ఐరాస సదస్సుకు ఏపీ విద్యార్థులు | Andhra Pradesh Govt School students to UN conference | Sakshi
Sakshi News home page

ఐరాస సదస్సుకు ఏపీ విద్యార్థులు

Published Thu, Sep 14 2023 3:24 AM | Last Updated on Thu, Sep 14 2023 7:45 AM

Andhra Pradesh Govt School students to UN conference - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 10 మంది విద్యార్థులు ఐక్యరాజ్య సమితి (ఐరాస) ఈ నెల 16 నుంచి నిర్వహించే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు ఎంపికయ్యారు. 8 మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ఈ బృందం గురువారం హైదరాబాద్‌ నుంచి విమానం ద్వారా అమెరికాలోని న్యూయార్క్‌ నగరానికి బయలుదేరనుంది. ఇందుకోసం బుధవారం రాత్రి విజయవాడ నుంచి ఈ బృందం రోడ్డు మార్గంలో హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లింది. అంతకుముందు విద్యార్థుల బృందంతో విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం కావడం గర్వకారణమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేద, బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతికి చేస్తున్న కృషికి ఇది నిదర్శమని పేర్కొన్నారు. ఉత్తర అమెరికా­లోని రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పర్యటనను విజయవంతం చేసుకో­వాలని అధికారులకు సూచించారు. విద్యార్థి ప్రతి­నిధుల బృందాన్ని పూర్తి ప్రభుత్వ వ్యయంతోనే అమెరికాకు తీసుకెళ్తున్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. వారం రోజుల పర్యటనలో విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామన్నారు. పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. 

ఏపీ విద్యా సంస్కరణలపై ఐరాసలో ప్రదర్శన
రాష్ట్ర విద్యావ్యవస్థలో నాడు–నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన,  వసతి దీవెన, ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ట్యాబ్లెట్‌ల పంపిణీ, డిజిటల్‌ తరగతి గదులు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశాల సంస్కరణలు, సబ్జెక్టు ఉపాధ్యాయుల నియామకంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను ఏపీ విద్యార్థుల బృందం ఐక్యరాజ్య సమితిలో ప్రదర్శించనుంది.

సమగ్ర శిక్ష పీడీ బి.శ్రీనివాసరావు బృందం ప్రతినిధిగా, కేజీబీవీ కార్యదర్శి డి.మధుసూదనరావు నోడల్‌ ఆఫీసర్‌గా, ఉపాధ్యాయులు వి.విజయదుర్గ, కేవీ హేమప్రసాద్‌ మార్గదర్శకులుగా వ్యవహరించనున్నారు. ఐక్యరాజ్య సమితిలోని ఎకనావిుక్, సోషల్‌ కౌన్సిల్‌ స్పెషల్‌ కన్సల్టేటివ్‌ స్టేటస్‌ మెంబర్‌ వున్నవ షకిన్‌కుమార్‌ సమన్వయంతో ఏపీ ప్రతినిధులకు అన్ని ఏర్పాట్లు చేశారు. 2023 పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 103 మంది అభ్యర్థులకు రాత పరీక్షలు నిర్వహించి, అందులో ఎంపికైన 30 మందికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరీక్షించి 10 మందిని ఎంపిక చేశారు. ఇందులో ఒకరు 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఉండటం విశేషం. 

న్యూయార్క్‌ బయలుదేరిన విద్యార్థులు వీరే
1.    మాల శివలింగమ్మ, కేజీబీవీ ఆదోని, కర్నూలు జిల్లా (తండ్రి మాల సోమనాథ్‌ రైతు కూలీ, తల్లి గంగమ్మ)
2.    మోతుకూరి చంద్రలేఖ, కేజీబీవీ ఎటపాక, ఏఎస్‌ఆర్‌ జిల్లా (తండ్రి మోతుకూరి రామారావు ఆటో డ్రైవర్, తల్లి మణి)
3.    గుండుమోగుల గణేష్‌ అంజనాసాయి, ఏపీఆర్‌ఐఎస్, అప్పలరాజుగూడెం, పశ్చిమ గోదావరి జిల్లా (తండ్రి గోపీ, కౌలు రైతు, తల్లి లక్ష్మి) 
4.    దడాల జ్యోత్స్న, సాంఘిక సంక్షేమ పాఠశాల, వెంకటాపురం, కాకినాడ జిల్లా (తండ్రి సింహాచలం సెక్యూరిటీ గార్డు)
5.    సి.రాజేశ్వరి, ఏపీ మోడల్‌ స్కూల్, నంద్యాల (తండ్రి దస్తగిరి లారీ డ్రైవర్, తల్లి రామలక్ష్మి)
6.    పసుపులేటి గాయత్రి, జెడ్పీహెచ్‌ఎస్‌ వట్లూరు, ఏలూరు జిల్లా (తండ్రి రమేష్‌ కూలీ, తల్లి జ్యోతి)
7.    అల్లం రిషితారెడ్డి, మునిసిపల్‌ ఉన్నత పాఠశాల, కస్పా, విజయనగరం జిల్లా (తండ్రి ఎ.రామకృష్ణారెడ్డి మెకానిక్, తల్లి ఉదయలక్ష్మి)
8.    వంజివాకు యోగేశ్వర్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, చంద్రగిరి, తిరుపతి జిల్లా (తండ్రి నాగరాజు కేబుల్‌ ఆపరేటర్, తల్లి విజయ)
9.    షేక్‌ అమ్మాజన్, ఏపీఆర్‌ఎస్, వేంపల్లి, శ్రీ సత్యసాయి జిల్లా (తల్లి షేక్‌ ఫాతిమా, వ్యవసాయ కూలీ)
10. సామల మనస్విని, కేజీబీవీ, జీఎల్‌ పురం, పార్వతీపురం మన్యం జిల్లా(తల్లి కృష్ణవేణి) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement