రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్‌ మీనా | Mukesh Kumar Meena On Election Code Violations in AP | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో రూ.483.15 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం: ముఖేష్‌కుమార్‌ మీనా

Published Tue, Jun 4 2024 3:54 AM | Last Updated on Tue, Jun 4 2024 3:54 AM

Mukesh Kumar Meena On Election Code Violations in AP

ఇందులో రూ.170 కోట్ల నగదు.. రూ.61.66 కోట్ల విలువైన మద్యం, రూ.35.97 కోట్ల డ్రగ్స్‌..

రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు.. రూ.29.34 కోట్ల విలువైన ఉచితాలు స్వాధీనం 

వీటికి సంబంధించి 11,249 కేసులు నమోదు

కోడ్‌ ఉల్లంఘనలపై 1,270 కేసులు

ఎన్నికల హింసలో ఇద్దరు మృతి.. 912 మందికి గాయాలు

సి–విజిల్‌ ద్వారా 24,557 ఫిర్యాదులు.. ఇందులో 95 శాతం వంద నిమిషాల్లో పరిష్కారం

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకుని ఈ ఏడాది జనవరి 1 నుంచి ఈనెల 2 వరకు రూ.483.15 కోట్ల విలువైన నగదు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లతోపాటు ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా చేపట్టిన చర్యలను సోమవారం సచివాలయంలో ఆయన మీడియాకు వెల్లడించారు. ఎన్నికల కోడ్‌ అమల్లో భాగంగా రూ.170 కోట్ల నగదు, రూ.61.66 కోట్ల విలువైన లిక్కర్, రూ.35.97 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.186.17 కోట్ల విలువైన ఆభరణాలు, రూ.29.34 కోట్ల విలువైన ఉచితాల వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివ­రించారు. 

వీటన్నింటికీ సంబంధించి 11,249 కేసు­లను, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలకు సంబంధించి 1,270 కేసులను నమోదు చేసినట్లు మీనా తెలి­పారు. ఇక ఎన్నికల హింసలో ఇద్దరు మృతిచెందగా 912 మందికి గాయాలయ్యాయన్నారు. ఈ హింస సందర్భంగా రూ.1,19,13,650 కోట్ల విలువైన ఆస్తి నష్టం జరిగిందన్నారు. 1,03,461 మందిని బైండోవర్‌ చేశామని.. అలాగే, సమస్యలు, అల్లర్లు సృష్టించే 551 మందిని గుర్తించి చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తొలిసారిగా 1,985 ప్రాంతాల్లో కార్టన్‌ సెర్చ్‌..
ఇదిలా ఉంటే.. సి–విజిల్‌ ద్వారా 24,557 ఫిర్యాదులు రాగా అందులో 95 శాతం ఫిర్యాదులను 100 నిమిషాల్లోనే పరిష్కరించినట్లు ముఖేష్‌కుమార్‌ మీనా తెలిపారు. పోలింగ్‌ అనంతరం హింసను నివారించేందుకు రాష్ట్రంలో తొలిసారిగా కార్టన్‌ సెర్చ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించామని.. సమస్యాత్మకమైన 1,985 ప్రాంతాలను గుర్తించి అక్కడ సోదాలు నిర్వహించారని ఆయన తెలిపారు. 

ఇప్పటివరకు 1,200 సోదాలు నిర్వహించడం ద్వారా 4,595 వాహనాలను, 1,269 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు 153 మందిపై కేసులు నమోదుచేశామని ఆయన వివరించారు. పోలింగ్‌ అనంతరం సమస్యలను, అల్లర్లను సృష్టించే 12,639 మందిని గుర్తించి సీఆర్‌పీసి కింద బైండోవర్‌ చేసినట్లు మీనా తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement