పోలవరం నావిగేషన్‌ కెనాల్‌పై కదలిక | Central Govt moved on Polavaram Project Navigation Canal | Sakshi
Sakshi News home page

పోలవరం నావిగేషన్‌ కెనాల్‌పై కదలిక

Published Fri, Feb 24 2023 3:48 AM | Last Updated on Fri, Feb 24 2023 9:34 AM

Central Govt moved on Polavaram Project Navigation Canal - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నావిగేషన్‌ కెనాల్‌పై కేంద్రం కదిలింది. కేంద్ర షిప్పింగ్, పోర్టుల శాఖ కార్యదర్శి సుదాన్‌‡్షపంత్, ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఐడబ్ల్యూఏఐ) చైర్మన్‌ సంజయ్‌ బందోపాధ్యాయ, సీడబ్య్లూసీ (కేంద్ర జలసంఘం) చైర్మన్‌ కుశ్వీందర్‌ వోరా, పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) సీఈఓ శివ్‌నందన్‌ కుమార్, రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, ఈఎన్‌సీ సి. నారాయణ­రెడ్డి­లతో గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

జాతీయ జలమార్గం–4లో పేర్కొన్న క్లాస్‌–3 ప్రమా­ణాలతో పోలవరం నావిగేషన్‌ కెనాల్‌ను అభివృద్ధి చేయాలంటే రూ.876.38 కోట్ల వరకు  ఖర్చవుతుందని సమావేశంలో రాష్ట్ర అధికారులు వివరించారు. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ ప్రకారం ఇప్పటికే నావిగేషన్‌ కెనాల్, మూడు లాక్‌లు, టన్నెల్‌ నిర్మాణ పనులు చేపట్టామన్నారు.

ప్రస్తుతం చేపట్టిన నావి­గేషన్‌ కెనాల్‌ను చిన్న పడవల రవాణాకు ఉపయో­గించుకుని.. దానికి సమాంతరంగా క్లాస్‌–3 ప్రమా­ణాలతో మరో నావిగేషన్‌ కెనాల్‌ తవ్వి, దాన్ని భారీ నౌకల రవాణాకు వాడుకోవాలని ప్రతిపాదించారు. దీనిపై కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ స్పందిస్తూ.. ఈ ప్రతిపాదనపై అధ్య­యనానికి కేంద్ర షిప్పింగ్, ఐడబ్ల్యూఏఐ, సీడ­బ్ల్యూసీ, పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ అధికా­రులతో కమిటీ వేస్తామన్నారు.

రెండు నెలల్లోగా అధ్యయనం చేసి ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా పోలవరం నావిగేషన్‌ కెనాల్‌పై చర్యలు తీసుకుంటామని చెప్పారు. అప్పటివరకూ నావిగేషన్‌ కెనాల్‌ పనులు ఆపేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. 

2016 నుంచి ఉలుకూ పలుకులేని ఐడబ్ల్యూఏఐ
నిజానికి.. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను 2004–05లోనే కేంద్రం ఇచ్చింది. సీడబ్ల్యూసీ ఆమోదించిన డిజైన్‌ మేరకు ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇందులో పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరిపై ఎగువకు, దిగువకు నౌకయానానికి వీలుగా 36.6 మీటర్ల వెడల్పు.. 9.6 మీటర్ల పూర్తి ప్రవాహ లోతు (ఎఫ్‌ఎస్‌డీ)తో 1.423 కి.మీల పొడవుతో అప్రోచ్‌ చానల్‌.. దానికి కొనసాగింపుగా 40 మీటర్ల వెడల్పు, 10 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్‌ లాక్‌లు.. 12 మీటర్ల వెడల్పు, 3.81 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్‌ కెనాల్‌.. 12 మీటర్ల వెడల్పు, 3.66 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీ, 2.34 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్‌ టన్నెల్‌ పనులను చేపట్టింది. ఇందులో 2014 నాటికే నావిగేషన్‌ లాక్‌ల పనులు దాదాపుగా పూర్తిచేసింది. నావిగేషన్‌ టన్నెల్‌ పనులు 90 శాతం పూర్తిచేసింది. అలాగే..

► 2013–14 ధరల ప్రకారం సీడబ్ల్యూసీ టీఏసీ ఆమోదించిన వ్యయం మేరకు నావిగేషన్‌ కెనాల్‌ పనుల అంచనా వ్యయం రూ.261.62 కోట్లు. ఇందులో రూ.137.93 కోట్ల విలువైన పనులను రాష్ట్ర ప్రభుత్వం పూర్తిచేసింది.

► ఈ క్రమంలో 2016లో ఐడబ్ల్యూఏఐ గోదావరి, కృష్ణా నదులను జాతీయ జలమార్గం–4గా ప్రకటించి.. అందులో భాగంగానే ధవళేశ్వరం నుంచి భద్రాచలం స్ట్రెచ్‌ను చేర్చింది. ఈ జలమార్గాన్ని క్లాస్‌–3 ప్రమాణాలతో చేపట్టాలని నిర్ణయించింది. 

► క్లాస్‌–3 ప్రమాణాలతో పోలవరం నావిగేషన్‌ కెనాల్‌ను నిర్మించాలంటే.. 1.423 కి.మీల పొడవున అప్రోచ్‌ ఛానల్‌ను 40 మీటర్ల వెడల్పు, 2.20 ఎఫ్‌ఎస్‌డీతోనూ.. దానికి కొనసాగింపుగా 70 మీటర్ల వెడల్పు, 15 మీటర్ల ఎత్తు గేటుతో మూడు నావిగేషన్‌ లాక్‌లు.. 40 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీతో 3.84 కి.మీల పొడవున నావిగేషన్‌ కెనాల్‌.. 20 మీటర్ల వెడల్పు, 2.20 మీటర్ల ఎఫ్‌ఎస్‌డీ, 7 మీటర్ల నిలువుతో 890 మీటర్ల పొడవున నావిగేషన్‌ టన్నెల్‌ పనులను చేపట్టాలి. 

► ఈ పనులకు రూ.876.38 కోట్ల వ్యయమవుతుందని.. ఆ మేరకు నిధులు విడుదలచేస్తే పనులు చేపడతామని ఐడబ్ల్యూఏఐకి అనేకమార్లు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు ప్రతిపాదించారు. కానీ, ఐడబ్ల్యూఏఐ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

జలాశయం పూర్తవుతుండటంతో..
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం శర­వేగంగా పూర్తిచేస్తోంది. ప్రాజెక్టు పూర్తయితే నావిగేషన్‌ కెనాల్, టన్నెల్‌ పనులు చేపట్టడం చాలా కష్టం. ఈ నేపథ్యంలోనే కేంద్ర జల్‌శక్తి శాఖ రంగంలోకి దిగింది. జాతీయ జల­మార్గం ప్రమాణాలతో పోలవరం నావి­గేషన్‌ పనులను చేపట్టాలని ఐడబ్ల్యూఏఐకు సూచించింది. ఈ క్రమంలోనే గురువారం కేంద్ర జల్‌శక్తి శాఖ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement