ఏపీలో విద్యుత్‌ నష్టాలు తక్కువ  | Power losses are less in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో విద్యుత్‌ నష్టాలు తక్కువ 

Published Thu, Jan 26 2023 5:08 AM | Last Updated on Thu, Jan 26 2023 2:45 PM

Power losses are less in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజలకు మెరుగైన సేవలందించడంలో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడి ఆంధ్రప్రదేశ్‌ ముందంజలో నిలుస్తోంది. ఆ కోవలోనే విద్యుత్‌ రంగంలో విప్లవాత్మక చర్యలను అమలు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవడమేగాక జాతీయస్థాయిలో అవార్డులు అందుకుంటోంది. తాజాగా టెక్నికల్, కమర్షియల్‌ (ఏటీసీ) నష్టాలను తగ్గించడంలో ఏపీ ముందంజలో నిలిచి కేంద్రం నుంచి ప్రశంసలు అందుకుంది.

అన్ని రాష్ట్రాల విద్యుత్‌ సంస్థలతో బుధవారం కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రి ఆర్‌.కె.సింగ్‌ వర్చువల్‌గా సమీక్షించారు. రాష్ట్రాల వారీగా విద్యుత్‌ సంస్థల పనితీరు, రీవాంప్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ స్కీమ్‌ (ఆర్‌డీఎస్‌ఎస్‌) పురోగతిపై చర్చించారు. ఆర్‌డీఎస్‌ఎస్‌లో ప్రధానంగా పరిగణించే ఏటీసీ నష్టాలు మన రాష్ట్రంలో 2018–19లో 16.36 శాతం ఉండేవి. 2021–22లో అవి 11.21 శాతానికి తగ్గాయి. ఈ కాలంలో మూడుశాతానికిపైగా నష్టాలను తగ్గించిన రాష్ట్రాల జాబితాను కేంద్రమంత్రి ప్రకటించారు.

ఈ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, హరియాణ, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మేఘాలయ, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, పశ్చిమబెంగాల్‌ ఉన్నాయి. 5.15 శాతం నష్టాల తగ్గింపుతో ఏపీ దేశంలోనే మొదటిస్థానంలో నిలిచింది. 2024–2025 నాటికి ఏటీసీ నష్టాలను 12–15 శాతానికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇప్పుడే చేరుకున్నాయి.

ఉదయ్‌ డ్యాష్‌బోర్డ్‌ ఆధారంగా డిస్ట్రిబ్యూషన్‌ యుటిలిటీ ఫోరం విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 12 రాష్ట్రాల్లో ఏటీసీ నష్టాలు 25 శాతం కంటే ఎక్కువ, ఆరు రాష్ట్రాలలో 15–25 శాతం మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ పంపిణీ సంస్థల పనితీరును అంచనా వేయడానికి కేంద్రం ఈ ఏటీసీ నష్టాలనే ప్రామాణికంగా తీసుకుంటోంది. అవి తక్కువగా ఉన్న, వేగంగా తగ్గించుకుంటున్న రాష్ట్రాలకు మాత్రమే ఆర్‌డీఎస్‌ఎస్‌ ద్వారా నిధులు సమకూరుస్తామని స్పష్టం చేసింది.

మరోవైపు ప్రీపెయిడ్‌ మోడ్‌లో స్మార్ట్‌మీటర్లు అమర్చడంపైనా మంత్రి ఆరాతీశారు. వ్యవసాయ ఫీడర్లకు సౌరవిద్యుత్‌ వినియోగం ప్రయోజనకరమని తెలిపారు. ఏపీ ఈ దిశగా సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ (సెకీ) నుంచి ఏడువేల మెగావాట్ల సౌరవిద్యుత్‌  కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల వ్యవసాయ వినియోగదారులకు పగటిపూట తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను అందించవచ్చని మంత్రి వెల్లడించారు. 

7 పోక్సో కోర్టులకు జడ్జీలు
గుంటూరు లీగల్‌: రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో ఏడు పోక్సో కోర్టులకు జిల్లా జడ్జీలను బదిలీపై నియమిస్తూ హైకోర్టు రిజిస్ట్రార్‌ (విజిలెన్స్‌) సునీత బుధ­వారం ఉత్తర్వులు జారీచేశారు. ఆయా జిల్లా జడ్జీలను అక్కడే ఉన్న పోక్సో కోర్టులకు బదిలీ చేశారు. అనంతపురంలోని ఎస్సీ, ఎస్టీ, ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి టి.రాజ్యలక్ష్మి, చిత్తూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఐదో అదనపు జిల్లా జడ్జి ఎన్‌.శాంతి, కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ప్రత్యేక మహిళా కోర్టు, తొమ్మిదో అదనపు జిల్లా జడ్జి డాక్టర్‌ షేక్‌ మహమ్మద్‌ ఫజులుల్లా, నెల్లూరులోని ప్రత్యేక మహిళా కోర్టు, ఎనిమిదో అదనపు జిల్లా జడ్జి సిరిపిరెడ్డి సుమ, ఒంగోలులోని ప్రత్యేక మహిళా కోర్టు, రెండో అదనపు జిల్లా జడ్జి ఎం.ఎ.సోమశేఖర్, విశాఖపట్నంలోని ప్ర­త్యే­క మహిళా కోర్టు, ఏడో అదనపు జిల్లా జడ్జి జి.ఆనంది, ఏలూరులోని ల్యాండ్‌ రీఫామ్స్‌ అప్పి­లేట్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్, రెండో అదనపు జిల్లా జడ్జి ఎస్‌.ఉ­మసునందల­ను పోక్సో కోర్టుల­కు జడ్జీ­లుగా బదిలీ చేశారు. బదిలీ అయి­న వా­రు పోక్సో కోర్టులకు జడ్జీలుగా కొన­సాగు­తూనే, ప్రస్తుతం వారు పని­చేస్తున్న జిల్లా కోర్టులకు ఫుల్‌ అడిషనల్‌ చార్జి జడ్జిగా విధులు నిర్వర్తించాలని పేర్కొ­న్నారు. జనరల్‌ బదిలీలు జరిగే వరకు ఫుల్‌ అడి­ష­నల్‌ చార్జి జడ్జీలుగా కొనసాగాలని తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement