బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద | Chandrababu Conspiracy on name of insurance: Andhra pradesh | Sakshi
Sakshi News home page

బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద

Published Wed, May 8 2024 12:10 AM | Last Updated on Wed, May 8 2024 5:36 PM

Chandrababu Conspiracy on name of insurance: Andhra pradesh

బీమా పేరుతో ఈ పథకాన్ని అటకెక్కించే కుట్ర 

టీడీపీ మేనిఫెస్టో సాక్షిగా బట్టబయలు 

అదే జరిగితే పేదలకు ఉచిత వైద్యం మాయం 

ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా అంటూ బురిడీ 

టీడీపీ మేనిఫెస్టోలో లేని ఆరోగ్యశ్రీ, ఉచిత చికిత్సల ప్రస్తావన 

తొలి నుంచి ఆరోగ్యశ్రీని నిర్విర్యం చేసేలా చంద్రబాబు చర్యలు 

ఈ పెద్దమనిషి జమానాలో ప్రభుత్వ వైద్య రంగానికి సుస్తీ 

ఎలుకలు కొరికి చిన్నారులు మృతి చెందే దుస్థితిలో ప్రభుత్వాస్పత్రులు  

2014–19 మధ్య ప్రొసీజర్‌లు పెంచకుండా ఆరోగ్యశ్రీ నిర్విర్యం 

సీఎం జగన్‌ హయాంలో ఆరోగ్యశ్రీ బలోపేతం.. ప్రజారోగ్యానికి అండ  

విప్లవాత్మక సంస్కరణలతో ప్రభుత్వ వైద్య రంగంలో సువర్ణాధ్యాయం 

17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు  

ఫ్యామిలీ డాక్టర్‌తో పల్లె చెంతకే వైద్యం.. విలేజ్‌ క్లినిక్‌తో భరోసా 

డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం రాష్ట్రంలోని 1.40 కోట్లకుపైగా కుటుంబాలకు ఆపద్బాంధవి. దురదృష్టవశాత్తు ఏదైనా జబ్బు చేస్తే ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళితే చేతి నుంచి రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా చికిత్స అందుతోంది. ఏదైనా శస్త్ర చికిత్స జరిగినా డిశ్చార్జి అయి ఇంటికి వెళ్లాక విశ్రాంత సమయంలో సైతం ప్రభుత్వం ఆరోగ్య ఆసరా ద్వారా భృతి కూడా ఇస్తోంది. వెరసి పేద, మధ్య తరగతి కుటుంబాలకు కష్టకాలంలో ఈ పథకం కొండంత అండగా నిలుస్తోంది. 

ఇంతటి గొప్ప పథకంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు శీతకన్ను వేశారు. నాడు వైఎస్సార్‌కు, నేడు సీఎం జగన్‌కు ఎంతో మంచి పేరు తెచ్చిన ఈ పథకాన్ని ఏదోరకంగా కనుమరుగు చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలో 2014–19 మధ్య ఈ పథకానికి పూర్తిగా ప్రాధాన్యం తగ్గించారు. ప్రొసీజర్‌లు, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల సంఖ్యను పెంచకుండా అధికారం లోంచి దిగిపోయేనాటికి అంపశయ్య పైకి ఎక్కించారు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం జగన్‌ ఈ పథకానికి ఊపిరిలూదారు. దీంతో బాబుకు మింగుడు పడలేదు. ఇలా అయితే లాభం లేదనుకుని పెద్ద స్కెచ్చే వేశారు. బీమా పేరుతో మాయ చేసి, మేనిఫెస్టోలో ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేకుండా చేశారు.  

2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇటీవల టీడీపీ, జనసేన పారీ్టలు ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేశాయి. వైద్యం, ఆరోగ్యం అంటూ నాలుగు అంశాలను పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని మెరుగ్గా అమలు పరుస్తామని గానీ, పేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సేవలు (క్యాష్‌ లెస్‌ ట్రీట్‌మెంట్‌), రోగ నిర్ధారణ పరీక్షల సౌకర్యం కల్పిస్తామని ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్నిబట్టి బాబు వస్తే ఆరోగ్యశ్రీ పథకం కనుమరుగవుతుందనడానికి టీడీపీ మేనిఫెస్టో ఒక సంకేతం అని రాజకీయ విశ్లేషకులు, వైద్య రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం డాక్టర్‌ వైఎస్సార్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ద్వారా ప్రభుత్వమే ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తోంది. ట్రస్ట్‌లో ఎంప్యానెల్డ్‌ అయిన ఆస్పత్రుల్లో పేదలు, మధ్యతరగతి కుటుంబాల వారు చేతి నుంచి నగదు చెల్లించకుండానే పూర్తి స్థాయిలో చికిత్సలు పొందుతున్నారు. కాగా, టీడీపీ తాజా హామీని గమనించినట్లయితే వాళ్లు అధికారంలోకి వస్తే.. ట్రస్ట్‌ స్థానంలో థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ఏజెన్సీలను ప్రవేశపెట్టనున్నారని ఇట్టే తెలుస్తోంది. ఇప్పటి వరకు ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రభు త్వమే నేరుగా పథకాన్ని అమలు చేయడంతో ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు వైద్య సేవలు అందుతున్నా యి. అదే ఇన్సూరెన్స్‌ ఏజెన్సీల చేతుల్లోకి వెళితే వారి లాభాపేక్ష వల్ల ప్రజలకు వైద్య సేవల కల్పన ప్రశ్నార్థకంగా మారుతుందనడంలో సందేహమే లేదు. 

ట్రస్ట్‌ అయితే అందులో ఎంప్యానెల్డ్‌ అయిన ఆస్పత్రులు ఏ ప్రొసీజర్స్‌కు అయి నా నిర్ధే శించిన రేట్స్‌ ప్రకారమే వైద్య సేవలు అందిస్తాయి. అంతకు మించి ప్రజల నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడ్డానికి వీలుండదు. అలా వసూళ్లకు పాల్పడితే జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో ట్రస్ట్‌ సీఈవో ఆధ్వర్యంలో ఆస్పత్రులపై చర్యలు తీసుకునే ఒక వ్యవస్థ ఉంటుంది. అదే ప్రైవే ట్‌ ఇన్సూరెన్స్‌ ఏజెన్సీలు వస్తే ఆస్పత్రులపై ప్రభుత్వ నియంత్రణ పోతుంది. ఇష్టారాజ్యంగా బిల్లులు వేసి ప్రజల నుంచి అదనపు వసూళ్లు చేస్తాయి. లేదంటే ఆస్పత్రి నుంచి బయటకు పంపించేస్తాయి. 

ఆరోగ్యశ్రీ ప్రస్తావనే లేని 2024 టీడీపీ మేనిఫెస్టో 
∗ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా  
∗ ప్రతి పౌరుడికి డిజిటల్‌ హెల్త్‌ కార్డు 
∗ అన్ని మండలాల్లో జనరిక్‌ ఔషధ కేంద్రాలు 
∗ బీపీ, షుగర్‌ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులకు జనరిక్‌ మందులు  

2024 వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టో 
∗ రాష్ట్రంలో ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలలతో పాటు, మరో 12 కళాశాలల నిర్మాణం పూర్తి చేసి ఐదేళ్లలో అందుబాటులోకి తేవడం.తద్వారా 2,550 ఎంబీబీఎస్, 2,737 పీజీ మెడికల్‌ సీట్లు సమకూర్చడం.
∗ కొత్తగా 17 నర్సింగ్‌ కాలేజీలు తేవడం ద్వారా అందుబాటులోకి 1,020 నర్సింగ్‌ సీట్లు. 
∗ హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో మూడు వైద్య హబ్‌ల ఏర్పాటు. 
∗ క్యాన్సర్‌ వైద్యాన్ని మరింత బలోపేతం చేసేలా గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్‌ కేర్‌ సెంటర్‌లు.
∗ గడచిన ఐదేళ్లలో మాదిరిగానే వచ్చే ఐదేళ్లలోనూ ప్రజారోగ్య రంగానికి ఏ మాత్రం ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు. వైద్య రంగ అభివృద్ధిని కొనసాగిస్తాం. 

పై రెండు మేనిఫెస్టోలు గమనిస్తే ప్రజారోగ్యం పట్ల ఏ నాయకుడికి ఎంత 
చిత్తశుద్ధి ఉందో స్పష్టంగా అర్థం అవుతుంది. మూడు సార్లు సీఎంగా పనిచేశా.. విజనరీనని చెప్పుకునే నాయకుడు ప్రజారోగ్యం పట్ల ఉజ్జాయింపుగా నాలుగంటే నాలుగే హామీలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సీఎం జగన్‌ మాత్రం ప్రజారోగ్యం విషయంలో గడచిన ఐదేళ్లలో దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ప్రజారోగ్యం విషయంలో రాజీ పడకుండా చర్యలు తీసుకున్నారు. ఎన్నో సంస్కరణలు తీసుకుని వచ్చి దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆ ఒరవడిని అదే విధంగా కొనసాగిస్తూ వచ్చే ఐదేళ్లలోను ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తానని తన మేనిఫెస్టోలో ప్రకటించారు.  

సాక్షి, అమరావతి: వైద్య, విద్యా రంగాలను ప్రైవేట్‌ పరం చేయాలన్నది చంద్రబాబు లక్ష్యం. ఇందులో భాగంగానే తొలి నుంచీ ఆయన ప్రభుత్వ వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ‘ఆరోగ్యశ్రీలో వ్యాధులన్నింటినీ చేర్చి, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్‌ సౌకర్యం కల్పిస్తాం’ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక తూతూ మంత్రంగా ప్రొసీజర్‌లను పెంచి చేతులు దులుపుకున్నారు.

2007లో వైఎస్సార్‌ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పథకాన్ని ఎన్టీఆర్‌ వైద్య సేవగా పేరు మార్చి, కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి. వివిధ అనారోగ్య బాధితులకు చికిత్సలు అందించడానికి ఆస్పత్రుల నుంచి ట్రస్టుకు అభ్యర్థనలు వచ్చినా వాటిని రోజుల తరబడి పెండింగ్‌లో ఉంచేవారు.

దీంతో చేసేదేమీ లేక చికిత్సలు చేయించుకోవడానికి ప్రజలు అప్పులపాలైన దుస్థితి. ఈ ఐదేళ్ల పాలనలో ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేసి, విప్లవాత్మక సంస్కరణలు చేపట్టి సీఎం జగన్‌ ప్రజలకు అండగా నిలిచారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.5 లక్షల్లోపు వార్షికాదాయ కుటుంబాలను పథకం పరిధిలోకి తెచ్చి, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలిచారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.25 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు.

1,059గా ఉన్న ప్రొసీజర్‌లను ఏకంగా 3,257కు పెంచారు. తద్వారా ఐదేళ్లలో 45.10 లక్షల మందికి ఉచిత చికిత్సల కోసం రూ.13,421 కోట్లు వెచ్చించారు. ఆరోగ్య ఆసరా కింద రూ.1,465 కోట్ల మేర శస్త్ర చికిత్సలు చేయించుకున్న 24.59 లక్షల మందికి సాయం చేశారు.

జగన్, బాబు పాలన మధ్య ఎంతో తేడా! 
అంశం: కొత్త వైద్య కళాశాలలు  
జగన్‌ పాలన: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనట్టుగా 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు. ఇందుకోసం ఏకంగా రూ.8,480 కోట్లు వెచ్చిస్తున్నారు. అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ సేవలు చేరువ చేస్తున్నారు. ఇప్పటికే విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను ప్రారంభించి ఒకే ఏడాది 750 ఎంబీబీఎస్‌ సీట్లలో అడ్మిషన్లు కల్పించారు. ఈ విద్యా సంవత్సరం మరో ఐదు, వచ్చే విద్యా సంవత్సరం మిగిలిన ఏడు కళాశాలలు ప్రారంభించేలా ప్రణాళికలు రచించారు.  
బాబు పాలన: టీడీపీ అధికారంలో ఉండగా ఏ రోజు ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు పాటుపడింది లేదు. వైద్య విద్యను వ్యాపారం చేసి తన వాళ్ల జేబులు నింపడానికే పాటుపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 16 ప్రైవేట్‌ వైద్య కళాశాలలకు బాబు పాలనలో అనుమతులు ఇవ్వడమే ఇందుకు నిదర్శనం.  

అంశం : గ్రామీణ ప్రజల ఆరోగ్యం 
జగన్‌ పాలన: పీహెచ్‌సీ వైద్యులనే గ్రామాలకు పంపి ప్రజలకు వైద్య సేవలు అందించారు. మంచానికే పరిమితం అయిన రోగుల ఇళ్ల వద్దకే వెళ్లి, వారి ఆరోగ్యాలపై వాకబు చేశారు. 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారు. వీటిల్లో బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్హత కలిగిన కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌(సీహెచ్‌వో)లను నియమించారు. తద్వారా 12 రకాల వైద్య సేవలు, 14 రకాల వైద్య పరీక్షలతో పాటు, 105 రకాల మందులను అందుబాటులో ఉంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. 

వీటికి తోడు విలేజ్‌ క్లినిక్స్‌లో టెలీ మెడిసిన్‌ సౌకర్యం ఉండటంతో స్పెషలిస్ట్‌ వైద్యుల కన్సల్టేషన్‌ సైతం ఇక్కడే లభిస్తుండటంతో పట్టణాలు, నగరాల్లోని పెద్దాస్పత్రులకు ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండటం లేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వమే ఇళ్ల వద్దకు మందుల డోర్‌ డెలివరీ ప్రారంభించింది.  

బాబు పాలన: పల్లె ప్రజలకు సుస్తీ చేస్తే పట్టణాలు, నగరాలకు పరుగులు తీయాల్సిందే. ఫ్యామిలీ డాక్టర్‌ వంటి కార్యక్రమం ఉండేది కాదు. విలేజ్‌ క్లినిక్‌ వ్యవస్థ ఊసే లేదు. పీహెచ్‌సీలకు వెళితే అక్కడ డాక్టర్‌లు ఉంటారో లేదో తెలియని దుస్థితి. దీంతో చిన్న అనారోగ్య సమస్య వచ్చినా, వ్యయప్రయాసలకోర్చి పరుగు తీయాల్సిన పరిస్థితి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఉచితంగా మందుల పంపిణీ, క్రమం తప్పకుండా వారి ఆరోగ్యంపై వాకబు చేసే వ్యవస్థ లేక, ప్రజలు జబ్బు ముదిరి అప్పులపాలయ్యేవారు.   

అంశం : ఇంటింటా ఆరోగ్య సర్వే 
జగన్‌ పాలన: అందరి ఆరోగ్యమే లక్ష్యంగా ప్రభుత్వం జగనన్న ఆరోగ్య సురక్షను ప్రవేశపెట్టింది. ప్రతి ఇంటిని జల్లెడ పట్టి, వైద్య పరీక్షలు నిర్వహించి వివిధ అనారోగ్య బాధితులను గుర్తించారు. వారికి పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడికక్కడ సురక్ష శిబిరాలు నిర్వహించి స్పెషలిస్టు వైద్యులతో ఉచితంగా వైద్య సేవలు అందించారు. మెరుగైన వైద్యం అవసరం ఉన్న వారిని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు తరలించి, ఉచితంగా చికిత్స చేయించారు.   
బాబు పాలన: ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమం నిర్వహించిందే లేదు. రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి ఆరోగ్యాన్ని వాకబు చేసి, వాటి పరిష్కారానికి కనీసం ఆలోచించిన పాపాన పోలేదు.  

అంశం: ఆస్పత్రుల్లో నాడు–నేడు 
జగన్‌ పాలన: వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే నాడు–నేడు కార్యక్రమంల ద్వారా ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశారు. రూ.16,880 కోట్లతో ఆస్పత్రుల భవనాలకు మరమ్మతులు, పాతవాటి స్థానంలో కొత్తవాటి నిర్మాణం, 17 కొత్త వైద్య కళాశాలలు, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం చేపట్టారు. జాతీయ ప్రమాణాలతో ఆస్పత్రుల్లో వనరులను సమకూర్చారు. దీంతో 640 ఆస్పత్రులకు నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ (ఎన్‌క్వాష్‌), 42 ఆస్పత్రులకు ముస్కాన్, 2022–23లో 3,161 ఆస్పత్రులకు కాయకల్ప గుర్తింపుతో దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది.

కేరళ సైతం ఈ అంశాల్లో ఏపీ కన్నా ఎంతో వెనుకబడి ఉంది. ఆస్పత్రుల్లో ఏ ఒక్క వైద్య, సిబ్బంది పోస్టు ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా ఐదేళ్లలో 54 వేల మేర పోస్టులు భర్తీ చేసి రికార్డు సృష్టించారు. 108 వ్యవస్థకు ఊపిరిలూదుతూ రూ.136 కోట్లతో 768 అంబులెన్స్‌లు సమకూర్చి సేవలు విస్తరించారు. ఫ్యామిలీ డాక్టర్‌ అమలు కోసం రూ.166 కోట్లతో 104 వాహనాలు సమకూర్చారు. మొత్తం 936 వాహనాలు సేవలందిస్తున్నాయి. 

బాబు పాలన: రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేసేలా టీడీపీ జమానాలో ఏ ఒక్క కార్యక్రమం చేపట్టలేదు. ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది, మందులు, సర్జికల్స్, ఇతర వనరులకు తీవ్ర కొరత ఉన్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టుగానే బాబు వ్యవహరించారు. 2014–19 మధ్య గుంటూరు జీజీహెచ్‌లో ఎలుకలు కొరికి శిశువు మృతి చెందడం బాబు పాలనలో దిగజారిన ప్రభుత్వ వైద్య రంగ దుస్థితికి నిదర్శనం. ఈ ఘటన అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన అనంతరం గుణపాఠంతో ఆస్పత్రులను బలోపేతం చేసేలా అడుగులు వేయలేదు. ఐదేళ్ల బాబు పాలనలో కేవలం 4 వేల మేర పోస్టులను మాత్రమే వైద్య శాఖలో భర్తీ చేశారు. బాబు పాలనలో 108, 104 వ్యవస్థలు కూనరిల్లాయి. 

ఎవరు కావాలో ఆలోచించండి  
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని ఇంతగా నిర్వీర్యం చేసిన నేత ఒక్క చంద్రబాబు తప్ప దేశంలో మరొకరుండరు. సింగపూర్, యూకే ప్రపంచ స్థాయి రాజధాని అంటూ బాబు బాకాలు ఊదిన అమరావతికి కూత వేటు దూరంలోని గుంటూరు జీజీహెచ్‌లోనే అప్పట్లో శిశువును ఎలుకలు కొరికి చంపేశాయి. 2019లో అధికారంలోకి రాగానే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాస్పత్రులను సంస్కరించారు. వైద్య రంగానికి ఊపిరిలూదారు. పెద్దాస్పత్రులను ఐదేళ్లలో అవయవాలు మార్పిడి చేసే స్థాయికి తీసుకెళ్లారు.

ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష, విలేజ్‌ క్లినిక్స్‌ వంటి వ్యవస్థల ద్వారా ప్రజల వద్దకే సర్కార్‌ వైద్యాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్య రంగాన్ని దిగజార్చిన బాబు, ఆ వైద్య రంగానికి ఊపిరిలూదిన వైఎస్‌ జగన్‌.. ఈ ఇద్దరిలో ఎవరు కావాలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సముచిత నిర్ణయం తీసుకోకపోతే వైద్యానికి డబ్బు కోసం ఆస్తులు తాకట్టుపెట్టాలి. ఆస్తులు లేని వారు తల తాకట్టు పెట్టే పరిస్థితులు వస్తాయని గుర్తుంచుకోవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement