కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారు! | Komatireddy Venkata Reddy may Join BJP | Sakshi
Sakshi News home page

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీజేపీలో చేరతారు!

Published Sat, Jul 20 2019 2:30 AM | Last Updated on Sat, Jul 20 2019 7:57 AM

Komatireddy Venkata Reddy may Join BJP - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్‌గా నిలిచిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. సరికొత్త విషయాలు వెల్లడించి రాజకీయంగా కాక పుట్టించారు. తన సోదరుడు, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా త్వరలో బీజేపీలో చేరనున్నారనే సంచలన విషయం వెల్లడించారు. అయితే, తన తుదిశ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని వెంకట్‌రెడ్డి ఇదివరకే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తాను బీజేపీలో చేరినా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేయబో నని స్పష్టం చేశారు.

కోమటిరెడ్డి బ్రదర్స్‌ బీజేపీలోకి వెళుతున్నారంటే టీఆర్‌ఎస్‌కు భయం పట్టుకుందని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయమని పదేపదే చెబుతున్న రాజగోపాల్‌రెడ్డి మరోసారి దానిని పునరుద్ఘాటించారు. తనలాంటి వాడు చేరితే బీజేపీ మరింత బలపడుతుందని, ఆ పార్టీలో ఎలాంటి పదవి ఆశించడంలేదని ఆయన పేర్కొన్నారు. టైటానిక్‌లో తనలాంటి హీరో ఉన్నా మునకే కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోయే నావ అని, టైటానిక్‌లో తనలాంటి హీరో ఉన్నా మునగక తప్పదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గడువు ముగిసిన ఔషధం మాదిరిగా ఉందని వ్యాఖ్యానించారు. బీజేపీలోకి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను తీసువెళ్లేందుకు ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదన్నారు.

కాంగ్రెస్‌ అధినేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ అంటే తనకు గౌరవమని, రాష్ట్రంలో నాయకత్వలోపం వల్లే కాంగ్రెస్‌కి ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చిరుమర్తికి నెలకు రూ.50 వేల జీతమిచ్చా... తమకు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ద్రోహం చేశారని, కష్టాల్లో ఉంటే నెలకు రూ.50 వేలు జీతమిచ్చి బతికిచ్చానని, ఆయనను ఎమ్మెల్యే చేసింది కూడా తానేనని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. మీ గొంతు మీరు కోసుకున్నట్టే: సోలిపేట అసెంబ్లీ ఆవరణలో రాజగోపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామచంద్రారెడ్డి మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. ‘బీజేపీలో చేరితో మీ గొంతు కోసుకున్నట్టే’అని రాజగోపాల్‌ను ఉద్దేశించి సోలిపేట వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌ ఇప్పటికే ఓవర్‌లోడై ఉందని, తమది కూడా ఓవర్‌ వెయిటని, దాంతో మునుగుతారని రాజగోపాల్‌ బదులిచ్చారు. పార్టీ మారిన ‘చిరుమర్తిని తప్పుపడుతున్నారు, మరి బీజేపీలోకి మీరెలా వెళతారు’అని సోలిపేట ప్రశ్నించగా ఆయనను ఎమ్మెల్యే చేసింది కూడా తానేనని రాజగోపాల్‌రెడ్డి సమాధానమిచ్చారు.

తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే: కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్‌: తాను కాంగ్రెస్‌ పార్టీని వదిలి వెళ్లేదిలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాను బీజేపీలో చేరిన తర్వాత తన సోదరుడు వెంకటరెడ్డి కూడా బీజేపీలోకి వస్తారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో స్పందించారు. తన తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని, మరో జన్మ ఉంటే అప్పుడూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement