సుదీర్ఘకాలం తర్వాత తెనాలికి మంత్రి పదవి Nadendla Manohar At AP Cabinet Minister | Sakshi
Sakshi News home page

సుదీర్ఘకాలం తర్వాత తెనాలికి మంత్రి పదవి

Published Thu, Jun 13 2024 11:20 AM | Last Updated on Thu, Jun 13 2024 11:20 AM

Nadendla Manohar At AP Cabinet Minister

 క్యాబినెట్‌లో నాదెండ్ల మనోహర్‌కు అవకాశం 

 మంత్రిగా ప్రమాణస్వీకారం   

తెనాలి: ఆంధ్రాప్యారిస్‌ తెనాలికి సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం లభించింది. కూటమి తరఫున జనసేన అభ్యర్థిగా గెలిచిన నాదెండ్ల మనోహర్‌ రాష్ట్ర మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.  రాజకీయ చైతన్యానికి నిలయమైన తెనాలి నుంచి ఎందరో రాజకీయ ఉద్దంఢులు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా సమర్థత నిరూపించుకున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి మంత్రి పదవులను చేపట్టినవారు కొందరే. నియోజకవర్గంలో 1952 నుంచి ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగ్గా, కేవలం నలుగురు మాత్రమే మంత్రి పదవులను చేపట్టారు. అందులో ముగ్గురు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించగా, మరొకరు అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశారు.

 కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వంలో నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో అప్పటి తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ హోదాలో ఉన్న విషయం తెలిసిందే.  2004, 2009 ఎన్నికల్లో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చినపుడు నాదెండ్ల మనోహర్‌ ఆ రెండు ఎన్నికల్లోనూ తెనాలి అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినపుడు నాదెండ్ల మనోహర్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ లైబ్రరీ కమిటీ చైర్మన్‌ పదవి వరించింది. తర్వాత క్యాబినెట్‌ హోదాతో అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్‌ పదవిని చేపట్టారు. నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ పదవిని నిర్వర్తించారు. 

అనంతర రాజకీయ పరిణామాలతో వైఎస్సార్‌ సీపీ ఆవిర్భవించింది. 2014లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున, 2019లో జనసేన  అభ్యరి్ధగా తెనాలి నుంచి పోటీచేసిన నాదెండ్ల మనోహర్, ఆ రెండు ఎన్నికల్లో ఓటమి చెందారు. 2024 వచ్చేసరికి రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. జనసేన పీఏసీ చైర్మన్‌గా జనసేన, టీడీపీల మధ్య పొత్తులో మనోహర్‌ కీలకపాత్ర పోషించినట్లు చెబుతారు. బీజేపీతో కూడా పొత్తు కుదరటంతో జనసేన, టీడీపీ, బీజేపీలు కూటమిగా 2024 ఎన్నికల్లో పోటీచేసి, అధికారాన్ని చేపట్టాయి. జనసేనలో నెంబర్‌ టూ అయిన తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌కు సహజంగానే మంత్రి పదవి లభిస్తుందని అందరూ ఊహించారు. 

ఆ ప్రకారంగానే గన్నవరం ఐటీ పార్కులో బుధవారం అట్టహాసంగా జరిగిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రమాణస్వీకారోత్సవంలో మంత్రులుగా ప్రమాణం చేసిన వారిలో నాదెండ్ల మనోహర్‌ కూడా ఉన్నారు. మనోహర్‌కు కీలక మంత్రిత్వ శాఖ లభిస్తుందనేది కూడా వాస్తవమే. 2009–14 మధ్య అసెంబ్లీ స్పీకర్‌గా చేసిన నాదెండ్ల మనోహర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చివరి స్పీకర్‌గా గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. 2014లో రాష్ట్ర విభజన జరిగిన పదేళ్ల తర్వాత విభజిత ఆంధ్రపదేశ్‌కు తెనాలి నుంచి తొలిగా మంత్రి పదవిని చేపట్టిన ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్‌ కావటం మరో విశేషం!  

1952 ఎన్నికల్నుంచి తెనాలిలో మూడుసార్లు పోటీచేసి గెలిచిన ఆలపాటి వెంకట్రామయ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఆయన కుమార్తె దొడ్డపనేని ఇందిర కూడా మూడు పర్యాయాలు తెనాలి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆమెకు మంత్రి పదవి దక్కలేదు. తర్వాత 1983, 1985 ఎన్నికల్లో తెనాలి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్నాబత్తుని సత్యనారాయణ ఎన్టీ రామారావు మంత్రివర్గంలో మంత్రిగా చేశారు. 1989లో తెనాలి నుంచి నాదెండ్ల భాస్కరరావు పోటీచేసి విజయం సాధించినా, డాక్టర్‌ చెన్నారెడ్డి క్యాబినెట్‌లో స్థానం దక్కలేదు.    

2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో కాంగ్రెస్‌ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చింది. 2009లోనూ మళ్లీ విజయాన్ని నమోదు చేసింది. ఆ రెండుసార్లు తెనాలి నుంచి కాంగ్రెస్‌ తరçపున ఎమ్మెల్యేగా గెలిచిన నాదెండ్ల మనోహర్‌ అసెంబ్లీ స్పీకర్‌గా చేశారు. మళ్లీ ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా నియమితులయ్యారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement