అట్టుడికిన నిలోఫర్‌ | Patient Relatives Attack on Niloufer hospital Doctors | Sakshi
Sakshi News home page

అట్టుడికిన నిలోఫర్‌

Published Sun, Feb 17 2019 9:23 AM | Last Updated on Sun, Feb 17 2019 9:23 AM

Patient Relatives Attack on Niloufer hospital Doctors - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్ఠాత్మక నిలోఫర్‌ ప్రభుత్వ ఆస్పత్రి దాడులు, ఆందోళనలతో అట్టుడికింది. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ శిశువు శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. ఆగ్రహించిన శిశువు తరఫు బంధువులు విధి నిర్వహణలో ఉన్న ఓ జూనియర్‌ వైద్యుడిపై దాడి చేయగా అతడు సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో అతడిని చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన జూనియర్‌ డాక్టర్లు శనివారం మెరుపు సమ్మెకు దిగి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. బయటి వ్యక్తులు ఆస్పత్రిలోకి వచ్చి వైద్యులపై దాడి చేస్తుంటే సెక్యురిటీ సిబ్బంది పేక్షకపాత్ర వహించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్పందిస్తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 10 మంది ప్రైవేటు సెక్యురిటీపై వేటువేసి దాడి ఘటనపై నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మరో వైపు తమకు మూడు నెలలుగా వేతనాలు, ఏడాది నుంచి పీఎఫ్‌ చెల్లించడం లేదని ఆరోపిస్తూ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు అదే సమయంలో ఆందోళనకు దిగారు. ఒకవైపు జూనియర్‌ డాక్టర్లు, మరోవైపు కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు విధులు బహిష్కరించి ఆందోళనకు దిగడంతో వైద్యసేవలు స్తంభించిపోయాయి.

దాడికి కారణం ఇదీ..
కార్వాన్‌కు చెందిన అస్రా ఫాతిమా(10 నెలలు) తరచూ జ్వరం, ఫిట్స్‌తో బాధపడుతోంది. చికిత్స కోసం ఆమె తల్లిదండ్రులు ఈ నెల 7వ తేదీన నిలోఫర్‌ నవజాత శిశువుల ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. వైద్యులు శిశువును ఈఎస్‌ఆర్‌ యూనిట్‌–3లో అడ్మిట్‌ చేసుకుని చికిత్స అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై తల్లిదండ్రులకు వివరిస్తూనే ఉన్నారు. శిశువుకు పాలు పట్టించవద్దని వైద్యులు సూచించినప్పటికీ.. తల్లిదండ్రులు వినకుండా శుక్రవారం పాలు పట్టించారు. అయితే, ఆ పాలు ఊపిరితిత్తుల్లోకి వెళ్లి ఆరోగ్య పరిస్థితి విషమించింది. దీంతో శిశువును కాపాడేందుకు వైద్యులు విశ్వప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది.. శిశువు మృతి చెందింది. దీనిపై శిశువు తల్లిదండ్రులు, బంధులు ఆగ్రహంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిదని ఆరోపిస్తూ శుక్రవారం అర్ధరాత్రి ఆస్పత్రిలో హల్‌చల్‌ చేశారు. విధి నిర్వహణలో ఉన్న జూనియర్‌ డాక్టర్‌ రాహుల్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. దీంతో వైద్యుడు అక్కడిక్కడే స్పృహ తప్పి పడిపోయాడు. ఇది గమనించిన డాక్టర్‌ రాహుల్‌ అతడిని చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ఘటన జరిగిన సమయంలో విధి నిర్వహణలో ఉన్న సెక్యురిటీ గార్డులు దాడిని ఆపే ప్రయత్నం చేయలేదు.

ఆందోళనకు దిగిన జూ.డాలు
నిలోఫర్‌ ఆస్పత్రిలో సెక్యురిటీ లోపం వల్లే వైద్యులపై దాడి జరిగిందని జూనియర్‌ డాక్టర్లంతా శనివారం ఉదయం విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ సూపరింటెండెంట్‌ కార్యాలయం ముందు బైఠాయించారు. దీంతో ఆస్పత్రిలో వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఇన్‌పేషెంట్, అవుట్‌ పేషెంట్‌ విభాగాల్లో సేవలుకు తీవ్ర విఘాతం కలిగింది. వైద్యులకు రక్షణ కల్పించడంలో ఆస్పత్రి సెక్యురిటీ పూర్తిగా విఫలమైందని సూపరింటెండెంట్‌కు ఫిర్యాదు చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉంటున్న సెక్యురిటీ సిబ్బందిపై చర్య తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీంతో సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ పది మంది ప్రైవేట్‌ సెక్యురిటీ సిబ్బందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా దాడి ఘటనపై పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇవ్వడంతో జూనియర్‌ వైద్యులు శాంతించారు. ఇదే సమయంలో తమకు మూడు నెలుగా వేతనాలు చెల్లించడం లేదని ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. దీంతో ఆస్పత్రిలో గందరగోళం నెలకొంది. ఆస్పత్రిలో రోజంతా ఏం జరుగుతుందో అర్థంగాని పరిస్థితి తలెత్తింది. సూపరింటెండెంట్‌ సూచనల మేరకు తక్షణమే రెండు నెలల వేతనాలు చెల్లించనున్నట్లు ఔట్‌ సోర్సింగ్‌ కాంట్రాక్టర్‌ ప్రకటించడంతో వారు ఆందోళనను విరమించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement