దేశవ్యాప్తంగా డిజిటల్‌ క్రాపింగ్‌ | Sakshi
Sakshi News home page

దేశవ్యాప్తంగా డిజిటల్‌ క్రాపింగ్‌

Published Sun, Jun 16 2024 5:02 AM

Govt launches digital crop survey in 10 states on pilot basis: ap

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి అమలుకు సన్నాహాలు 

గతేడాది పైలెట్‌ ప్రాజెక్టుగా 10 రాష్ట్రాల్లో అమలు 

ఈ ఏడాది నుంచి అన్ని రాష్ట్రాల్లో.. 

ఏపీలో అమలవుతున్న ఈ–క్రాపింగ్‌ మోడల్‌లో అమలు 

ఇటీవలే ఏపీ విధానాన్ని పరిశీలించిన కేంద్ర బృందం 

ఇక్కడ ఈ–క్రాపింగ్‌ అమలుతీరు బాగుందంటూ కితాబు 

దీనిని దేశవ్యాప్తంగా అమలుచేస్తామని వెల్లడి

సాక్షి, అమరావతి: ఎల్రక్టానిక్‌ క్రాపింగ్‌ (ఈ–క్రాప్‌).. నిజంగా ఓ వినూత్న ప్రయోగం. వాస్తవ సాగుదారులకు ఓ రక్షణ కవచం. వ్యవసాయ రంగంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకొచి్చన ఈ విప్లవాత్మక మార్పు దేశంలో మరెక్కడా అమలుకాని నూతన సాంకేతిక విధానం. దేశానికి ఆదర్శంగా నిలిచిన ఈ–క్రాప్‌ ద్వారా ఏ సర్వే నెంబర్‌ పరిధిలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగవుతుందో? వాస్తవ సాగుదారులెవరో? గుర్తించడమే కాదు.. సీజన్‌లో విత్తనాలు, ఎరువులు, పంట రుణాలతో సహా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అర్హులకు అందించే సాంకేతిక సౌలభ్యం దీనిద్వారా సాధ్యం.

ఏపీ స్ఫూర్తితో గతేడాది పైలెట్‌ ప్రాజెక్టుగా 12 రాష్ట్రాల్లో అమలుచేసిన కేంద్రం ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి డిజిటల్‌ క్రాప్‌ సర్వే (డీసీఎస్‌) పేరిట దేశవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు చేస్తోంది. ఇటీవలే కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సాంకేతిక బృందం ఏపీలో ఈ–క్రాప్‌ అమలుతీరును పరిశీలించింది. ఇందులోని ఫీచర్స్‌ను డీసీఎస్‌లో అనుసంధానించేందుకు, అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లుచేస్తోంది. 

గతంలో పొంతనలేకుండా పంట అంచనాలు.. 
వ్యవసాయ సీజన్‌ (ఫసల్‌)లో శిస్తు వసూలు కోసం పూర్వం నీటి వనరుల (కాలువలు, బోర్లు, చెరువుల) కింద సీజన్‌ ప్రారంభం కాగానే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి పంటల సాగు వివరాలను అడంగల్‌లో నమోదు చేసేవారు. కాలువల కింద సాగయ్యే పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎకరాకు ఖరీఫ్‌లో రూ.200, రబీలో రూ.150 చొప్పున నీటìతీరువా వసూలుచేసేవారు. పని ఒత్తిడి కారణంగా క్షేత్రస్థాయి పరిశీలన లేకుండానే రైతులు చెప్పిన సాగు వివరాలనే అడంగల్‌తో పాటు 1–బీలో నమోదుచేసి గణాంక శాఖాధికారులకు అందజేసేవారు. పన్ను భారం తగ్గించుకునేందుకు కొన్నిచోట్ల వివరాల నమోదు తప్పులతడకగా ఉండేది. సాగు చేసేదొకరైతే.. అడంగల్‌లో ఒక పేరు, పాస్‌బుక్‌లో మరొక పేరు ఉండేది. ఏ గ్రామంలో ఏ రైతు ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగుచేసేవారో ఖచ్చితమైన సమాచారం దొరకని పరిస్థితి ఉండేది.  

నేడు పక్కాగా పంట వివరాలు.. 
కానీ, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 2019 రబీ సీజన్‌ నుంచి ఈ–పంట నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నేషనల్‌ ఇన్ఫర్మేటిక్‌ సెంటర్‌ (ఎన్‌ఐసీ) సౌజన్యంతో ప్రత్యేకంగా డిజైన్‌ చేసిన యాప్‌లో వెబ్‌ల్యాండ్, సీసీఆర్సీ (పంటసాగు హక్కు పత్రం) డేటా ఆధారంగా జాయింట్‌ అజమాయిషీ కింద వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ సహాయకులు పంట వివరాలు నమోదు చేస్తున్నారు. తొలుత సీజన్‌ వారీగా ఏ సర్వే నెంబర్‌లో ఏయే రకాల పంటలు ఏయే వ్యవసాయ పద్ధతుల్లో సాగుచేస్తున్నారో రైతులు సమీప ఆర్బీకే సిబ్బందికి తెలియజేసేవారు.

సీజన్‌ ప్రారంభమైన 15–30 రోజుల్లోపు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, జియో కోఆర్డినేట్స్, జియో ఫెన్సింగ్‌తో సహా పంట ఫొటోలను అప్‌లోడ్‌ చేస్తారు. ప్రపంచంలో మరెక్కడాలేని విధంగా రైతుల వేలిముద్రలు(ఈకేవైసీ–మీ పంట తెలుసుకోండి) తీసుకుని, రైతు మొబైల్‌ నెంబర్‌కు డిజిటల్‌ రశీదును పంపిస్తారు. వీఏఏ, వీహెచ్‌ఎ, వీఆర్‌ఏ ధృవీకరణ పూర్తికాగానే మండల వ్యవసాయాధికారి నుంచి జిల్లా కలెక్టర్‌ వరకు ర్యాండమ్‌గా పరిశీలించి, చివరగా రైతులకు భౌతిక రశీదు అందిస్తున్నారు.

ఈ రశీదులోనే ఉచిత పంటల బీమా పథకం వర్తించేందుకు వీలుగా నోటిఫై చేసిన పంటలకు (స్టార్‌) గుర్తుతో  తెలియజేయడమే కాకుండా మీ పంటకు బీమా కవరేజ్‌ ఉందని, మీ తరఫున ప్రభుత్వమే పూర్తిగా ప్రీమియం చెల్లిస్తుందని  పేర్కొనేవారు. ఈ విధానం అమల్లోకి వచ్చాక వ్యవసాయ, ఉద్యాన, పట్టు, పశుగ్రాసం పంటల సాగు వివరాలు పక్కాగా నమోదవుతున్నాయి.  ఐదేళ్లలో 8.24 కోట్ల ఎకరాల్లో  పంటల వివరాలను నమోదుచేశారు.    

డీసీఎస్‌ యాప్‌లో ఈ–క్రాప్‌ ఫీచర్స్‌
ఏపీలో జాయింట్‌ అజమాయిషీ కింద నమోదు చేయడమే కాదు.. సోషల్‌ ఆడిట్‌ నిర్వహించడం, వాటిని గ్రామస్థాయిలో ఆర్బీకేల్లో ప్రదర్శించడం, రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి నిర్ణీత గడువులోగా పరిష్కరించడం, వారి వేలిముద్రలు సేకరించి డిజిటల్, ఫిజికల్‌ ఎక్‌నాలెడ్జ్‌మెంట్స్‌ ఇవ్వడం వంటి ఫీచర్స్‌ ఈ డీసీఎస్‌ సర్వే యాప్‌లో లేవు. పైగా గతేడాది నుంచి ఏపీలో జియోఫెన్సింగ్, జియో కోఆర్డినేట్స్‌తో సహా ఈ క్రాపింగ్‌ చేస్తున్నారు.

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచి దేశవ్యాప్తంగా అమలుచేయాలన్న సంకల్పంతో ఇటీవల న్యూఢిల్లీ నుంచి అగ్రిస్టాక్‌ విభాగం నుంచి విష్ణువర్థన్, ధృవ్‌గౌతమ్‌ వంటి సాంకేతిక నిపుణులతో కూడిన బృందం ఏపీలో పర్యటించి ఇక్కడ అమలవుతున్న ఈ–క్రాప్‌ అమలుతీరును పరిశీలించింది. డీసీఎస్‌ కంటే మెరుగైన ఫీచర్స్‌తో ఈ–క్రాప్‌ నమోదు చేస్తున్న విధానాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఫీచర్లను కూడా డీసీఎస్‌ సర్వే యాప్‌తో అనుసంధానిస్తున్నట్లు వాళ్లు స్వయంగా ప్రకటించారు. డీసీఎస్‌లో నమోదైన వాస్తవ సాగు సమాచారం ఆధారంగా వచ్చే సీజన్‌ నుంచి రైతు సంక్షేమ ఫలాలు అందించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.

ఈ–క్రాప్‌ ప్రామాణికంగానే సంక్షేమ ఫలాలు..
ఇక సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు పంపిణీతో పాటు  స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం పంట రుణాలను ఈ–క్రాప్‌ ప్రామాణికంగానే అందేలా కృషిచేశారు. వైఎస్సార్‌ రైతుభరోసా, వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం, వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీతో పాటు ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి అదే సీజన్‌ ముగిసేలోగానే పరిహారం అందించారు. ఉదా.. 
ఈ ఐదేళ్లలో 75.82 లక్షల మందికి రూ.1,373 కోట్ల సబ్సిడీతో కూడిన 45.16 లక్షల టన్నుల విత్తనాలు.. 
⇒  15 లక్షల మందికి రూ.14 కోట్ల విలువైన 1.36 లక్షల లీటర్ల పురుగు మందులు.. 
⇒ 176.36 లక్షల టన్నుల ఎరువులు పంపిణీ చేశారు. 
⇒  అలాగే, 5.13 కోట్ల మందికి రూ.8.37 లక్షల కోట్ల పంట రుణాలు అందించారు.  
⇒  వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున 53.58 లక్షల మందికి రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం..  
⇒ 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్ల పంటల బీమా పరిహారం.. 
⇒  30.85 లక్షల మందికి రూ.3,411 కోట్ల పెట్టుబడి రాయితీ.. 
⇒  84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల సున్నా వడ్డీ రాయితీలను అందజేశారు.

ఏపీ మోడల్‌లోనే దేశవ్యాప్తంగా అమలు.. 
ఇదిలా ఉంటే.. ఏపీలో అమలవుతున్న ఈ–క్రాప్‌ను పలు రాష్ట్రాలతో పాటు కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖతో సహా నీతి అయోగ్, ప్రపంచ బ్యాంకు, ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌) వంటి సంస్థలతో పాటు పలు విదేశీ ప్రతినిధి బృందాలు సైతం అధ్యయనం చేశాయి. ఏపీ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రియల్‌ టైమ్‌ క్రాపింగ్‌ నమోదు చేపట్టాలని కేంద్ర వ్యవసాయ శాఖ సంకలి్పంచింది.

2022లోనే కేంద్ర బృందం ఏపీలో అమలవుతున్న ఈ–క్రాప్‌పై లోతైన అధ్యయనం చేసి గతేడాది 12 రాష్ట్రాల్లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో డిజిటల్‌ క్రాపింగ్‌ సర్వేకు శ్రీకారం చుట్టింది. ప్రస్తుత ఖరీఫ్‌ నుంచి దేశవ్యాప్తంగా డీసీఎస్‌ అమలుకు ముందుకొచి్చంది. ఇందుకోసం విధి విధానాల రూపకల్పనకు స్టీరింగ్‌ కమిటీలతో పాటు రాష్ట్రాల వారీగా ఇంప్లిమెంటింగ్‌ కమిటీలు ఏర్పాటుచేసింది. పైలెట్‌ ప్రాజెక్టులో ఎంపిక చేసిన కొన్ని రాష్ట్రాల్లో వ్యవసాయ శాఖ, మరికొన్ని రాష్ట్రాల్లో రెవెన్యూ శాఖలు అడంగల్‌ డేటా ఆధారంగా డిజిటల్‌ క్రాపింగ్‌ చేశారు. ఎమ్నెక్స్‌ ఇంటర్నేషనల్‌ ద్వారా డిజైన్‌ చేసిన యాప్‌ ద్వారా ఖరీఫ్‌–2023లో జియో ఫెన్సింగ్‌ రిఫరెన్స్‌తో డీసీఎస్‌ చేపట్టారు. కానీ, ఏపీలో పూర్తిగా ఎన్‌ఐసీ సౌజన్యంతో డెవలప్‌ చేసిన యాప్‌లో నమోదు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement