నా మనసుకు దగ్గరైన శాఖలివి Deputy CM Pawan Kalyans statement on the departments allotted to him | Sakshi
Sakshi News home page

నా మనసుకు దగ్గరైన శాఖలివి

Published Sun, Jun 16 2024 5:39 AM | Last Updated on Sun, Jun 16 2024 5:39 AM

Deputy CM Pawan Kalyans statement on the departments allotted to him

తనకు కేటాయించిన శాఖలపై డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ ప్రకటన  

సమస్యలను కళ్లారా చూశా.. వాటి పరిష్కారానికి కృషి చేస్తా 

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడతా

సాక్షి, అమరావతి: రాష్ట్ర మంత్రివర్గంలో తాను నిర్వర్తించబోయే శాఖలు తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ అన్నారు. శనివారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘నాకు కేటాయించిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖలు ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవే. ఈ శాఖలు ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నా. 

2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న నాకు క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా ప్రతి ప్రాంతానికి సంబంధించిన సమస్యలపైన బలమైన అవగాహన ఉంది. సమస్యలను కళ్లారా చూశా. కాలుష్యమయమైన జల వనరులను.. తప్పని పరిస్థితుల్లో తాగునీరుగా వాడుకుంటున్న పల్లెవాసులను గమనించా. ప్రజలకు మేలైన ఫలాలను అందించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తా. ఉపాధి హామీ పథకం నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. 

జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహార్తి తీర్చేందుకు కృషి చేస్తా. ప్రజల ఆరోగ్యాలను హరించివేయకుండా పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేలా చేయూతనిస్తా. భూ తాపాన్ని తగ్గించడానికి ప్రధాని మోదీ చేస్తున్న కృషికి బాసటగా రాష్ట్రంలో గ్రీన్‌ ఎనర్జీని ప్రోత్స­హి­స్తాం. అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతా. అడవుల వినాశనానికి పాల్పడినా, అందుకు ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కి పంపిస్తా.

తీర ప్రాంతాల్లో మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేకంగా దృష్టి పెడతాం’ అని పవన్‌ చెప్పారు. కాగా, జనసేన పార్టీ నుంచి మంత్రివర్గంలో చేరిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్‌లకు కేటాయించిన పౌరసరఫ­రాలు, పర్యాటకం, సినిమాటోగ్రఫీ శాఖలపై పవన్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement