మత్స్యకారులకు మరింత మేలు.. | Fourth tranche of aid to ONGC pipeline victims | Sakshi
Sakshi News home page

మత్స్యకారులకు మరింత మేలు..

Published Tue, Nov 21 2023 5:39 AM | Last Updated on Tue, Nov 21 2023 5:40 PM

Fourth tranche of aid to ONGC pipeline victims - Sakshi

సాక్షి, అమరావతి: మత్స్యకారుల జీవన ప్రమా­ణాలు పెంచడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేస్తోంది. మంగళవారం ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా మత్స్యకా­రులకు మరింత మేలు చేసేందుకు వీలుగా మరో మూడు ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టనున్నారు. తిరుపతి జిల్లా రాయదరువు వద్దగల మాంబట్టు ఎస్‌ఈజెడ్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణం వద్ద నుంచే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.

ఎఫ్‌ఎల్‌సీ ఏర్పాటుతో 500 బోట్లు నిలుపుకొనే అవకాశం  
తిరుపతి జిల్లా వాకాడు మండలం రాయదరువు వద్ద రూ.23.93 కోట్లతో నిర్మించతలపెట్టిన ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌(ఎఫ్‌ఎల్‌సీ)కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేస్తారు. ఈ సెంటర్‌ ఏర్పాటుతో ఒకేసారి సురక్షితంగా 500 మోటరైజ్డ్, మెకనైజ్డ్‌ బోట్లు నిలుపుకొనే అవకాశం ఏర్పడుతుంది. దెబ్బతిన్న బోట్లకు ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్‌ వద్ద మరమ్మతులు చేసుకునే వెసులుబాటు కలుగుతుంది. తద్వారా 20 వేల మత్స్యకార కుటుంబాలు లబ్ధి పొందనున్నారు. ఈ సెంటర్‌ కోసం 5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు.

పులికాట్‌ ముఖ ద్వారం పునరుద్ధరణ  
మరోవైపు దశాబ్దాలుగా నెలకొన్న పులికాట్‌ సమస్యకు మోక్షం కలగనుంది. ఏపీ పరిధిలో 400 చదరపు కిలో మీటర్లు, తమిళనాడు వైపు మరో 61 చదరపు కిలోమీటర్ల మేర ఈ సరస్సు విస్తరించి ఉంది. మూసుకు పోయిన సరస్సు ముఖ ద్వారం పునరుద్ధరణ పనులను రూ.94.75 కోట్లతో  శ్రీకారం చుడుతున్నారు. తద్వారా 20 వేలకు పైగా మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.  

54 నెలల్లో రూ.4,485.98 కోట్ల మేర లబ్ధి 
ఈ 54 నెలల్లో మత్స్యకారుల సంక్షేమం కోసం సీఎం జగన్‌ ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా 2,18,153 మంది మత్స్యకార కుటుంబాలకు అక్షరాల రూ.4,485.98 కోట్ల మేర లబ్ధి చేకూర్చింది. మరో వైపు వేటకు వెళ్లే మత్స్యకారుల స్థితిగతులను మెరుగుపరిచి వలసలను అరికట్టే లక్ష్యంతో రూ.3,793 కోట్లతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన 10 ఫిషింగ్‌ హార్బర్లు, 6 ఫిష్‌ ల్యాండింగ్‌ కేంద్రాలను నిర్మిస్తోంది. రూ.11 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్‌ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.   

ఓఎన్జీసీ పైపులైన్‌ బాధితులకు నాల్గో విడత సాయం
అలాగే ఓఎన్‌జీసీ, జీఎస్‌పీసీ సంస్థల పైప్‌లైన్‌ పనుల కారణంగా 40,012 మంది జీవనోపాధి కోల్పోగా.. జీఎస్‌పీసీ పైపులైన్‌ వల్ల ఉపాధి దెబ్బతిన్న 16,554 మందికి రూ.78.22 కోట్ల సాయాన్ని ఇప్పటికే చెల్లించారు. అదే విధంగా ఓఎన్‌జీసీ పైపులైన్‌ వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి ఇప్పటికే మూడు విడతల్లో రూ.323.72 కోట్ల పరిహారాన్ని జమ చేశారు.

తాజాగా నాల్గో విడతగా ఒక్కొక్కరికి రూ.11,500 చొప్పున.. ఆర్నెల్లకు రూ.69 వేల చొప్పున రూ.161.86 కోట్ల సాయాన్ని సీఎం జగన్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయనున్నారు. ఈ మొత్తంతో కలిపి మొత్తం ఓఎన్‌జీసీ పైపులైన్‌ నిర్మాణం వల్ల ఉపాధి కోల్పోయిన 23,458 మందికి రూ.485.58 కోట్ల పరిహారం చెల్లించినట్టవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement