మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు |Chandrababu Naidu And Eenadu Ramoji Rao Yellow Gang On Land Titling Act, Details Inside | Sakshi
Sakshi News home page

మాయం నారా మేనిఫెస్టో.. రారా టీవీ వీడియో ‘మాయ’గాళ్లు

Published Mon, May 6 2024 3:45 AM | Last Updated on Mon, May 6 2024 8:36 AM

‘ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంతో మీ భూమికి భద్రత’  అంటూ రామోజీరావు(రారా)కు చెందిన ఈటీవీ అన్నదాత ప్రసారం చేసిన కార్యక్రమం

‘ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం’ అద్భుతమంటూ ఈటీవీలో స్టోరీ 

నాలుగు నెలల కిందట ‘అన్నదాత’ కార్యక్రమంలో ప్రసారం

ఈ చట్టం వస్తే రైతుల భూములకు భద్రత ఉంటుందంటూ ప్రశంస 

ఇపుడేమో ఎన్నికల ముందు బాబు కోసం అడ్డగోలు దుష్ప్రచారం 

ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ భయపెట్టే రాతలు 

ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో ‘అన్నదాత’ వీడియో వైరల్‌ 

ఈటీవీలోనే 4 నెలల కిందట ప్రసారం చేశారని తెలిసి జనం విస్మయం 

కథ అడ్డం తిరిగిందని తెలిసి క్షణాల్లో వీడియోను మాయం చేసిన రామోజీ 

ఆ లింక్‌ను క్లిక్‌ చేసిన వారికి ‘దిసీజ్‌ ప్రైవేట్‌ వీడియో’ అనే మెసేజ్‌ ప్రత్యక్షం 

చంద్రబాబు సైతం ఎన్నికల్లో గెలవటానికి 2014లో వందలకొద్దీ హామీలు 

గెలిచాక టీడీపీ వెబ్‌సైట్లోంచి ఏకంగా మేనిఫెస్టోనే మాయం చేసేశారు 

2019లో ఈ చట్టాన్ని చేసేటపుడు అసెంబ్లీలో మద్దతిచ్చిన తెలుగుదేశం 

ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ 

కాలం మారుతోంది కాబట్టి ఇలాంటి చట్టాలు అవసరమని స్పష్టీకరణ 

ప్రభుత్వ చర్యను పూర్తిగా సమర్థిస్తున్నామంటూ బిల్లుకు మద్దతు 

అసెంబ్లీ రికార్డుల్లో సైతం భద్రంగా పయ్యావుల ప్రసంగం 

ఇపుడేమో ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూ టర్న్‌’ తీసుకున్న టీడీపీ 

ప్రతి సభలోనూ... మీ భూములు లాక్కుంటారంటూ బాబు అరుపులు 

అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకంటున్న నిపుణులు 

ఎన్నికల వేళ జనాన్ని భయపెట్టడమే ఎజెండాగా చెలరేగుతున్న ఎల్లో ముఠా 

ఈటీవీ వీడియో, కేశవ్‌ ప్రసంగం బయటపడటంతో పచ్చిగా వెల్లడైన భాగోతం

సాక్షి, అమరావతి: ఒకరు నారా... మరొకరు రారా (రామోజీరావు)! ఒకరికి 75... మరొకరికి 87. ఇద్దరికీ ఏళ్లు వచ్చినా బుద్ధి మాత్రం రాలేదు! ముందొక మాట చెప్పి.. ఆ వెంటనే నాలుక మడత పెట్టడంలో ఇద్దరూ ఆరితేరిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా... మళ్లీ ఎన్నికలొచ్చేసరికి కొత్త వాగ్దానాలు, రంగురంగుల మేనిఫెస్టోతో తయారైపోవటం చంద్రబాబు సహజ లక్షణం. 2014లో వందల హామీలిచ్చేసిన బాబు... ఎన్నికల్లో గెలిచిన వెంటనే వాటిని నెరవేర్చటం తన తరం కాదని తెలిసి ఏకంగా మేనిఫెస్టోనే కనపడకుండా చేసేశారు. 

ఆఖరికి తన పార్టీ వెబ్‌సైట్లో నుంచి కూడా తీసేశారు. రామోజీరావూ సేమ్‌ టూ సేమ్‌! కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తెస్తున్న ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టాన్ని రామోజీ గతంలో బాగా ప్రశంసించారు. దీన్లో ఉన్న అంశాలను వివరిస్తూ... ఈ చట్టంతో రైతుల భూమికి భద్రత ఉంటుందని, ఎక్కడైనా ఇబ్బందులొస్తే ప్రభుత్వమే వారికి పరిహారమిచ్చేలా గ్యారంటీ ఇస్తుంది కనుక ఇది చాలా మంచి చట్టమంటూ తన ఈటీవీ ‘అన్నదాత’ కార్యక్రమంలో ఓ స్టోరీని ప్రసారం చేశారు. 

ఇపుడు ఎన్నికల వేళ సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమీ లేక... ఇంకా అమల్లోకే రాని ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం వచ్చేసిందంటూ, ప్రభుత్వం అందరి భూములూ లాక్కుంటోందంటూ టీడీపీ విష ప్రచారం మొదలెట్టింది. టీడీపీ కూటమిలో ప్రధాన భాగస్వామి అయిన ‘ఈనాడు’ శక్తి మేరకు విషం చిమ్ముతోంది. ఈ చట్టం వస్తే ‘మీ భూములు మీవి కావు’ అంటూ విషపూరిత కథనాలు ప్రచురిస్తోంది. ఇక చంద్రబాబు, లోకేశ్‌ అయితే ‘మీ భూములు జగన్‌ ప్రభుత్వం లాక్కుంటుంది జాగ్రత్త..!’ అంటూ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌తో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ‘ఈటీవీ’ గతంలో ప్రసారం చేసిన కథనాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు ఆదివారం బయటపెట్టారు. వీడియో లింక్‌ను అందరికీ షేర్‌ చేశారు. దీంతో తన బండారం బయటపడి పోయిందని గ్రహించిన రామోజీరావు.. క్షణాల్లో ఆ వీడియోను యూట్యూబ్‌ నుంచి డిలీట్‌ చేయించారు. ఇపుడు ఆ లింకుపై క్లిక్‌ చేసిన వారికి... ‘దిసీజ్‌ ప్రైవేట్‌ వీడియో’ అనే మెసేజ్‌ కనిపిస్తోంది. ఇది చూసినవారు బాబు, రామోజీ ఇద్దరూ ఇద్దరే అంటూ విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈటీవీని పబ్లిక్‌గా ప్రసారం చేస్తున్నపుడు దాన్లోని వీడియోలు ప్రైవేట్‌వి ఎలా అవుతాయి? ఈ ప్రశ్నకు రామోజీ దగ్గర సమాధానం లేదు.  

గుడ్డలిప్పిన గురుశిష్యులు! 
కొద్దిరోజులుగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి అడ్డూ అదుపూ లేకుండా విషం చిమ్ముతున్న ఎల్లో మీడియా, చంద్రబాబు పరివారం బట్టలు విప్పుకుని బరి తెగించి చెబుతున్న మాయమాటలు కేవలం ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పన్నిన మాయోపాయాలేనని తేలిపోయింది. భూ హక్కు చట్టంపై చెబుతున్న బూటకపు కబుర్లన్నీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కారు కూతలేనని బయటపడింది. ఈ చట్టం చాలా మంచిదని, రాష్ట్రంలోని రైతులకు ఎంతో మేలు చేస్తుందంటూ స్వయంగా రామోజీ మీడియానే గతంలో అనేక కథనాలు అచ్చేసింది. 

ఈటీవీలోనూ పలు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయగా, చట్టం అద్భుతమని కితాబిస్తూ ఈనాడులోనూ కథనాలు రాశారు. రాష్ట్రంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి ఈటీవీ అన్నదాతలో నాలుగు నెలల క్రితం ‘టైటిల్‌ గ్యారంటీ చట్టంతో మీ భూమికి భద్రత’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేయడం గమనార్హం. ప్రముఖ భూ చట్టాల నిపుణుడు, హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ ఎం.సునీల్‌కుమార్‌ ఈ చట్టం వస్తే రాష్ట్రంలోని భూముల వ్యవస్థ ఎంతగా మారిపోతుందో చాలా కూలంకషంగా వివరించారు.   

చంద్రబాబు కోసం హఠాత్తుగా యూటర్న్‌ 
రామోజీ గతంలో తాను ఈ చట్టానికి అనుకూలంగా ప్రసారం చేసిన వీడియోకి విరుద్ధంగా ఎన్నికల్లో చంద్రబాబు లబ్ధి కోసం తాజాగా యూటర్న్‌ తీసుకున్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టానికి వ్యతిరేకంగా బురద జల్లే బాధ్యత తనపై వేసుకున్నారు. ఈ చట్టం ద్వారా రైతుల భూములకు భద్రత ఉంటుందని చెప్పిన నోటితోనే అది దుర్మార్గమంటూ నిస్సిగ్గుగా నాలుక మడతేశారు. రైతుల భూములు తెల్లారేసరికల్లా ఇతరుల పేరు మీదకు మారిపోతాయని, సీఎం జగన్‌ ప్రజల స్థిరాస్తులు లాక్కునేందుకే ఈ చట్టం తెచ్చారంటూ బరితెగించి దుష్ప్రచారానికి తెగబడ్డారు. 

ఈ అడ్డగోలు ప్రచారంతో ప్రజల మెదళ్లను విషపూరితం చేసేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం చాలా మంచిదంటూ ఈటీవీ ప్రసారం చేసిన వీడియో తాజాగా వైరల్‌ కావడంతో పచ్చ మంద నోట్లో పచ్చి వెలక్కాయ పడింది. అందులో ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఇది రాష్ట్రానికి అవసరమని, ఎంతో ప్రయోజనకరమని చెప్పిన అంశాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు. 

భూ హక్కుల చట్టం గురించి అంత గొప్పగా చెప్పి అది వస్తే భూములకు భరోసా వస్తుందని కితాబిచ్చిన రామోజీ ఇప్పుడు సిగ్గు విడిచి భూములు పోతాయని కల్లబొల్లి మాటలు చెప్పడం ఏమిటని అంతా విస్తుపోతున్నారు. చంద్రబాబు హయాంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభించి వదిలేసిన భూదార్‌ ప్రాజెక్టుకు ఈ చట్టం కొనసాగింపు అంటూ అదే కథనంలో ఈటీవీ కార్యక్రమంలో ప్రసారం చేశారు. అది అబద్ధమే అయినా సీఎం జగన్‌ హయాం­లో వచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గురించి చెప్పే క్రమంలో చంద్రబాబు చేయలేక వదిలేసిన భూదార్‌ గురించి ప్రస్తావించారు. 

ఈ ప్రత్యేక కథనంలో ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం గొప్పదనం, దాని ఆవశ్యకత, రైతులకు చేకూరే  ప్రయోజనాలు, భూముల వ్యవస్థలో వచ్చే మార్పుల గురించి సోదాహరణంగా వివరించారు. ఎంతో మంచి చట్టమని కితాబిచ్చిన రామోజీ ఎన్నికల వేళ ఈ స్థాయికి దిగజారడంపై ప్రజ­ల్లో విస్మయం వ్యక్తమవుతోంది. దీనిబట్టి ఈనాడు, ఈటీవీ కార్యక్రమాలన్నీ ప్రజలను మభ్యపుచ్చడం, చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమేనని మరోసారి స్పష్టమైందని పేర్కొంటున్నారు.   

ఆదరాబాదరాగా అదృశ్యం.. 
ఈ వీడియోతో తమ పరువు బజారున పడిందని గ్రహించడంతో నాలుక కరుచుకున్న రామోజీ ఆదరబాదరగా యూట్యూబ్‌లోని ఈటీవీ ఛానల్‌లో దాన్ని ఎవరూ చూడకుండా చేశారు. 2014 ఎన్నికల్లోనూ ప్రజలను మాయ చేసేందుకు చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి మేనిఫెస్టో విడుదల చేశాడు. అనంతరం అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయాలని ప్రజలు కోరుతుండడంతో వాటి గురించి ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో టీడీపీ వెబ్‌సైట్‌ నుంచి తొలగించి తన దొంగ బుద్ధిని చాటుకున్నారు. 

ఇప్పుడు రామోజీ కూడా ఎంతో మంచిదని తాను ప్రసారం చేసిన ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం వీడియోను ఈటీవీ యూట్యూబ్‌ ఛానల్‌లో కనపడకుండా మాయం చేశారు. తద్వారా రామోజీ, చంద్రబాబు ప్రజా ప్రయోజనాలు పట్టని గురు శిష్యులని మరోసారి స్పష్టంగా రుజువైంది. కాగా 2019లో ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం బిల్లుకు అసెంబ్లీలో టీడీపీ మద్దతివ్వడం గమనార్హం. 

ఈ చట్టంతో భూ కబ్జాలకు తెర పడుతుందన్న టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీ పూర్తిగా సమర్థిస్తోందంటూ బిల్లుకు మద్దతు పలికారు. ఇప్పుడు ఎన్నికల ప్రయోజనాల కోసం ‘యూటర్న్‌’ తీసుకుని మీ భూములు లాక్కుంటారంటూ ప్రతి సభలోనూ చంద్రబాబు పెడబొబ్బలు పెడుతుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. అసలు అమల్లోకి రాని చట్టంపై ఇంత దుష్ప్రచారమెందుకని నిపుణులు ప్రశి్నస్తున్నారు.   

ఈటీవీలో ఏం చెప్పారంటే.. 
భూ యజమానులకు భద్రత కల్పించే టైటిల్‌ గ్యారంటీ చట్టం భవిష్యత్తులో రాబోతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఇది అమల్లోకి వచ్చింది. మీకు భూమి ఉంటే అది పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలోగానీ ఆన్‌లైన్‌ రికార్డులోగానీ నమోదై ఉంటుంది. ప్రస్తుత విధానంలో భూములున్నా సరైన పాస్‌ పుస్తకాలు, ఇతర హక్కు పత్రాలు లేక రికార్డుల్లో సరైన వివరాలు నమోదు కానందువల్ల భూ యజమానులు ఒక్కోసారి ఇబ్బందులు పడుతున్నారు. కొత్త చట్టాన్ని అనుసరించి భూ యజమానులు తమ వివరాలను నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. టైటిల్‌ రిజిష్టర్‌లో ఎవరి పేరు ఉంటే ఆ వ్యక్తినే భూ యజమానిగా పరిగణించి ప్రభుత్వం ఆ భూమికి గ్యారంటీ కల్పిస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement