డీసీయూబీ డిపాజిటర్ల ఆందోళన RBI orders to stop bank transactions two years ago: Vijayawada | Sakshi
Sakshi News home page

డీసీయూబీ డిపాజిటర్ల ఆందోళన

Published Mon, Jun 17 2024 4:54 AM

RBI orders to stop bank transactions two years ago: Vijayawada

బ్యాంక్‌ లావాదేవీలు నిలిపివేయాలని రెండేళ్ల క్రితమే ఆర్బీఐ ఆదేశాలు

డిపాజిటర్ల కన్నీటిపర్యంతం

6 నెలలు ఓపిక పడితే ఆర్బీఐ నిబంధనలను సడలిస్తుందంటున్న సీఈఓ

భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయ­వాడ­లోని దుర్గా కో–ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ (డీసీ­యూబీ)లో డిపాజిట్‌ చేసిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాలపరిమితి ముగిసినా డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడంతో డిపాజిటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పు­కోవాలో తెలియని స్థితిలో కన్నీటి పర్యంతం అవు­తున్నారు. రుణాలు తీసుకున్న వారినుంచి రావా­ల్సిన మొండి బకాయిలు వసూలు చేయకపోవడంతో రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా డీసీయూబీ లావాదేవీలను నిలిపివేస్తూ 2022 జూలై 29న ఆదేశాలు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో విజయ­వాడ విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్‌లో గల డీసీయూబీ బ్రాంచి వద్ద పలువురు డిపాజిటర్లు ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు 92 ఏళ్ల చరిత్ర గల ఈ బ్యాంక్‌తో 40–50 అనుబంధం ఉన్నవారు రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డిపాజిట్లు చేశారు. వారికి సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మద్దతుగా నిలిచారు. డిపాజి­టర్లలో ఒకరైన ఎస్‌.లక్ష్మీకనకదుర్గ కుమారుడు సత్యకుమార్‌ మాట్లాడుతూ.. ఇక్కడ డిపాజిట్‌ చేసిన వారిలో అంతా 50–60 ఏళ్లు పైబడిన వారే­నని తెలిపారు.

ఓ మహిళ తన కుమార్తె వివాహం నిమిత్తం రూ.7 లక్షలు డిపాజిట్‌ చేసిందని, ఆ మొత్తం తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు. బ్యాంక్‌ సిబ్బంది డిపాజిటర్లు ఏమైనా అడిగితే దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. రుణాలు తీసు­కున్న ఖాతాదారుల నుంచి రావల్సిన బకాయిలను వసూలు చేయలేక డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. 

6 నెలల్లో కొలిక్కి రావచ్చు
బ్యాంక్‌లో పేరుకుపోయిన మొండి బకాయిల కారణంగా ఆర్బీఐ లావాదేవీలను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిందని బ్యాంక్‌ సీఈఓ బంకా శ్రీనివాసరావు తెలిపారు. డిపాజిటర్లు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని.. మొండి బకాయిలు ఉన్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం ద్వారా వసూలు చేయాలని ఆర్‌బీఐ ఆదేశించిందన్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకుఉండగా.. మొండి బకాయిలు రూ.240 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నాయన్నారు. డిపాజిటర్లు మరో 6 నెలలు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని, ఆర్బీఐ నిబంధనలను సడలింవచ్చన్నారు. అప్పుడు మెచ్యూర్‌ అయిన డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement