Cooking Oil Price Today: Declining Cooking Oil Prices - Sakshi
Sakshi News home page

దిగొస్తున్న వంటనూనెల ధరలు .. ఫలిస్తున్న ఏపీ ప్రభుత్వ చర్యలు

Published Wed, Mar 30 2022 3:33 AM | Last Updated on Wed, Mar 30 2022 5:49 PM

Declining cooking oil prices - Sakshi

సాక్షి, అమరావతి: ఆకాశానికి ఎగబాకిన వంట నూనెల ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. టాస్క్‌ఫోర్స్‌తో ధరలపై నిఘా, ఆకస్మిక తనిఖీలు.. మరోవైపు రైతుబజార్లు, మున్సిపల్‌ మార్కెట్లలో కౌంటర్ల ద్వారా తక్కువ ధరకే విజయ ఆయిల్స్‌ విక్రయాల ఫలితంగా వంట నూనె ధరలు దిగొస్తున్నాయి. ఎమ్మార్పీకంటే కనీసం రూ.5 నుంచి రూ.55 వరకు  తగ్గించి అమ్ముతున్నారు. మార్కెట్‌లో ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు వీటిని కొనసాగించాలని నిర్ణయించింది. 

ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఆయిల్‌ ధరలు పెరగడంతో దేశీయంగా వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టించారు. పాత నిల్వలను కూడా ఎమ్మార్పీకి మించి విక్రయిస్తున్నారు. దీంతో నూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. జనవరిలో లీటర్‌కు రూ.150–175 మధ్య ఉండగా, ఒకేసారి రూ.200 దాటాయి. ప్రియా ఆయిల్స్‌ అయితే లీటర్‌ రూ.200 నుంచి రూ.265 కు పెంచేశారు. వెంటనే ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది. స్టాక్‌ లిమిట్‌పై ఆంక్షలు విధించింది. టాస్క్‌ఫోర్స్‌తో మార్కెట్‌లో ధరలపై నిరంతర నిఘా పెట్టింది. హోల్‌సేల్, రిటైల్‌ షాపుల్లో విస్తృత తనిఖీలు నిర్వహించింది. విజయవాడ, గుంటూరు, విశాఖ తదితర ప్రధాన నగరాల్లో 75 మందికి పైగా వ్యాపారులు, హోల్‌సేల్‌ వ్యాపారులపై 6ఏ కేసులు నమోదు చేసింది. 1,802 టన్నులకు పైగా వివిధ రకాల నూనెలను స్వాధీనం చేసుకుంది. 

తక్కువ ధరలకే ఆయిల్స్‌
రైతుబజార్లు, మునిసిపల్‌ మార్కెట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి, వాటిలో విజయా ఆయిల్స్‌ను తక్కువ ధరకు అందుబాటులోకి తెచ్చింది. మార్కెట్లల్లో స్వాధీనం చేసుకున్న నూనెలను కూడా ఈ కౌంటర్లలో విక్రయిస్తోంది. ఈ విధంగా గత 15 రోజుల్లో 61,759 లీటర్లు విక్రయించింది. ఇటీవల ఆయిల్‌ రిఫైనరీస్, ఉత్పత్తి, సరఫరాదారులు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌తో సమావేశాలు నిర్వహించింది. ఈ చర్యలతో ధరలు దిగొచ్చాయి. ఎమ్మార్పీ కంటే రూ.55 వరకు తగ్గించి విక్రయించేందుకు వ్యాపారులు ముందుకొచ్చారు. వంట నూనెల ధరలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు నియంత్రణ చర్యలు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.  సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా వినియోగించే పామాయిల్‌ వారికి అందుబాటు ధరల్లో ఉండేలా చర్యలు చేపట్టింది. ప్రస్తుతం పామాయిల్‌ను మార్కెట్‌లో రూ.175కు విక్రయిస్తున్నారు. అయితే, ప్రభుత్వం పామాయిల్‌ లీటర్‌ రూ.150కే విక్రయించాలని నిర్ణయించింది. మంగళవారం నుంచి రైతు బజార్ల ద్వారా దీనిని విక్రయిస్తున్నారు. విజయ రిఫైన్డ్‌ ఆయిల్‌ రూ.178, వేరుశనగ, రైస్‌బ్రాన్‌ ఆయిల్స్‌ రూ.170కే అందుబాటులో ఉంచింది.

ధరలు అదుపులోకి వచ్చాయి
ధరల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి.  రైతు బజార్లతో పాటు మున్సిపల్‌ మార్కెట్లలో విజయా ఆయిల్స్‌ అందుబాటులోకి తెచ్చాం. వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. మార్కెట్‌పై నిఘాతో పాటు విస్తృత తనిఖీల ఫలితంగా ధరలు అదుపులోకి వచ్చాయి. పామాయిల్‌ను మంగళవారం నుంచి లీటర్‌ రూ.150కే అందుబాటులో ఉంచుతున్నాం. 
– చవల బాబూరావు, ఎండీ, ఏపీ ఆయిల్‌ ఫెడ్‌

5వేల జనాభా ఉన్న గ్రామాల్లోనూ నూనెల కౌంటర్లు
రైతుబజార్లు, మున్సిపల్‌ మార్కెట్లతో పాటు ఐదు వేలు జనాభా ఉన్న గ్రామాల్లో కూడా ప్రత్యేక కౌంటర్లతో నూనెలు విక్రయించాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఎం.గిరిజాశంకర్‌ చెప్పారు. ధరల నియంత్రణ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీతో మంగళవారం ఆయిల్‌ ఫెడ్‌ ఎండీ బాబూరావుతో కలిసి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో కమిషనర్‌ మాట్లాడారు. మార్కెట్‌లో పామాయిల్‌ లీటర్‌ ప్యాకెట్‌లో 900 గ్రాములకు బదులు 870 గ్రాములే ఉంటోందన్నారు. కొంతమంది ప్యాకెట్లపై ఎమ్మార్పీని చెరిపేసి ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని చెప్పారు. ఇటువంటి వ్యాపారులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement