Andhra Pradesh: ఊరు మారింది | CM YS Jagan Comments At YSR Pension Kanuka Event At Kakinada | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: ఊరు మారింది

Published Thu, Jan 4 2024 4:39 AM | Last Updated on Thu, Jan 4 2024 8:43 AM

CM YS Jagan Comments At YSR Pension Kanuka Event At Kakinada - Sakshi

‘‘చంద్రబాబు హయాంలో పింఛన్‌ కేవలం రూ.1,000 మాత్రమే ఉండేది. గత ఎన్నికలకు రెండు నెలల ముందు మాత్రమే రూ.2 వేలు చేశారు. ఆ ఎన్నికలే రాకపోతే చంద్రబాబు పింఛన్‌ మొత్తాన్ని పెంచేవారా?’’ 
– కాకినాడ సభలో సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, కాకినాడ: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా ‘వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక’ ద్వారా అవ్వా తాతలకు రూ.3,000 చొప్పున పింఛన్‌ను మన రాష్ట్రంలో మాత్రమే అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. మాట నిలబెట్టుకుంటూ పింఛన్‌ మొత్తాన్ని పెంచి ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రతి నెలా 66.34 లక్షల మందికి టంఛన్‌గా ఇంటి వద్దే చేతిలో పెడుతున్నామన్నారు. ఇందుకోసం నెలకు రూ.2 వేల కోట్లు వరకు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. పెన్షన్‌ మొత్తాన్ని పెంచడమే కాకుండా అర్హులందరికీ సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూరేలా పెన్షన్ల సంఖ్యను కూడా పెంచామన్నారు.

నాడూ నేడూ.. ఇదే రాష్ట్రం, అంతే బడ్జెట్, నిరుపేదలూ అదే సంఖ్యలో ఉన్నా చంద్రబాబు హయాంలో మేలు చేయాలనే ఆలోచన ఎందుకు చేయలేదు? బటన్లు ఎందుకు నొక్కలేదు? ఇవాళ మీ బిడ్డ ఇవన్నీ ఎలా చేయగలుతున్నాడు? అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కోరారు. అవ్వా తాతలకు పింఛన్‌ మొత్తాన్ని రూ.మూడు వేలకు పెంచుకుంటూ వెళతానంటూ నాడు పాదయాత్రలో ఇచ్చిన మాటను సంపూర్ణంగా నెరవేరుస్తూ ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం కాకినాడ రంగరాయ వైద్య కళాశాల (ఆర్‌ఎంసీ) క్రీడా మైదానంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

లబ్ధిదారులకు పింఛన్‌ సొమ్మును అందచేశారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక ప్రజా ప్రతినిధులు, గృహ సారథులు, వలంటీర్లు, వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులు, సీఎం జగన్‌ అభిమానుల  ఆధ్వర్యంలో ఈనెల 8వతేదీ వరకు ఈ కార్యక్రమాలను పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాకినాడకు పెద్ద ఎత్తున తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్‌ మాట్లాడారు.

క్యాలెండర్‌లో కాదు.. జీవితంలో మార్పు
అవ్వాతాతల పెన్షన్‌ రూ.3,000 వరకూ పెంచుకుంటూ పోతాం అని మేనిఫెస్టోలో చెప్పిన మాటను తు.చ. తప్పకుండా నెరవేరుస్తూ మీ అందరి సమక్షంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. కొత్త సంవత్సరం అంటే కేవలం క్యాలెండర్‌లో ఒక మార్పు మాత్రమే కాదు. కొత్త సంవత్సరం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆదాయం, ఆనందం పెరగాలి. మరింత మెరుగైన పరిస్థితుల్లోకి వెళ్లాలి. అలాంటి గొప్ప కార్యక్రమంలో ఇవాళ పాలు పంచుకుంటున్నా. 

నా వలంటీర్‌ తమ్ముళ్లు, చెల్లెమ్మలు..
పెన్షన్‌ తీసుకుంటున్న వీళ్లందరి పరిస్థితిని ఒక్కసారి గమనిస్తే పెద్ద వయసు వల్ల గానీ, విధిరాత వల్ల గానీ తమను తాము పోషించుకోలేని పరిస్థితుల్లో తల్లడిల్లుతున్నారు. అటువంటి 66.34 లక్షల మంది అవ్వాతాతలకు, అభాగ్యులకు, వితంతువులకు మంచి చేస్తూ మన ప్రభుత్వం సామాజిక పెన్షన్‌ను రూ.3,000 చేసింది. ఈ రోజు మనం పెన్షన్ల కోసం ప్రతి నెలా చేస్తున్న ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లు.

నెలలో ఒకటో తారీఖు మిగిలిన ప్రపంచానికి సెలవు, పండగ రోజు  కావచ్చు కానీ మీ జగనన్న సైన్యం, నా వలంటీర్‌ తమ్ముళ్లు, చెల్లెమ్మలకు మాత్రం అది ప్రతి అవ్వాతాతల ముఖంలో చిరునవ్వు చూసే రోజు. సూర్యోదయానికి ముందే చిరునవ్వుతో గుడ్‌ మార్నింగ్‌ చెబుతూ ప్రతి అవ్వకు, తాతకు మంచి మనవడిగా, మనవరాలిగా చేయూతనిస్తున్న నా వలంటీర్లకు మాత్రం అది సెలవు రోజు  కాదు. 

వెయ్యితో సరిపుచ్చిన బాబు..
మీ బిడ్డ ప్రభుత్వం రాకముందు చంద్రబాబు పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకూ కూడా అంటే నాలుగు సంవత్సరాల పది నెలల దాకా అవ్వా తాతలకు పెన్షన్‌ కేవలం రూ.1,000 ఇచ్చిన రోజులను ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్నికలు రావడంతో రెండు నెలల ముందు మాత్రమే పెన్షన్‌ రూ.2 వేలు చేశారు. ఎన్నికలు రాకపోయి ఉంటే చంద్రబాబు పెంచేవారా? ఆలోచన చేయమని ప్రతి అవ్వా తాతను కోరుతున్నా. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో పెన్షన్‌ కింద సగటున కేవలం రూ.58 వేలు మాత్రమే ఇవ్వగా ఇవాళ మీ బిడ్డ పాలనలో నాలుగున్నరేళ్లలో ప్రతి అవ్వాతాత చేతిలో పింఛన్ల కింద రూ.1.47 లక్షలు పెట్టాం. దివ్యాంగులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వారి చేతుల్లో కనీసం రూ.1.82 లక్షలు పెట్టాం.

నాడు పడిగాపులు, లంచాలు
గతానికి ఇప్పటికీ తేడా గమనించండి. నాడు పెన్షన్‌ కావాలంటే పడిగాపులు కాయాలి. జన్మభూమి కమిటీలకు లంచాలు ఇవ్వాలి. మీది ఏ పార్టీ? అని మొదట ప్రశ్న అడిగేవారు. చాంతాడంత క్యూలో నిలబడాలి. ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడిస్తారో తెలియదు. అడుగడుగునా జన్మభూమి కమిటీలకు లంచం ఇస్తే కానీ పని జరగని దుస్థితి. 

నేడు అర్హతే ప్రామాణికం
ఈ రోజు ఎవరికి పెన్షన్‌ కావాలన్నా అర్హత ఒక్కటే ప్రామాణికంగా అడుగులు వేస్తున్నాం. ప్రతి గ్రామంలో సచివాలయాలు, వలంటీర్‌ వ్యవస్థ మీ కళ్ల ఎదుటే కనిపిస్తోంది. ఇవాళ ఎక్కడా వివక్ష లేదు. ఎవరూ లంచం అడిగేవాడు లేడు. కులం, మతం, ప్రాంతం, వర్గం, చివరికి ఏ పార్టీ అని కూడా ఎవరూ అడగడం లేదు. అర్హత ఉంటే చాలు. మీ కష్టం.. నా కష్టంగా భావించి ప్రతి అవ్వకూ, తాతకూ, ప్రతి చెల్లెమ్మకూ తోడుగా నిలబడే కార్యక్రమం మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతోంది. 

కారణం.. మీ జగన్‌
ఇవాళ ఇంగ్లిషు మీడియం అంటే మీ జగన్‌! మంచి చదువులంటేనే మీ జగన్‌! ట్యాబ్‌లంటే మీ జగన్‌! గవర్నమెంట్‌ బడుల్లో ఐఎఫ్‌పీలు వచ్చాయంటే దానికి కారణం మీ జగన్‌! గత ప్రభుత్వం కంటే పెన్షన్‌ 3 రెట్లు  పెంచింది ఎవరంటే దానికి కారణం కూడా మీ జగనే. ఇవన్నీ కేవలం ఈ 55 నెలల కాలంలోనే జరుగుతున్నాయి. ఇవన్నీ మీరు ఆలోచన చేయమని కోరడానికి చెప్పాల్సి వస్తోంది.  

మీ ఇష్టం.. ఏ గ్రామాన్నైనా తీసుకోండి
ఇవాళ రాష్ట్రంలో ఇచ్ఛాపురం నుంచి కుప్పం దాకా ఏ గ్రామాన్నైనా తీసుకోండి. మీ ఇష్టం.. ప్రతి గ్రామంలోనూ మార్పు కనిపిస్తోంది. అడుగు పెడుతూనే ప్రతి గ్రామంలోనూ గతంలో లేని విధంగా మార్పు కనిపిస్తూ గ్రామ సచివాలయం గోచరిస్తుంది. అందులో 10 మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. ప్రతి గ్రామంలోనూ వలంటీర్‌ వ్యవస్థతోపాటు ఇంటి వద్దకే అందుతున్న రేషన్, ఆర్బీకే, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ కనిపిస్తాయి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమమూ కనిపిస్తుంది. నాడు–నేడుతో గ్రామంలో మారిపోయిన స్కూళ్లు, ఆస్పత్రులతో మన కళ్ల ఎదుటే మార్పులు కనిపిస్తాయి. మెరుగులు దిద్దిన 108, 104 కనిపిస్తాయి.

గతంలో 1,050 రోగాలకు మాత్రమే పరిమితమైన ఆరోగ్యశ్రీని ఇవాళ 3,250 ప్రొసీజర్లకు వర్తింపచేస్తూ ప్రతి పేదవాడికి అండగా నిలబడ్డాం. రైతులకు పగటి పూటే ఉచిత కరెంటు 9 గంటలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో అండగా నిలబడుతున్నాం. వసతి దీవెనతో అండగా ఉన్న పరిస్థితులూ కనిపిస్తున్నాయి. పిల్లల చేతుల్లో ట్యాబ్‌లు, స్కూళ్లలో ఐఎఫ్‌పీ తరగతి గదులు కనిపిస్తాయి. కేవలం 55 నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే చోటుచేసుకున్న మార్పులు ఇవన్నీ.

మీరే.. మా స్టార్‌ క్యాంపెయినర్లు 
సామాన్యులే ప్రచార సారథులు   
రాజకీయ పార్టీలకు ప్రచార సారథులుగా సర్వ సాధారణంగా ఉద్దండులే ఉంటారు! వైఎస్సార్‌ సీపీకి మాత్రం నాలుగున్నరేళ్లుగా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులే స్టార్‌ క్యాంపెయినర్లు. ఏ నిర్ణయం తీసుకున్నా సామాన్యుల కోణంలోనే ఆలోచిస్తూ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఈ ప్రభుత్వ పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగితే మీరే మీ బిడ్డకు సైనికులుగా తోడుండాలని నిండు మనసుతో చెబుతున్న తొలి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కుట్రపూరిత పొత్తులు, కుయుక్తులను ఆయన ఎన్నడూ నమ్ముకోలేదు. మాట ఇస్తే నిలబెట్టుకోవాలనే ఆరాటం, విశ్వసనీయత చాటుకోవడమే లక్ష్యంగా వడివడిగా సాగుతున్నారు. మరి ఆ స్టార్‌ క్యాంపెయినర్లు ఏమంటున్నారో తెలుసుకుందామా? 

నా పెద్దబిడ్డ జగన్‌ ఉన్నాడనే ధైర్యం.. 
కాళ్లరిగేలా తిరిగినా గత ప్రభుత్వంలో పెన్షన్‌ ఇవ్వలేదు. మీరు వచ్చిన రెండో నెలలోనే పెన్షన్‌ తీసుకున్నా. ఒకటో తారీఖు తెల్లారేసరికి వలంటీర్‌ ఇంటికి వచ్చి పెన్షన్‌ ఇస్తున్నాడు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నా పిల్లలకు కూడా అన్నీ అందుతున్నాయి. ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు కట్టుకుంటున్నా. కొడుకులు చూడకున్నా నాకు పెద్ద బిడ్డ జగన్‌ ఉన్నాడనే ధైర్యంతో ఉన్నా. కరోనా సమయంలో ఇంటికే బియ్యం ఇచ్చారు. మందులు పంపారు. ఆరోగ్యశ్రీలో పాతిక లక్షల వైద్యం చేస్తున్నారు. ఇంకేం కావాలి మాకు? మీరు మాట తప్పను, మడమ తిప్పను అన్నారు. అలాగే చేస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకూ జగన్‌ బాబుకే ఓటేసి గెలిపించుకుంటా. 
– వరలక్ష్మి, లబ్ధిదారు, కాకినాడ 

నిస్సహాయ కుటుంబానికి నవరత్నాల నీడ.. 
కరోనా సెకండ్‌ వేవ్‌లో మా ఆయనకు ఆరోగ్యశ్రీలో చికిత్స అందించినా దురదృష్టవశాత్తూ చనిపోయారు. ఎలా బతకాలిరా దేవుడా అని నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో వితంతు పింఛన్‌ వచ్చింది.  కరోనా సమయంలో మరణించిన వారికి ఇచ్చే రూ.50 వేలు కూడా అందాయి. ఆ డబ్బుతో చిన్న షాప్‌ పెట్టుకుని జీవిస్తున్నా. వివిధ పథకాల ద్వారా సుమారు రూ.1.70 లక్షల దాకా లబ్ధి పొందా. మా అత్తకు పింఛన్‌ ఇస్తున్నారు. నవరత్నాల పథకాలు మా జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మీరు ఆ దేవుడి రూపంలో మాకు సాయం చేస్తున్నారు. 
– కృష్ణవేణి, లబ్ధిదారు, కాకినాడ  

రూ.400 కోట్లు ఎక్కడ?.. రూ.2 వేల కోట్లు ఎక్కడ?
గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకూ కేవలం 39 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చారు. పెన్షన్ల కోసం నెలకు 400 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేయని పరిస్థితి. ఇవాళ 66.34 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. కేవలం పెన్షన్ల కోసం నెలకు రూ.2 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన వెంటనే తొలి సంతకంతో మొట్ట మొదటి రోజు నుంచే రూ.2,250కి పెన్షన్లను పెంచాడు. ఆ తర్వాత పెంచుకుంటూ వెళ్లి ఈ రోజు రూ.3,000 వరకూ తీసుకుని పోయాం. నా అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, దివ్యాంగులైన నా అన్నదమ్ముల ముఖంలో చిరునవ్వులు చూడాలని కోరుకున్నా.

ఒక్కసారి ఆలోచన చేయండి. ఎక్కడ రూ.1,000 పెన్షన్‌?.. ఎక్కడ రూ.3,000 పెన్షన్‌? ఎక్కడ 39 లక్షల పెన్షన్లు?.. ఎక్కడ 66.34 లక్షల పెన్షన్లు? నెలకు 400 కోట్ల రూపాయలు ఎక్కడ? నెలకు రూ.2 వేల కోట్లు ఎక్కడ? ఒక్క పెన్షన్లే కాకుండా ఏ పథకాన్ని తీసుకున్నా గత ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ఒక్కసారి గమనించాలి. మీ బిడ్డ ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వమని గర్వంగా చెబుతున్నా. పేదల మీద ప్రేమ, వారికి తోడుగా ఉండాలనే తపనతో అడుగులు పడ్డాయి. ప్రతి అడుగులోనూ మార్పు కనిపిస్తోంది. పేదల పట్ల ప్రేమ కనిపిస్తోంది. అక్కచెల్లెమ్మల పట్ల మంచి అన్నలా ఆప్యాయత కనిపిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement