‘అనంత’ అమాత్యులకు కీలక శాఖలు | - | Sakshi
Sakshi News home page

‘అనంత’ అమాత్యులకు కీలక శాఖలు

Published Sat, Jun 15 2024 1:08 AM | Last Updated on Sat, Jun 15 2024 11:25 AM

-

పయ్యావులకు ఆర్థికం.. సత్యకుమార్‌కు ఆరోగ్య, కుటుంబ సంక్షేమం

సవితకు చేనేత, బీసీ సంక్షేమ శాఖలు

సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి అనంతపురం జిల్లాకు కీలక శాఖలు దక్కాయి. మొత్తం ముగ్గురికి మంత్రి పదవులు కేటాయించగా.. అందులో ఇద్దరికి ప్రధాన మైన శాఖలు వచ్చాయి. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఉరవకొండ నుంచి గెలుపొందిన పయ్యావుల కేశవ్‌కు ఆర్థిక శాఖ ఇచ్చారు. 

ధర్మవరం నుంచి బీజేపీ తరఫున పోటీచేసి గెలుపొందిన సత్యకుమార్‌కు ప్రాధాన్యత కలిగిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ కేటాయించారు. ఇక పెనుకొండ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన సవితకు బీసీ సంక్షేమ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమ, చేనేత, జౌళిశాఖల బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న ముగ్గురూ మంత్రి పదవులకు కొత్త కావడం విశేషం. ఐదు దఫాలు ఎమ్మెల్యేగా గొలుపొందిన పయ్యావుల కేశవ్‌ ఎప్పటినుంచో మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన కల నేటికి ఫలించినట్టయింది.

మళ్లీ బీజేపీకే దక్కిన ఆరోగ్యశాఖ
ఆరోగ్యశాఖ మళ్లీ బీజేపీకే దక్కింది. 2014–19 మధ్య కాలంలో కై కలూరు నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన కామినేని శ్రీనివాస్‌కు ఈ శాఖ కేటాయించారు. తిరిగి ఈ దఫా ధర్మవరం నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన సత్యకుమార్‌కు ఇచ్చారు. ప్రస్తుతం కేటాయించిన శాఖలన్నీ కీలకమైనవేనని నిపుణులు చెబుతున్నారు.

 ఉమ్మడి అనంతపురం జిల్లాలో బీసీ సామాజిక వర్గం వారు ఎక్కువగా ఉండటంతో బీసీ సంక్షేమశాఖను పెనుకొండ శాసనసభ్యురాలు సవితకు ఇచ్చారు. శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరికి, అనంతపురం జిల్లాకు చెందిన ఒకరికి మంత్రి పదవులు దక్కాయి. ఇదిలా ఉండగా ఆరోగ్యశాఖ దక్కించుకున్న సత్యకుమార్‌ జిల్లాలోనే పెను కొండ వైద్యకళాశాల నిర్మాణం జరుగుతోంది. వీలైనంత త్వరగా మెడికల్‌ కాలేజీ నిర్మాణం పూర్తి చేస్తారన్న ఆశతో జిల్లా వాసులు ఉన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement