్‌చేసి నిద్ర లేపుతారా అని అడిగాను. రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చి ఉంటారు.. కాసేపు నిద్రపోనీ అని ఆమె చెప్పారు. కాసేపటికే వంట మనిషి లక్ష్మమ్మను ఆమె కొడుకు ప్రకాశ్‌ తన బైక్‌ మీద తీసుకొచ్చాడు. ఆలస్యమైంది కిటికీ వద్దకు వెళ్లి సారును నిద్రలేపు అని చెప్పాను.

ఆ సమయంలో వాచ్‌మెన్‌ రంగన్న మెయిన్‌ డోర్‌ ముందర నిద్రపోతూ ఉన్నాడు. లక్ష్మమ్మ వచ్చేసరికి రంగన్న నిద్రలేచి  ఉత్తరం వైపు ఉన్న పార్కు వైపు వెళ్లాడు. ఇంతలో ‘సార్‌ పడిపోయాడు’ అని అరుచుకుంటూ రంగన్న వచ్చాడు. మేము ఆ వైపు పరిగెత్తి వెళ్లాం. ఇంటికి ఉత్త­రం వైపు ఉన్న తలుపు తెరచి ఉంది. లోపలికి వెళ్లి చూస్తే సార్‌ హాల్లోగానీ బెడ్‌రూమ్‌లోగానీ లేరు. అక్కడ రక్తపు మరకలు ఉన్నాయి. బాత్రూమ్‌లో చూస్తే వివేకం సార్‌ రక్తపుమడుగులో పడి ఉన్నా­రు. నేను సార్‌ చేయిపట్టుకుని నాడి చూశాను. నాడి కొట్టుకోవడంలేదు. ఆయన చనిపోయారని నిర్ధారించుకున్నా.  

సాక్షి: ఆ వెంటనే మీరు ఏం చేశారు?  
కృష్ణారెడ్డి:
నేను వెంటనే సార్‌ అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ చేసి చెప్పాను. బావ మనకు లేరు.. ఎవరో ఏదో చేశారు. రక్తపు మడుగులో ఉన్నారు. తల మీద గాయం ఉంది అని చెప్పాను. సరే అని ఆయన ఫోన్‌ పెట్టేశారు. నేను 6.15కు కాల్‌ చేశాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి నాతో 47 సెకన్లు మాట్లాడి ఫోన్‌ పెట్టేశారు. ఆ తరువాత సార్‌ పెద్ద బావమరిది శివప్రకాశ్‌రెడ్డికి కాల్‌ చేశాను. కానీ, ఆయన ఫోన్‌ కలవలేదు. నాకు సౌభాగ్యమ్మ ఫోన్‌ నుంచి కాల్‌ వచి్చంది. నేను మేడంకు కూడా విషయం చెప్పాను.  

సాక్షి: ఆ తరువాత ఏం జరిగింది? 
కృష్ణారెడ్డి:
నేను, ప్రకాశ్‌ అక్కడ ఉండగా వీల్‌ చెయిర్‌ దగ్గర లెటర్‌ దొరికింది. ఆ లెటర్‌ చదివాను. తన మాజీ డ్రైవర్‌ తనను చంపినట్లు వివే­కం సార్‌ ఆ లెటర్‌లో రాసి ఉంది. ఇంతలో సౌభా­గ్యమ్మ నాకు ఫోన్‌ చేశారు. అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి ఫోన్‌ ఇమ్మన్నాను. ఆమె ఆయనకు ఫోన్‌ ఇస్తే ఆ లెటర్‌లో రాసింది చదివి వినిపించాను. ఆ లెటర్‌ను దాచిపెట్టు. ఎవరికి చెప్పొద్దు.. అని రాజశేఖర్‌రెడ్డి చెప్పారు. లెట­ర్‌ గురించి పోలీసులకు చెప్ప­కపోతే ఇబ్బంది అవు­తుంది కదా అని అన్నాను.

ఏం ఇబ్బంది అవ్వదు.. మేం చూసు­కుంటాం.. ఆ లెటర్‌ జాగ్రత్తగా దాచిపెట్టు అని ఆయన చెప్పారు. దాంతో ఆ లెటర్‌ విషయం పోలీసులకుగానీ ఎవరికీగానీ చెప్ప­లేదు. వంట మనిషి లక్ష్మమ్మ కొడుకు ప్రకాశ్‌కు ఆ లెటర్‌ ఇచ్చి మా ఇంట్లో ఇచ్చి రమ్మన్నాను. ఇంతలో రాజశేఖరరెడ్డి మళ్లీ నాకు ఫోన్‌ చేశారు. అప్పటికే సీఐ శంకరయ్య వచ్చా­రని చెప్పాను. ఆయన నా ఫోన్‌తో సీఐ శంకరయ్యతో మాట్లాడారు. తరువాత శంకరయ్య చెప్పినట్లుగా పోలీసు కంప్లైంట్‌ ఇవ్వమని రాజశేఖరరెడ్డి నాతో చెప్పారు. నేను అలానే చేశాను.  

సాక్షి: ఆ లెటర్‌ అప్పుడే పోలీసులకు ఇచ్చేసి ఉంటే ఈ కేసు దర్యాప్తు వేరే విధంగా ఉండేది కదా?  
కృష్ణారెడ్డి:
ఆ లెటర్‌ అప్పుడే పోలీసులకు ఇచ్చి ఉంటే కేసు దర్యాప్తు సరైన విధంగా జరిగేది. కానీ, నాకు ఇష్టంలేకపోయినా రాజశేఖరరెడ్డి చెప్పడంతోనే ఆ లెటర్‌ను దాచి ఉంచాల్సి వచి్చంది.  

సాక్షి: మిమ్మల్ని ఎందుకు అరెస్టు చేశారు?  
కృష్ణారెడ్డి:
నన్ను పోలీసులు ఎందుకు అరెస్టుచేశారో నాకే తెలీదు. లెటర్‌ దాచిపెట్టమని రాజశేఖరరెడ్డి చెప్పాడు. పోలీ­సు­లతో ఇబ్బంది వస్తుందని చెప్పినా తాను చూసుకుంటానని లెట­ర్‌ దాచి పెట్టమన్నాడు. టీడీపీ ప్రభుత్వం ఒత్తిడో.. వీళ్లు వాళ్లూ లాలూచీ అయి కృష్ణారెడ్డిని అరెస్టుచే­యిస్తే సరిపోతుందని అనుకున్నారో తెలీదు.  

సాక్షి: మిమ్మల్ని అరెస్టు చేశాక ఏం జరిగింది?  
కృష్ణారెడ్డి:
నన్ను అదేరోజు సాయంత్రం పోలీసులు అరెస్టుచేసి డీటీసీలో 13 రోజులపాటు ఉంచారు. బాగా కొట్టారు. రాజశేఖర్‌రెడ్డి చేశాడా.. శివశంకర్‌రెడ్డి చేసి ఉంటాడా చెప్పు అని తీవ్రంగా కొట్టారు. నాకు తెలీదని ఎంత చెప్పినా వినిపించుకో­లేదు.

సాక్షి: పోలీసులకు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద అనుమానం కలిగిందా?  
కృష్ణారెడ్డి:
పోలీసులు ముందు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డినే అనుమానించారు. వివేకం సార్‌ను ఆయనే హత్య చేయించి ఉంటాడా అని అడిగారు. నాకేమీ తెలీదని చెప్పాను. పోలీసులు కొట్టడంతో దాదాపు ఏడాదిపాటు నా చేతితో ఏమీ పట్టుకోలేకపోయాను.  

సాక్షి: లెటర్‌ను దాచి పెట్టమన్న రాజశేఖర్‌రెడ్డిని ఎందుకు ప్రశి్నంచరు అని మీరు పోలీసులను అడగలేదా?  
కృష్ణారెడ్డి:
పోలీసులు నన్ను కొడుతూ ఉంటే నేనేం మాట్లాడను. నా మాట వాళ్లు వినిపించుకుంటే కదా.  

సాక్షి: రాజశేఖర్‌రెడ్డిని పోలీసులు ఎందుకు విచారించలేదు? 
కృష్ణారెడ్డి:
ఎందుకు విచారించలేదో మరి. సీబీఐ వాళ్లకు కూడా అదే విషయం చెప్పాను. కానీ, వాళ్లు కూడా పట్టించుకోలేదు. వాళ్ల మధ్య ఏం ఒప్పందం ఉందో తెలీదు. 

సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి సీఐ శంకరయ్యను బెదిరించారనే ఆరోపణ కూడా ఉంది కదా?  
కృష్ణారెడ్డి:
సీఐ శంకరయ్య పక్కనే నేనున్నా. ఆయన్ని ఎవరూ బెదిరించనే లేదు. 

సాక్షి: సీబీఐ కేసు దర్యాప్తు చేపట్టిన తరువాత ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పమని మీ మీద ఒత్తిడి వచి్చందా?  
కృష్ణారెడ్డి:
ఎంపీ అవినాశ్, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని రాంసింగ్‌ నన్ను బాగా వేధించారు. వాళ్లిద్దరూ నన్ను బెదిరించారని చెప్పమన్నారు. అలాంటిదేమీ లేదని నేను చెప్పడంతో నన్ను బాగా కొట్టా­రు. ఉన్నది ఉన్నట్లు చెబుతాగానీ అబద్ధం చెప్పనని నేను అంటే మరింత గట్టిగా కొట్టేవారు. కొట్టినా చంపినా నాకు తెలిసింది ఇంతే అని చెప్పాను.  

సాక్షి: ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లను ఇరికించాలని సీబీఐ అధికారి రాంసింగ్‌ ఎందుకు భావించారు?  
కృష్ణారెడ్డి:
సునీత, రాజశేఖరరెడ్డితో రాంసింగ్‌ ఏం కమిట్‌ అయ్యారో.. వాళ్లద్దరి పేర్లు చెప్పాలనే వేధించారు.  

సాక్షి: సీబీఐ అధికారి రాంసింగ్‌ మీతో ఎలా వ్యవహరించారు? 
కృష్ణారెడ్డి:
ఒకరోజు రాంసింగ్‌ ఫోన్‌చేశారు. తాము చెప్పినట్లు విన్నారు కాబట్టే రంగన్న, దస్తగిరిలను రక్షించాం. నేను కూడా చెప్పినట్లు వింటే రక్షిస్తామన్నారు. కడప సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌కు నా పిల్లలతో రమ్మని చెప్పారు. ఆ విషయాన్ని రాజశేఖర్‌రెడ్డికి చెబితే రాంసింగ్‌ చెప్పినట్లు చేయమన్నారు. మా ఇద్దరు కొడుకులతో సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌కు వెళ్లాం. వాళ్లు చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపిస్తామని బెదిరించారు. తాము పెద్దపెద్ద వాళ్లనే జైలుకు పంపాం.. నువ్వెంత అని అన్నారు. నాకు తెలిసిందే చెబుతా తప్పా మీరు చెప్పమన్నట్లు అబద్ధం చెప్పలేనని నేను అన్నా. దాంతో కర్ర తీసుకుని నా కొడుకుల ముందే దాదాపు 20 సార్లు తీవ్రంగా కొట్టారు.  

సాక్షి: మీ అబ్బాయి పెళ్లిని చెడగొట్టారు అంటారు.. 
కృష్ణారెడ్డి:
మేం సెంట్రల్‌ జైలు గెస్ట్‌హౌస్‌ నుంచి ఇంటికి వచి్చన మర్నాడే మా అబ్బాయికి సంబంధం కుదిరిన వారి నుంచి ఫోన్‌ వచి్చంది. పెళ్లి సంబంధం రద్దు చేసుకుంటున్నామని చెప్పారు. నా మీద కేసు ఉంది.. నేను జైలుకు వెళ్లాను.. మా ఆస్తులన్నీ తీసేసుకుంటామని సునీత, రాజశేఖర్‌రెడ్డి వారికి ఫోన్‌చేసి చెప్పారట. వాళ్లను హైదరాబాద్‌ పిలిపించుకుని మరీ బెదిరించి పెళ్లి సంబంధం రద్దుచేసుకునేలా చేశారు. వాళ్లు చెప్పినట్లు వినాలని నన్ను ఒప్పించేందుకు సునీత, రాజశేఖర్‌రెడ్డి అలా చేశారు. ఈ సంబంధం కాకపోతే మరో సంబంధం కుదురుతుందని నేను వారికి లొంగలేదు. 

సాక్షి: మీరు రాంసింగ్‌ మీద ఫిర్యాదు చేశారు కదా? 
కృష్ణారెడ్డి:
నేను ఎంతమందితో చిత్రవధలకు గురయ్యేది. టీడీపీ ప్రభుత్వంలో ముందు పోలీసులు కొట్టారు. సునీత, రాజశేఖర్‌రెడ్డి హైదరాబాద్‌ పిలిపించుకుని బెదిరించారు. మా అబ్బాయి పెళ్లి సంబంధం చెడగొట్టారు. సీబీఐ అధికారి రాంసింగ్‌ నన్ను కడపలో కొట్టారు. ఢిల్లీ పిలిపించుకుని గొడ్డు­ను బాదినట్లు కొట్టారు. ఇక ఎంతమందితో దెబ్బ­లు తినాలి.. అందుకే ఎస్పీకి ఫిర్యాదు చేశాను. నాకు ప్రాణహాని ఉంది.. భద్రత కల్పించాలని కోరా­ను. పులివెందుల కోర్టులో కూడా పిటిషన్‌ వేశాను. 

సాక్షి: వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని ఎంపీ అవినాశ్‌రెడ్డి చెప్పారని ఒక ఆరోపణ వచి్చంది. ఆయన అలా చెప్పారా? 
కృష్ణారెడ్డి:
ఆ మాటే వినలేదు. అసలు ఆ విషయం ఎలా బయటకు వచి్చందో కూడా నాకు తెలీదు.  

సాక్షి: దస్తగిరి ఎలాంటి వ్యక్తి?  
కృష్ణారెడ్డి:
దస్తగిరి డ్రైవర్‌గా ఉండేవాడు. ప్రవర్తన సరిగా లేదని తీసేశారు. వివేకం సార్‌ను ముసలోడా అనేవాడు. డ్యాన్స్‌ చేసేవాడు.. వెక్కిరించేవాడు. దాంతో సౌభాగ్యమ్మ అతనిని పని నుంచి తీసేశారు. అతని ఇంట్లో వాళ్లు వచ్చి బాధపడితే సౌభాగ్యమ్మను ఒప్పించి మళ్లీ పనిలో పెట్టించాను. కానీ, ఆ తరువాత దస్తగిరి మరింత మారిపోయాడు. వివేకం సార్‌ షమీమ్‌ ఇంటికి వెళ్లాలంటే ఇతనే డ్రైవర్‌. దాంతో దస్తగిరికే ఆయన ప్రాధాన్యం ఎక్కువ ఇచ్చేవారు. దస్తగిరి డబ్బు మనిషి.

సాక్షి: హత్య ప్రదేశంలో సాక్ష్యాధారాలను చెరిపేయాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి మీతో చెప్పారని కొందరు ఆరోపిస్తున్నారు? దీనిపై ఏమంటారు? 
కృష్ణారెడ్డి:
అసలు వివేకం సార్‌ మృతదేహాన్ని బాత్రూమ్‌ నుంచి తీసుకువచి్చనప్పుడు ఎంపీ అవినాశ్‌రెడ్డి అక్కడ లేనేలేరు. అక్కడ సాక్ష్యాలను చెరిపి వేయించింది ఎర్ర గంగిరెడ్డే. ఎంపీ అవినాశ్‌రెడ్డిని రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికే ఆ ఆరోపణలు చేస్తున్నట్లుగా 
ఉంది. అక్కడ తుడిపించి వేసింది గంగిరెడ్డే. అక్కడున్న అందరూ అది చూశారు.

సాక్షి: సీబీఐ అధికారులు పిలిస్తే మీరు ఢిల్లీ వెళ్లారు కదా.. అక్కడ ఏం జరిగింది? 
కృష్ణారెడ్డి:
సీఐబీ అధికారులు నోటీసు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డికి చెప్పే వెళ్లాను. నన్ను ఢిల్లీలో నెలరోజులు ఉంచి తీవ్రంగా వేధించారు. ఎంపీ అవినాశ్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని అక్కడ కూడా రాంసింగే వేధించారు. నాకు తెలిసింది ఇప్పటికే చెప్పాను. లెటర్‌ దాచి పెట్టడమే నేను చేసిన తప్పు.. అది కూడా రాజశేఖర్‌రెడ్డి చెబితేనే చేశాను.. అంతకుమించి నాకేమీ తెలీదని చెప్పాను. దాంతో వాళ్లు నన్ను కొట్టేవారు. రోజూ రాత్రి సునీత, రాజశేఖర్‌రెడ్డి ఫోన్‌ చేసేవారు. నన్ను తీవ్రంగా కొడుతున్నారని వారికి నేను చెప్పేవాడిని.. నెల రోజులవుతోందని చెప్పినా వారు పట్టించుకోలేదు. 

సాక్షి: మామా అల్లుళ్ల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి?  
కృష్ణారెడ్డి:
నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి మీద వివేకం సార్‌కు మంచి అభిప్రాయంలేదు. అల్లుడు కాబట్టి తప్పదు కదా. ఆయన మీద సార్‌ తరచూ 
కోప్పడేవారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతోందో నాకు తెలీదు. కానీ, అల్లుడి మీద సార్‌ గట్టిగా అరుస్తూ ఉండే­వారు. వివేకం సార్‌ రెండో భార్య షమీమ్‌ విషయంలోనే వాళ్ల మధ్య గొడవలు జరిగేవి. 

సాక్షి: వివేకానందరెడ్డి రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవా? 
కృష్ణారెడ్డి:
షమీమ్‌ అనే ఆవిడను వివేకం సార్‌ రెండో పెళ్లి చేసుకోవడంతో ఆ కుటుంబంలో గొడవలు జరిగేవి. ఒకరోజు సౌభాగ్యమ్మ, సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డి కలిసి వివేకం సార్‌తో గొడవ పడ్డారు. తాను షమీమ్‌ను పెళ్లి చేసుకోవడమే కాదు ఆమెతో తనకు ఒక అబ్బాయి కూడా ఉన్నాడని సార్‌ చెప్పారు. ఆ ఇద్దరి బాధ్యతతోపాటు ఆమెకున్న ఇద్దరు చెల్లెళ్లకు పెళ్లి చేయడం కూడా తన బాధ్యతేనని అన్నారు.  

సాక్షి: సునీత ఎందుకు అంతగా కేకలు వేశారు?  
కృష్ణారెడ్డి:
నా మీద సునీత కోపంతో అరుస్తూ ఉంటే రాజశేఖర్‌రెడ్డి ఆమెను సముదాయించేందుకు యత్నించారు. ‘ఈ కేసు విషయంలో కృష్ణారెడ్డి సహకరించకపోతే రాజశేఖర్‌రెడ్డి జైలుకు వెళ్లాల్సి వస్తుంది’ అని సునీత ఆయనతో అంది. నాకేమీ అర్థం కాలేదు. వివేకం సార్‌ హత్యలో వీళ్ల పాత్ర ఉందేమోనని మొదటిసారి అనిపించింది. అంటే నాతో అబద్ధం చెప్పించి వేరెవరినో నాశనం చేయాలని సునీత భావిస్తోందని అర్థమైంది.

సాక్షి: వివేకానందరెడ్డిని ఎవరు చంపి ఉంటారు? మీతో ఎందుకు అబద్ధం చెప్పించాలని చూస్తున్నారు? 
కృష్ణారెడ్డి:
ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి ఎందుకు ప్రయత్నిస్తున్నారో అర్థంకావడంలేదు. నాతో ఒక అబద్ధం చెప్పించాలని ప్రయత్నిస్తున్నారంటే.. దాని వెనుక వాళ్లకేదో ఉద్దేశం ఉండే ఉంటుంది. ఎవర్నో కాపాడేందుకు.. ఏదో నిజాన్ని దాచేందుకే వాళ్లిద్దరూ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోంది. సీబీఐ అధికారి రాంసింగ్‌ కూడా నాతో అబద్ధాలు చెప్పాలని ఎందుకు పట్టుబట్టారో తెలీడంలేదు. కేసు దర్యాప్తు సక్రమంగా సాగితేనే వాస్తవాలు బయటకొస్తాయి. కానీ,  సీబీఐ తీరు సక్రమంగాలేదు. అదే బాధేస్తోంది.  

సాక్షి: చివరగా.. వివేకా హత్య గురించి ఏమంటారు? 
కృష్ణారెడ్డి:
జరుగుతున్నదంతా చూస్తే.. సునీత, రాజశేఖర్‌రెడ్డి, శివప్రకాశ్‌రెడ్డిల మీదే అనుమానం కలుగుతోంది. వీళ్లే వివేకం సార్‌ను ఏమైనా చేసి మరొకరి మీద నింద వేయాలని చూస్తున్నారా అనిపిస్తోంది. ఆస్తి గొడవలు, షమీమ్‌ విషయం.. ఆస్తి వేరొకరికి పోతుందనే చేశారా అనిపిస్తోంది. ఎందుకంటే అబద్ధం చెప్పమని నన్ను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఎవరైనా నిజం చెప్పాలని అంటారు. కానీ, అబద్ధం చెప్పమని వీళ్లు ఎందుకు అంటున్నారన్నది చూడాలి. అందుకే వివేకం సార్‌ను వీళ్లే ఏమైనా చేశారనిపిస్తోంది. నేను అబద్ధం చెప్పకపోతే తన భర్త రాజశేఖర్‌రెడ్డి జైలుకు పోతారని కూడా సునీత నా ముందే అంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement