కోర్‌ మీటింగ్‌లో ‘సోయం’ వ్యాఖ్యల దుమారం! | - | Sakshi
Sakshi News home page

కోర్‌ మీటింగ్‌లో ‘సోయం’ వ్యాఖ్యల దుమారం!

Published Thu, Jan 25 2024 12:42 AM | Last Updated on Thu, Jan 25 2024 4:54 PM

- - Sakshi

సాక్షి,ఆదిలాబాద్‌: బీజేపీలో రచ్చ మొదలైంది.. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆదిలాబాద్‌ అభ్యర్థి ఎవరనే విషయంలోనే ముఖ్య నేతల మధ్య విభేదాలు పొడసూపుతున్నాయి. మొన్నటివరకు సిట్టింగ్‌ ఎంపీకే టిక్కె ట్‌ అనే ప్రచారం జరిగింది. దానిపై ప్రస్తుతం పార్టీ లో ఏకాభిప్రాయం వ్యక్తం కావడం లేదన్న ప్రచారం జరుగుతోంది. మంగళవారం జరిగిన కోర్‌ కమిటీ సమావేశంలో అటు ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలు దుమారం లేపుతుండగా ఇటు ఎమ్మెల్యేలు అభ్యర్థి విషయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అన్నట్టుగా మాట్లాడటం విభేదాలను స్పష్టం చేస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏప్రిల్‌లో పార్లమెంట్‌ ఎన్నికలు
పార్లమెంట్‌ ఎన్నికలు ఏప్రిల్‌లో జరగవచ్చనే సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో బీజేపీ సిట్టింగ్‌ ఎంపీలు తిరిగి పోటీ చేస్తారని కొద్దిరోజుల కిందట పార్టీలో చర్చ జరిగింది. తాజాగా ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఇటు పార్టీలో ఉన్న ఎస్టీ ముఖ్య నేతలు, పార్టీతో సంబంధం లేని ఇతరులు కూడా బీజేపీ నుంచి టిక్కెట్‌ ఆశిస్తూ ఆయా ఎమ్మెల్యేల ఫొటోలతో అన్నిచోట్ల ఫ్లెక్సీలు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధానంగా నేతల ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుందనే ప్రచారం ఉంది. ఎన్నికలు సమీపిస్తుండగా పార్టీలో ఏకాభిప్రాయం లేదన్నది స్పష్టమవుతోంది. అయితే ఆయా ఎమ్మెల్యేలు వేర్వేరు అభ్యర్థులను ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతోంది. దీంతో ఎంపీ వర్సెస్‌ ఎమ్మెల్యేలుగానే దీన్ని పరిగణించాలా? ఎమ్మెల్యేల మధ్య కూడా అభ్యర్థి ఎంపిక విషయంలో ఏకాభిప్రాయం ఉందా? అనే సందేహాలు పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నాయి. ఆదిలా బాద్‌ పార్లమెంట్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ అభ్యర్థి ఎంపిక విషయంలో అందరి మధ్య ఏకాభిప్రాయం సా ధించగలుగుతారా? అనేది వేచిచూడాల్సిందే.

వ్యాఖ్యల దుమారం..
బీజేపీ కోర్‌ కమిటీ సమావేశం మంగళవారం ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జరిగింది. ఈ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో పాటు రాష్ట్ర నేతలూ పాల్గొన్నారు. ఎంపీ సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, పాయల్‌ శంకర్‌, రామారావు పటేల్‌, మాజీ ఎంపీ రాథోడ్‌ రమేశ్‌, మాజీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఎంపీ సోయం మాట్లాడుతూ తాను బాగా పనిచేశానని పార్టీ భావిస్తే టిక్కెట్‌ ఇస్తుందని.. అలా కాదనుకుంటే ఇవ్వదని వ్యాఖ్యానించారు. ఈ పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసేందుకు డిమాండ్‌ పెరిగిందన్నారు.

అయితే కొత్తగా కొందరు పోస్టర్లు వేసి, డిన్నర్లు ఇస్తున్నారని, అలాంటి వారిని పార్టీ గుర్తించదని, ఇతర పార్టీలో ఇది సాధ్యమని అనడం ప్రాధాన్యత సంతరించుకుంది. తాను ఎంపీగా ఉన్నందునే పార్లమెంట్‌ పరిధిలో నాలుగు స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు గెలిచారని, మిగిలిన చోట్ల గట్టి పోటీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం లేపుతున్నాయి. మరోవైపు ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి, పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. ఎంపీ అభ్యర్థి ఎవరనేది మా చేతిలో లేదనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అభ్యర్థి ఎవరైనా పెద్ద ఎత్తున మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇలా ఎంపీ, ఎమ్మెల్యేల వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో చర్చనీయంగా మారాయి. మొత్తంగా ఎన్నికలకు ముందు పార్టీలో ముఖ్య నేతల మధ్య విభేదాలను స్పష్టం చేస్తున్నాయి.

ఇవి చదవండి: రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement