వన్‌ పోలీస్‌.. వన్‌ వాట్సాప్‌! | One Number For Complaints To Police In Telangana | Sakshi
Sakshi News home page

వన్‌ పోలీస్‌.. వన్‌ వాట్సాప్‌!

Published Fri, Feb 14 2020 3:51 AM | Last Updated on Fri, Feb 14 2020 3:51 AM

One Number For Complaints To Police In Telangana - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ పోలీసు– 9490616555, సైబరాబాద్‌ కాప్స్‌– 9490617444, రాచకొండ కమిషనరేట్‌– 9490617111.. రాజధాని భౌగోళికంగా కలిసే ఉన్నా.. పరిధుల పరంగా మూడు కమిషనరేట్లు ఉండటంతో వేర్వేరు వాట్సాప్‌ నంబర్లు ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక అంశాలు తెలియని కొందరు బాధితులు ఫిర్యాదుచేసే విషయంలో ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తొమ్మిది కమిషనరేట్లు, 19 పోలీసు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. దీన్ని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర పోలీసు విభాగం ఒకే వాట్సాప్‌ నంబర్‌ అమల్లోకి తేవాలని నిర్ణయించింది. డీజీపీ కార్యాలయం కేంద్రంగా దీన్ని నిర్వహిస్తారు.

ఫిర్యాదుల మానిటరింగ్‌కు పదిమంది
ఏదైనా సమస్య ఎదుర్కొంటున్న, నేరాల బారినపడిన వారు పోలీసులకు సమాచారమివ్వడానికి పలు వేదికలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఏకరూప ‘డయల్‌–100’ వ్యవస్థ అందుబాటులో ఉంది. అయితే ఫోన్‌కాల్‌ ద్వారా మాత్రమే దీనికి ఫిర్యాదు చేసే ఆస్కారం ఉంది. వాయిస్‌ రికార్డులు, వీడియోలు, ఫొటోలు వంటివి పంపించడానికి పోలీసు విభాగాలు ట్విట్టర్‌ వంటివి అందుబాటులోకి తెచ్చినా.. వాట్సాప్‌ మాదిరిగా ప్రతి ఒక్కరూ ఈ సామాజిక మాధ్యమాన్ని వినియోగించుకోలేరు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జిల్లా ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు ఎవరికి వారుగా వాట్సాప్‌ నంబర్లు ఇచ్చారు. వీరంతా తమకందే ఫిర్యాదుల్ని మానిటర్‌ చేయడానికి ఎక్కడికక్కడ ప్రత్యేకంగా సోషల్‌మీడియా సెల్స్‌ను ఏర్పాటు చేసుకున్నారు. మూడు షిఫ్టుల్లో పనిచేయడానికి కనీసం పదిమందిని కేటాయిస్తున్నారు. సిబ్బంది కొరత, బందోబస్తు సందర్భాల్లో ఈ సోషల్‌మీడియా వింగ్‌ సిబ్బందినీ అక్కడకు మోహరిస్తున్నారు. అలాకాక, రాష్ట్ర పోలీసు విభాగానికి ఒకే వాట్సాప్‌ నంబర్‌ అందుబాటులోకి తెస్తే డీజీపీ కార్యాలయం కేంద్రంగా పదిమందిని నియమిస్తే సరిపోతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. వీళ్లే రాష్ట్రవ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల్ని సమీక్షిస్తూ సంబంధిత విభాగాలకు పంపిస్తారు. నేరుగా ఆయా పోలీసుస్టేషన్లకే ఈ ఫిర్యాదుల్ని పంపే వీలు కలగనుంది.

ఒకే నంబర్‌తో ఎంతో సౌలభ్యం
ప్రస్తుతం జిల్లాలు, కమిషనరేట్ల ఆధీనంలోనే వాట్సాప్‌ నంబర్లు ఉండటంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడానికి ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. తాము ఫిర్యాదుచేస్తే ఆ సమాచారం తక్షణం సదరు అధికారికి తెలిసిపోతుందని, తమ నంబర్లు సైతం వారికి అందుతాయనే భావనతో పలువురు ఫిర్యాదులకు వెనకడుగు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే నంబర్‌.. అదీ డీజీపీ కార్యాలయం కేంద్రంగా అందుబాటులోకి వస్తే ఎటువంటి ఫిర్యాదులనైనా ప్రజలు ధైర్యంగా చేయగలుగుతారని అధికారులు అంటున్నారు. సాధారణ వాట్సాప్‌ కంటే ‘వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌’లో అదనపు హంగులున్నాయి. సాధారణ వాట్సాప్‌లో ప్రత్యేక సెట్టింగ్స్‌ లేనప్పడు ఒకరు పంపిన సందేశానికి వచ్చే బ్లూ టిక్స్‌ ఆధారంగా ఎదుటివారు చూశారా? లేదా? అనేది తెలుసుకోవచ్చు. అదే ‘వాట్సాప్‌ బిజినెస్‌ అకౌంట్‌’లో కొన్ని సందేశాలను ఫిర్యాదు అందిన  వెంటనే ఆటోమేటిక్‌గా, దానికి జవాబుగా పంపే ఆస్కారం ఉంది. ఈ సదుపాయంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకే పోలీసు నంబర్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి డీజీపీ కార్యాలయం కసరత్తు చేస్తోంది. నెలలో దీన్ని అమల్లోకి తెచ్చి విస్త్రత ప్రచారం కల్పించనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement