విశాఖ విమల విద్యాలయం మూసివేత | Closure of Visakha Vimala Vidyalaya | Sakshi
Sakshi News home page

విశాఖ విమల విద్యాలయం మూసివేత

Published Fri, Jun 14 2024 4:46 AM | Last Updated on Fri, Jun 14 2024 4:46 AM

Closure of Visakha Vimala Vidyalaya

జీతాలు భరించలేమంటున్న స్టీల్‌ప్లాంట్‌

నిర్వహించలేమంటున్న యాజమాన్యం

రోడ్డున పడ్డ విద్యార్థులు, ఉపాధ్యాయులు 

ఉక్కునగరం/గాజువాక: స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో గత 40 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఉచిత తెలుగు మీడి­యం పాఠశాల.. ‘విశాఖ విమల విద్యాలయం’ హఠాత్తుగా మూతపడింది. పాఠశాలలు తెరుచుకునే ముందు రోజు పాఠశాల యాజమాన్యం విద్యార్థులు, ఉపాధ్యాయులకు షాక్‌ ఇచ్చింది. దీంతో సుమారు రెండు వేల మంది విద్యార్థులతో పాటు 70 మంది బోధన, బోధనేతర సిబ్బంది రోడ్డున పడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌లో తెలుగు విద్యార్థులు, నిర్వాసిత ప్రజల పిల్లల సౌకర్యార్థం స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం అభ్యర్థన మేరకు విశాఖకు చెందిన ఆర్‌సీఎం డయాసిస్‌ మిషన్‌ సంస్థ ఈ విద్యాలయాన్ని నిర్వహిస్తోంది. 

ఇందుకు సంబంధించి బిల్డింగ్‌తో పాటు విద్యుత్, మంచినీటి సరఫరా, ఫీజులు, సిబ్బంది జీతాలను ఉక్కు యాజమాన్యమే చెల్లిస్తోంది. ఇందులో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన నిర్వాసితులు, నిత్యం కూలి పనులు చేసుకునే వారి పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు. ప్రతి ఐదేళ్లకు ఎంవోయూను రెన్యువల్‌ చేస్తారు. యాజమాన్యం ఏడాదికి సుమారు రూ.6 నుంచి 7 కోట్లు జీతాల రూపేణా చెల్లిస్తోంది. ఈ ఏడాది మే 31తో ఎంవోయూ గడువు ముగియనున్న నేపథ్యంలో గతేడాది అక్టోబర్‌ నుంచి మిషన్‌ ప్రతినిధులు ఎంవోయూ రెన్యువల్‌ కోసం అభ్యర్థన పంపారు.

 యాజమాన్యం ఎంవోయూ కొనసాగిస్తుందన్న ధీమాతో పాఠశాల యాజమాన్యం ఈ ఏడాది అడ్మిషన్లు పూర్తి చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫాంల అమ్మకాలు చేసింది. ఈ నెల 11న ఉక్కు యాజమాన్యం నుంచి పిడుగు లాంటి వార్త అందింది. పాఠశాల నిర్వహణకు బిల్డింగ్‌ ఇస్తామని సొంత ఫీజులతో పాఠశాల నిర్వహణకు సంబంధించి కొత్త ఎంవోయూ చేసుకుందామని తెలిపింది. దీంతో పాఠశాల యాజమాన్యం హడావుడిగా ఉపాధ్యాయులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు 13 నుంచి పాఠశాలకు రావొద్దని సమాచారం ఇచ్చింది. 

ఈ విషయం తెలిసిన విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లల భవిష్యత్తేంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 78వ వార్డు కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు, పల్లా పెంటారావు తదితరులు పాఠశాలకు చేరుకుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నచ్చజెప్పారు.

సొంతంగా నిర్వహించలేం  
గత 40 ఏళ్లుగా స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో పాఠశాల నడుస్తోంది. రెన్యువల్‌ కోసం అభ్యర్థించగా కొత్త ఎంవోయూకు సిద్ధమవమంటున్నారు. ఫీజులు వసూలు చేసుకుని జీతాలు చెల్లించుకోమంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయుల జీతాలతో సమానంగా చెల్లించే మాకు సొంత ఫీజులతో పాఠశాల నిర్వహించే పరిస్థితి లేదు.   – ఫాదర్‌ రత్నకుమార్,  కరస్పాండెంట్‌ ఆర్‌సీఎం మిషన్‌ 

సీఎండీ బంగ్లా ముట్టడిస్తాం  
స్టీల్‌ప్లాంట్‌ కోసం భూములు త్యాగం చేసిన నిర్వాసితుల పిల్లల కోసం నిర్వహిస్తున్న పాఠశాలను మూసివేయడం అన్యాయం. పాఠశాలను వెంటనే తెరిపించకపోతే సీఎండీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. రెండు వేల మంది పిల్లల అంశంపై అడ్మిన్, సీఎండీ బంగ్లాను ముట్టడిస్తాం.   – బి.గంగారావు, 78వ వార్డు  కార్పొరేటర్‌  

పాఠశాల తెరిపిస్తాం  
హఠాత్తుగా పాఠశాలను మూసివేస్తే ఉపా«ధ్యాయులు, విద్యార్థులు రోడ్డున పడాల్సి వస్తుంది. ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల సహకారంతో ఉక్కు యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. పాఠశాలను తెరిపించే వరకూ వదిలే ప్రసక్తే లేదు.  – పల్లా పెంటారావు, కార్మిక నాయకుడు 

మా పిల్లల పరిస్థితేంటి?   
కూలీ, నాలీ చేసుకుని బతుకులు సాగిస్తున్నాం. నా భర్త చనిపోతే నేను కూలి పనిచేసుకుంటూ నా కొడుకుని ఈ పాఠశాలలో చదివిస్తున్నాను. ఇప్పుడు పాఠశాల మూసేస్తామంటే ఎక్కడ చదవాలి? ఎవరు చేర్చుకుంటారు మాలాంటి పేదోళ్లను.    – కృష్ణమ్మ, విద్యార్థి తల్లి 

మా చదువులు ఎలా?   
నేను పదో తరగతికి వచ్చాను. మేము చాలా పేదోళ్లం. మా తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల్లో చదివించే స్తోమత లేదు. ఇప్పుడు మా పరిస్థితేంటి? మా చదువులు మధ్యలో ఆగిపోవాల్సిందేనా?    – 10వ తరగతి విద్యార్థిని 

ఆందోళన వద్దు  
ఉక్కునగరంలోని విశాఖ విమల విద్యాలయం పునఃప్రారంభం విషయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు  ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని గాజువాక ఎంఈవోలు ఎం.సునీత, బి.విశ్వనాథం గురువారం ఓ ప్రకటనలో కోరారు. పాఠశాల మూసివేత వ్యవహారాన్ని జిల్లా విద్యాశాఖ దృష్టికి తీసుకెళ్లామని,  విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా జిల్లా విద్యాశాఖ ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతుందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement