ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం.. టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు | Eenadu Ramoji Rao In Fear With Supreme Court Verdict on Margadarsi | Sakshi
Sakshi News home page

ఆర్థిక ఉగ్రవాది ఉన్మాదం.. టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు

Published Thu, Apr 11 2024 4:55 AM | Last Updated on Thu, Apr 11 2024 4:57 AM

Eenadu Ramoji Rao In Fear With Supreme Court Verdict on Margadarsi - Sakshi

మార్గదర్శిపై సుప్రీంకోర్టు తీర్పు, టీడీపీ డీలాతో రామోజీ బెంబేలు

నైరాశ్యంలో పాతాళానికి పతనమైన ఈనాడు రాతలు 

వేల కోట్లు కుమ్మరించేస్తోందంటూ వైఎస్సార్‌సీపీపై బురదజల్లుతూ రోతరాతలు

కోర్టు తీర్పుతో తన ఆర్థిక నేరాల గుట్టంతా రట్టవుతుందని గురివింద ఆందోళన

ఈసీ కనుసన్నల్లో అధికారులు పనిచేస్తుంటే కూడా వంకర రాతలు.. ఎస్పీలు, కలెక్టర్లను బదిలీ చేస్తే ‘ఈడ్చికొట్టిన ఈసీ’ అంటూ ఆనందం

మార్గదర్శి కేసు విచారించిన అధికారిని ఎన్నికల విధులకు వేరే రాష్ట్రానికి పంపితే చంకలు గుద్దుకున్న వైనం

ఇప్పుడు వైఎస్సార్‌సీపీ విజయం ఖాయమని తేలడంతో మతిస్థిమితం కోల్పోయి పిచ్చిరాతలు  

మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తుంటే ముందస్తు చెల్లింపులు ఎలా సాధ్యం రామోజీ?

జనసేన–బీజేపీతో జట్టుకట్టి.. నోట్ల కట్టలు వెద జల్లుతున్నా బాబుకు కనిపించని జనస్పందన

చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే రామోజీ సాకులు వెతుకుతున్నారంటున్న పరిశీలకులు.. వాస్తవానికి రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చేసింది చంద్రబాబే

అందుకే రూ. కోట్లు వెదజల్లే వారికే టికెట్లు

టిప్పర్‌ డ్రైవర్, ఉపాధి కూలీ వంటి సామాన్యులకు పెద్దపీట వేస్తూ టికెట్లు ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: ఆర్థిక ఉగ్రవాది పత్రిక నడిపితే ఎలా ఉంటుందో ‘ఈనాడు’ చాటి చెబుతోంది. జర్నలిజాన్ని అడ్డుపెట్టుకుని ఆర్బీఐ (రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ ద్వారా డిపాజిట్లు సేకరించడమే అందుకు నిదర్శనం. సుప్రీంకోర్టు తీర్పుతో ఆ ఆర్థిక నేరం గుట్టంతా రట్టవుతుండటం.. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ఘోరంగా ఓడిపోవడం ఖాయమని తేలడంతో రామోజీరావు భయంతో వణికి పోతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ మరో చారిత్రక విజయం సాధించడం దిశగా దూసుకెళ్తోందని టైమ్స్‌నౌ–ఈటీజీ, జీ న్యూస్‌ తదితర ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థల సర్వేలు తేలి్చచెప్పడం.. రాజకీయ విశ్లేషకులూ అదే మాట చెబుతుండటం రామోజీరావుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లను కొల్లగొట్టేందుకు వేల కోట్లు కుమ్మరిస్తోందని.. అడిగేవారు, అడ్డుకునేవారు లేకపోవడంతో చెలరేగిపోతోందంటూ వైఎస్సార్‌సీపీపై విషం చిమ్ము­తూ బుధవారం ‘ఈనాడు’లో ‘కుమ్మరించేస్తోంది’ శీర్షికన రోతరాతలు అచ్చేశారు. ఇటీవల ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక ఐజీ, మూడు జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం (ఈసీ) బదిలీ చేస్తే.. ‘ఈడ్చికొట్టిన ఈసీ’ అంటూ శివాలెత్తిన రామో­జీ.. మార్గదర్శి కుంభకోణంపై విచారించిన అధికారి కొల్లి రఘురామిరెడ్డిని ఎన్నికల పరిశీలకుడిగా ఈసీ అస్సాంకు పంపితే.. ‘కొల్లికి షాక్‌’ అంటూ కథనాన్ని అచ్చేసి సంబరపడ్డారు.

ఈసీ కనుసన్నల్లో అధికారులు పని చేస్తుంటే.. అడిగేవారు, అడ్డుకునేవారు లేరంటూ ఇప్పుడు ఎన్నికల సంఘంపై అభాండాలు వేయడం చూస్తే రామోజీరావు మతిస్థిమితం కోల్పోయారేమో అనిపిస్తోంది. ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తుంటే.. ఏ రోజు లెక్కలు ఆ రోజే తేలుస్తుంటే.. ప్రతి మద్యం దుకాణానికి వైఎస్సార్‌సీపీ రూ.పది లక్షలు ముందస్తు చెల్లింపులు చేయడం ఎలా సాధ్యం అన్న ఇంగిత జ్ఞానం కూడా రామోజీరావుకు లేకుండా పోయింది. తన శిష్యుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే గురవింద రామోజీ సాకులు వెతుకుతూ రోత రాతలు అచ్చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

రాజకీయాన్ని వ్యాపారం చేసింది బాబే  
దేశంలో రాజకీయాలను ఫక్తు వ్యాపారంగా మార్చే­సి, ఓటుకు నోటును అలవాటు చేసిన ఘనుడు 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ చంద్రబాబే. ఎనీ్టఆర్‌కు వెన్నుపోటు పొడిచి 1995లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. 1996 లోక్‌సభ ఎన్నికల నుంచి ఓటుకు నోటుకు తెరతీశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దోచేసిన సొమ్ముతోపాటు.. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా బ్యాంకులను కొల్లగొట్టిన ఆర్థిక నేరగాళ్లు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, వ్యాపారులు, ఎన్నారైలకు టికెట్లు ఇచ్చారు. కోట్ల కట్టలను వెదజల్లి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే ప్రక్రియను ప్రారంభించారు.

తెలంగాణ శాసనమండలి ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఎరగా వేస్తూ ఆడియో, వీడియో టేపులతో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడినా చంద్రబాబు తన తీరు మార్చుకోలేదు సరికదా మరింతగా చెలరేగిపోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న వారిని కాదని రూ.900 కోట్లు ఫార్టీ ఫండ్‌గా ఇచ్చిన విద్యా వ్యాపారి పొంగూరు నారాయణను నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి చంద్రబాబు బరిలోకి దించారు. రూ.వందల కోట్లు పార్టీ ఫండ్‌గా ఇచ్చిన ఎన్నారైలు పెమ్మసాని చంద్రశేఖర్‌ను గుంటూరు లోక్‌సభ స్థానం నుంచి, కాకర్ల సురేష్ ను ఉదయగిరి నియోజకవర్గం నుంచి, వెలిగండ్ల రామును గుడివాడ నుంచి, యార్లగడ్డ వెంకట్రావును గన్నవరం నుంచి, రియల్టర్‌ కేశినేని చిన్నిని విజయవాడ లోక్‌సభ స్థానం నుంచి.. కాంట్రాక్టర్‌ అమిలినేని సురేంద్రబాబును కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి బరిలోకి దించారు.

ఫార్టీ ఫండ్‌ రూపంలో.. అభ్యర్థుల నుంచి డిపాజిట్ల రూపంలో వసూలు చేసిన వేల కోట్ల రూపాయలను యథేచ్ఛగా వెదజల్లుతున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థులు పెమ్మసాని, వెనిగండ్ల రాము, యార్లగడ్డ వెంకట్రావు, బీజేపీ అభ్యర్థులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ వంటి వారు భారీ ఎత్తున నోట్ల కట్టలను వెదజల్లుతున్నారు. ఇతర పార్టీలకు చెందిన సర్పంచులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు వంటి వారిని కొనుగోలు చేస్తూ తమ వైపునకు తిప్పుకోవడానికి బాబు ప్రయతి్నస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న సభ­లకు నోట్ల కట్టలను వెదజల్లుతున్నా జనం మొహం చాటేస్తున్నారు. కోట్ల కట్టలతో చంద్రబాబు చేస్తున్న విన్యాసాలు రామోజీ కంటికి కన్పించలేదేమో!  

సరి కొత్త ఒరవడికి సీఎం జగన్‌ శ్రీకారం  
జన బలమే గీటురాయిగా.. ప్రజాసేవే ప్రామాణికంగా.. నిబద్ధతే పరమావధిగా కింది స్థాయి కార్యకర్తలను అభ్యర్థులుగా ఎంపిక చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజాస్వామ్యానికి సరైన అర్థం చెప్పారు. శింగనమల నియోజకవర్గం నుంచి టిప్పర్‌ డ్రైవర్‌ వీరాంజనేయులును, మడకశిర నియోజకవర్గం నుంచి ఉపాధి కూలీ ఈర లక్కప్పను, నెల్లూరు సిటీలో విద్యా వ్యాపారి కోటీశ్వరుడు నారాయణపై సాధారణ కార్యకర్త ఖలీల్‌ అహ్మద్‌ను, మైలవరం నియోజకవర్గం నుంచి రైతుబిడ్డ సర్నాల తిరుపతిరావును, కోటీశ్వరులు బరిలోకి దిగే నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి న్యాయవాది గూడూరి ఉమాబాలను సీఎం వైఎస్‌ జగన్‌ బరిలోకి దించడం ద్వారా రాజకీయాల్లో సరి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన అందిస్తున్న సీఎం.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో అర్హతే ప్రమాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. లంచాలకు చోటులేకుండా సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో రూ.2.70 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు. నాన్‌ డీబీటీ రూపంలో మరో రూ.1.79 లక్షల కోట్ల ప్రయోజనాన్ని చేకూర్చారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజ­లకు ఇంటి గుమ్మం వద్దే అందిస్తున్నారు.

కరోనా కష్టకాలంలోనూ ఆర్థిక ఇబ్బందులున్నా అన్ని పథకాలను కొనసాగించి.. ఇచ్చిన మాటపై నిలబడి.. సామాజిక న్యాయమంటే ఇదీ అని దేశానికి చాటిచెప్పారు. దీంతో సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంపై ప్రజల్లో విశ్వసనీయత రోజు రోజుకూ పెరుగుతోంది. వైఎస్సార్‌సీపీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేయడానికి భీమిలి, దెందులూరు, రాప్తాడు, మేదరమెట్లలో నిర్వహించిన సిద్ధం సభలకు పోటెత్తిన జనసంద్రమే అందుకు నిదర్శనం. ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ నిర్వహిస్తున్న బస్సు యాత్రకు మండుటెండైనా.. అర్ధరాత్రి అయినా ఉప్పొంగుతున్న అభిమానసంద్రమే అందుకు తార్కాణం.

ఓ వైపు వైఎస్‌ జగన్‌ నిర్వహించిన సిద్ధం సభలు, నిర్వహిస్తున్న బస్సు యాత్రకు అభిమాన సంద్రం ఉప్పొంగుతుండటం.. మరో వైపు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేయడాన్ని చూస్తే రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభంజనమేనన్నది స్పష్టమవుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టైమ్స్‌నౌ–ఈటీజీ, జీన్యూస్‌ వంటి డజనుకుపైగా జాతీయ మీడియా సంస్థల సర్వేలూ అదే చెబుతున్నాయి. దీంతో ఆందోళన చెందుతున్న రామోజీరావు.. శిష్యుడు చంద్రబాబు ఘోర పరాజయానికి ఇప్పటి నుంచే సాకులు వెతుక్కుంటున్నారని స్పష్టమవుతోంది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement