లాడ్జిలో ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య Double Murder in Kurnool Lodge | Sakshi
Sakshi News home page

లాడ్జిలో ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య

Published Sun, Dec 17 2023 8:25 AM | Last Updated on Sun, Dec 17 2023 8:25 AM

Double Murder in Kurnool Lodge - Sakshi

కర్నూలు(టౌన్‌)/నందికొట్కూరు: వివాహేతర సంబంధం ఇరువురి ప్రాణాలను బలిగొంది. ఈ ఘటన శనివారం కర్నూలు నగరంలోని వుడ్‌ల్యాండ్స్‌ లాడ్జిలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లా  నందికొట్కూరు పట్టణంలోని హౌసింగ్‌ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న విజయకుమార్‌(35) వృత్తిరీత్యా అకౌంటెంట్‌. బీటెక్‌ పూర్తి చేసిన ఇతను పదేళ్ల క్రితం పట్టణానికి చెందిన ముస్లిం అమ్మాయిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. మిడుతూరు మండలం నాగలూటికి చెందిన రుక్సానా(45)కు పట్టణానికి చెందిన కార్పెంటర్‌తో 2001లో వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. 

ఒకే కాలనీలో ఉంటున్న విజయకుమార్, రుక్సానా మధ్య ఏర్పడిన పరిచయం మూడేళ్లుగా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయంలో పలుమార్లు గొడవలు జరిగినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా శుక్రవారం ప్రియుడు రుక్సానాకు ఫోన్‌ చేసి కర్నూలులోని వుడ్‌ల్యాండ్స్‌ లాడ్జిలో ఉన్నట్లు చెప్పాడు. దీంతో బాబుకి ఆరోగ్యం బాగోలేదని కర్నూలుకు వెళ్లి ఆస్పత్రిలో చూపిస్తానని భర్తకు చెప్పి రూ.5 వేలు తీసుకుని బయలుదేరింది. అయితే కుమారుడిని ప్రభుత్వాసుపత్రి వద్ద వదిలి ఆమె కనిపించకుండా పోయింది. 

రాత్రి అయినా రాకపోవడంతో కుమారుడు కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. ఇదే సమయంలో ప్రియుడు విజయ్‌కుమార్‌ ఆమె కుమారుడికి ఫోన్‌ చేసి ఇద్దరం లాడ్జిలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఫోన్‌ పే ద్వారా రూ.300 అకౌంట్‌లో వేశాడు. అయితే ఏ లాడ్జి అనే సమాచారం లేకపోవడంతో కుమారుడు అన్ని చోట్ల వెతికాడు. చివరకు వుడ్‌ల్యాండ్స్‌ వద్ద పార్కు చేసిన ద్విచక్రవాహనాన్ని గుర్తు పట్టి లాడ్జిలో విచారించారు. విజయ్‌కుమార్‌ అక్కడే ఉన్నట్లు తెలుసుకుని రూమ్‌ వద్దకు వెళ్లి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తెరువ లేదు. 

రూమ్‌ సిబ్బంది ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. శనివారం లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి మూడో పట్టణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సైతం ఎంత ప్రయత్నించినా రూం తలుపులు తెరవకపోవడంతో బద్దలు కొట్టారు. ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. 

ప్రియురాలిని చంపి ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు 
ఈ ఘటన వివాహేతర సంబంధం వల్లే జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించాం. ఇరువురి మధ్య గొడవ జరిగి రుక్సానాను కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత క్రిమి సంహారక మందు తాగి తనూ ఆత్మహత్య చేసుకున్నట్లు ఘటనా స్థలంలో ఆనవాళ్లను బట్టి తెలుస్తోంది. హత్య, ఆత్మహత్యకు సంబంధించి కారణాలపై విచారణ చేస్తున్నాం. 
మురళీధర్‌ రెడ్డి, మూడవ పట్టణ సీఐ   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement