విత్తన మాఫియా పెత్తనానికి చెక్‌ పెట్టేలా!  | Andhra Pradesh government has prepared an advance seed plan | Sakshi
Sakshi News home page

విత్తన మాఫియా పెత్తనానికి చెక్‌ పెట్టేలా! 

Published Mon, Sep 13 2021 2:48 AM | Last Updated on Mon, Sep 20 2021 11:29 AM

Andhra Pradesh government has prepared an advance seed plan - Sakshi

విత్తన మాఫియా నుంచి రైతుల్ని రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏ ఒక్క రైతు కల్తీ, నకిలీ విత్తనాల బారిన పడకూడదన్న సంకల్పంతో నాణ్యమైన విత్తనోత్పత్తిపై దృష్టి సారించింది. వచ్చే సీజన్‌కు సరిపడా విత్తనాలను ఇప్పటినుంచే తయారు చేసుకోవాలన్న లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేసింది. సీజన్‌ ప్రారంభానికి ముందే సర్టిఫై చేసిన విత్తనాన్ని అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో ఇప్పటికే సీడ్‌ పాలసీని తీసుకొచ్చిన విషయం విదితమే. దీనికి అనుగుణంగా ముందస్తు ప్రణాళికతో విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది.
– సాక్షి, అమరావతి

8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేసేలా.. 
ఆంధ్రప్రదేశ్‌లో ఖరీఫ్‌లో 94 లక్షల ఎకరాలు, రబీలో 59 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుంటాయి. రెండు సీజన్లలో వివిధ పంటలకు సంబంధించి 8.75 లక్షల క్వింటాళ్ల విత్తనం అవసరమని అధికారులు అంచనా వేశారు. ఇందులో 4.06 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 2.50 లక్షల క్వింటాళ్ల శనగ, 2 లక్షల క్వింటాళ్ల వరి, 16,762 క్వింటాళ్ల అపరాలు, 2,500 క్వింటాళ్ల చిరు ధాన్యాల విత్తనాలు అవసరమవుతాయని గుర్తించారు. ఈ దృష్ట్యా 2022–23 సీజన్‌కు సరిపడా విత్తనం కోసం ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ నుంచే కార్యాచరణ సిద్ధం చేశారు. ముఖ్యంగా విశేష ప్రాచుర్యం పొందిన రకాల విత్తనోత్పత్తిపై దృష్టి సారించారు. ప్రస్తుత ఖరీఫ్‌లో కనీసం 38,468 క్వింటాళ్ల వేరుశనగ, 7,820 క్వింటాళ్ల శనగ, 3 వేల క్వింటాళ్ల వరి, 245 క్వింటాళ్ల అపరాలు, 3 క్వింటాళ్ల చిరు ధాన్యాలకు సంబంధించి ఫౌండేషన్‌ సీడ్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.

ఎంపిక చేసిన 4,800 ఎకరాల్లో మొత్తం 49,537 క్వింటాళ్ల ఫౌండేషన్‌ సీడ్‌ను ఉత్పత్తి చేయనున్నారు. ఈ సీడ్‌ ఆధారంగా రానున్న రబీ 2021–22 సీజన్‌లో 1,470 గ్రామాల్లో కనీసం 85,764 ఎకరాల్లో 8,75,213 క్వింటాళ్ల విత్తనోత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. వీటిలో డిమాండ్‌ అధికంగా ఉన్న 4,05,713 క్వింటాళ్ల వేరుశనగ (కే–6, కదిరి, లేపాక్షి, నారాయణి రకాలు), 2 లక్షల క్వింటాళ్ల 20 రకాల వరి విత్తనాలు, 2,50 లక్షల క్వింటాళ్ల శనగలు (జేఎల్‌జీ–11, ఎన్‌బీఈజీ –49)తో పాటు 17 వేల క్వింటాళ్ల అపరాలు (కందులు, మినుములు, పెసలు), 2,500 క్వింటాళ్ల చిరుధాన్యాలు, నువ్వులు ఇతర విత్తనాలు సిద్ధం చేయనున్నారు.

ఇంటిగ్రేటెడ్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ ద్వారా వాటి నాణ్యతను పరీక్షించి.. సర్టిఫై చేసిన విత్తనాలను వచ్చే ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచే ఆర్‌బీకేల్లో రైతులకు అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేశారు. ఇకనుంచి క్రమం తప్పకుండా ఇదే రీతిలో ఫౌండేషన్‌ సీడ్‌ ద్వారా విత్తనోత్పత్తి చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని రైతుల అవసరాలు తీరగా మిగిలిన విత్తనాలను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయిలో రాష్ట్రాన్ని విత్తన హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో ఉన్నట్టు ఏపీ సీడ్స్‌ ఎండీ డాక్టర్‌ గెడ్డం శేఖర్‌బాబు ‘సాక్షి’కి తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement