ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు | Increase in salary of SC Gurukul teachers Minister Meruga Nagarjuna | Sakshi
Sakshi News home page

ఎస్సీ గురుకుల ఉపాధ్యాయుల వేతనాలు పెంపు

Published Fri, May 19 2023 4:57 PM | Last Updated on Fri, May 19 2023 4:58 PM

Increase in salary of SC Gurukul teachers Minister Meruga Nagarjuna - Sakshi

సాక్షి, అమరావతి:  ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న 1791 మంది పార్ట్ టైమ్ టీచర్ల వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసినట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. టీచర్లతో పాటుగా వ్యాయామ ఉపాధ్యాయులు, హెల్త్ సూపర్ వైజర్ల వేతనాలను కూడా పెంచామని చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న  బీఆర్ అంబేద్కర్ ఎస్సీ గురుకులాల్లో పని చేస్తున్న జూనియర్ లెక్చరర్లు, పీజీటీలు, టీజీటీలు, పీఇటీలు, హెల్త్ సూపర్ వైజర్లు వేతనాలను పెంచాలంటూ ఉపాధ్యాయులు చేసిన విజ్ఞప్తి మేరకు బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో చర్చించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో నాగార్జున వివరించారు. గతంలో జూనియర్ లెక్చరర్ల (జేఎల్)వేతనం రూ.18 వేలు ఉండగా దీనిని రూ.24,150 లకు పెంచామని చెప్పారు.

పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ల (పీజీటీ) వేతనం రూ.16,100 ఉండగా దీన్ని కూడా రూ.24,150కు పెంచామని తెలిపారు. ట్రైన్డ్ గ్యాడ్యుయేట్ టీచర్ల( టీజీటీ) వేతనం రూ.14,800 ఉండగా దీన్ని రూ.19,350కు పెంచడం జరిగిందన్నారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయుల (పీఇటీ) వేతనం రూ.10,900 ఉండగా దీనిని రూ.16,350కు, హైల్త్ సూపర్ వైజర్, స్టాఫ్ నర్స్ ల వేతనం రూ.12,900 ఉండగా దానిని రూ.19,350లకు పెంచడం జరిగిందని నాగార్జున వివరించారు. ఈ పెంపుదలతో 1791 మంది పార్ట్ టైమ్ టీచర్లతో పాటుగా ఇతర సిబ్బందికి ప్రయోజనం చేకూరిందని తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసామన్నారు.

2019 తర్వాత పార్ట్ టైమ్ టీచర్లు, ఇతర సిబ్బంది వేతనాలను పెంచడం ఇదే ప్రథమం అని మంత్రి చెప్పారు. కాగా తమ కష్టాలను గుర్తించి తమ వేతనాలను పెంచినందుకు గురుకుల విద్యాలయాల సంస్థ ఉద్యోగుల జేఏసీ నేతలు,టీచర్లు శుక్రవారం మంత్రి మేరుగు నాగార్జునను కలిసి తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగానే మంత్రిని సన్మానించారు. ఈ సందర్భంగానే జేఏసీ ఛైర్మెన్ నాగభూషణం మాట్లాడుతూ, తాము కోరిన వెంటనే బీజీ సమావేశంలో ఈ అంశాన్ని చేర్చి తమకు మంత్రి తమకు న్యాయం చేసారని చెప్పారు. బీసీ వెల్ఫేర్ టీచర్లతో సమానంగా పీజీటీలు, టీజీటీల వేతనాలను పెంచే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి నాగార్జునను కోరారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement