పెలికాన్‌ @ తెలినీల్లాపురం | Jayalakshmi Shared The Center Of Migratory Birds Specialties | Sakshi
Sakshi News home page

పెలికాన్‌ @ తెలినీల్లాపురం

Published Wed, Mar 18 2020 11:33 AM | Last Updated on Fri, Mar 20 2020 7:07 AM

Jayalakshmi Shared The Center Of Migratory Birds Specialties - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కొన్ని పక్షులు ప్రపంచమంతా ప్రయాణం చేస్తాయి. కొందరు పక్షి ప్రేమికులు పక్షుల కోసం ప్రపంచం అంతా ప్రయాణాలు చేస్తారు. టూర్లందు బర్డ్‌ వాచింగ్‌ టూర్లు వేరయా.. అన్నట్టుగా వీరి అనుభవాలు ఉంటాయి. నగరానికి చెందిన జయలక్ష్మి.. తాను చేసిన ఓ టూర్‌ గురించి చెప్పిన విశేషాలు వింటే.. పక్షుల కిలకిలరావాలు మదిలో ప్రతిధ్వనిస్తాయి. తాను వెళ్లిన వలస పక్షుల కేంద్రం గురించి జయలక్ష్మి పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..

సైబీరియా నుంచి వచ్చే చుట్టాలు..
ఏటా మన దగ్గరకు వచ్చి పిల్లలకు రెక్కలు వచ్చాక తీసుకు వెళ్లిపోతాయి. పుట్టింటికి ఆడపిల్ల వచ్చినట్లు, పుట్టింటి వాళ్లను సంతోషపెట్టినట్లు ఊరంతటినీ అలరిస్తాయి పెలికాన్‌(గూడబాతు), పెయింటెడ్‌ స్టార్క్‌(ఎర్ర జడ పిట్ట). ఈ వలస పక్షులు సైబీరియా నుంచి తెలుగు రాష్ట్రానికి వస్తాయి. ఆ రావడం ఊరికే రావు. ఏరియల్‌ సర్వే చేస్తాయి. నీటి చెరువులు, దట్టమైన చెట్లు ఉన్న ప్రదేశాన్ని ఎంచుకుని మరీ విడిదికి సిద్ధమవుతాయి. అలా పదిహేనేళ్ల నుంచి శ్రీకాకుళంలోని తేలినీలాపురాన్ని కొత్త విడిదిగా మార్చుకున్నాయి వలస పక్షులు. 

తేలి నీలాపురం శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరాన ఉంది. వైజాగ్‌– కోల్‌కతా రైల్వే లైన్‌లో నైపడ స్టేషన్‌ నుంచి ఐదు కిలోమీటర్ల దూరం. పెద్దగా ప్రచారానికి నోచుకుని ఈ అందమైన ప్రదేశం.. పక్షి ప్రేమికుల పాలిట స్వర్గధామం అనే చెప్పాలి. టెక్కలి పట్టణంలో బస చేసి తెల్లవారు జామునే బయలుదేరి తేలినీలాపురం బర్డ్‌ సాంక్చురీకి బయలు దేరితే గూడు వదిలి ఆహారానికి బయలుదేరే పక్షులు కనువిందు చేస్తాయి. ఆకాశంలో రెక్కలు విచ్చుకున్న పక్షుల తోరణాలను చూడాల్సిందే తప్ప వర్ణించలేం. 

ఆరు నెలల ఆవాసం.. చేపలే ఆహారం..
ఈ పక్షుల రాక ఏటా సెప్టెంబర్‌ నెలలో మొదలవుతుంది. అక్టోబర్‌ ఆఖరుకి పూర్తిగా వచ్చేస్తాయి. చెట్ల కొమ్మల మీద దట్టమైన గూళ్లు కట్టుకుని ఆరు నెలల ఆవాసానికి సిద్ధమైపోతాయి. గుడ్లు పెట్టి, పొదిగి, మార్చి నాటికి తిరుగు ప్రయాణమవుతాయి. ఏప్రిల్‌ ఆఖరుకి అన్ని పక్షులూ వెళ్లిపోతాయి. ‘ఈ పక్షులు ఇక్కడికే ఎందుకు వస్తున్నాయి’ అని ఓ స్థానికుడిని అడిగినప్పుడు అతడు చెప్పిన విషయాలు చాలా ఆశ్చర్యం కలిగించాయి. వాతావరణంతోపాటు ఆహారం సమృద్ధిగా ఉన్న చోటుకే తొలి ప్రాధాన్యం. మంచి చేపలు దొరికే ప్రదేశాన్ని ఎంపిక చేసుకుంటాయి. ఇవి ఇతర పక్షుల్లా గింజలను తినవు. పెద్ద పక్షులు ఒక్కోటి రోజుకు నాలుగు నుంచి ఆరు కిలోల చేపలను తింటాయి. తేలినీలాపురానికి చుట్టు పక్కల రెండున్న కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎనిమిది చెరువులు ఉన్నాయి. ఇక ఇక్కడ చింతచెట్లు ఎక్కువ. దాంతో పెద్ద గూళ్లు కట్టుకోవడానికి అనువుగా ఉంటాయి. అందుకే ఈ పక్షులు ఈ గ్రామానికి వస్తున్నాయని చెప్పాడు. 

ఎంపిక ఆడపక్షిదే
ఏ పక్షితో జతకట్టాలనే నిర్ణయం ఆడపక్షిదే. ఒకసారి జత కట్టి గూడులో నివసించడం మొదలైన తర్వాత గుడ్లు పెట్టి, పొదిగి, పిల్లలను పోషించే వరకు ఆ పక్షుల సహచర్యం కొనసాగుతుంది. ఒక సీజన్‌కి అవి నాలుగు గుడ్ల వరకు పెడతాయి. అయితే వాటిలో పొదిగి పిల్లలయ్యేది సగం గుడ్లే. ఈ గుడ్లు పొదగడానికి పాతిక నుంచి ముప్‌పై రోజులు పడుతుంది. పెలికాన్‌లు గుడ్లను పొదగడంలో మగ–ఆడ పక్షులు రెండూ భాగం పంచుకుంటాయి. ఒక పక్షి గుడ్ల మీద ఉంటే మరో పక్షి ఆహారం తెస్తుంది. ఇవి ఆహారం కోసం ఉదయం ఏడు గంటలకే బయలుదేరి పది గంటలకు తిరిగి గూటికి చేరతాయి. మరో విడత మూడు గంటలకు వెళ్లి ఐదు గంటలకు గూళ్లను చేరతాయి. సూర్యుడి కిరణాలు నిట్టనిలువుగా పడుతున్నప్పుడు చూపు చెదురుతుంది. నీటిలో కదలాడే చేపల ఆనవాళ్లు దొరకడం కష్టం. అందుకే ఇలా టైమింగ్స్‌ సెట్‌ చేసుకున్నాయవి. 

వాచ్‌ టవర్‌
తేలినీలాపురం చిన్న గ్రామం. వలస పక్షుల సీజన్‌లో ఇళ్లకంటే పక్షుల గూళ్లే ఎక్కువగా కనిపిస్తాయి. నాలుగు వందలకు పైగా గూళ్లు ఉంటాయి. ఏడాదికి 500లకు పైగా పిల్ల పక్షులు ఇక్కడ పుట్టి సైబీరియాకు ప్రయాణమవుతాయని అంచనా. ఇక్కడ ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కట్టిన 40 అడుగుల వాచ్‌ టవర్‌ ఉంది. ఈ టవర్‌ మీద నుంచి చూస్తే మన చుట్టూ పక్షులే. వాటి కువకువలు రకరకాలుగా ఉంటాయి. అవి చేసే శబ్దాల్లో తేడాలుంటాయి. పక్షుల కలయిక సందర్భంలో ఒక రకంగా, గుడ్లను పొదిగేటప్పుడు ఒక రకమైన శబ్దం, పిల్లలకు ఆహారం పెట్టేటప్పుడు మరో రకమైన శబ్దం చేస్తాయి. అవి వెళ్లిపోతుంటే తమ పిల్లలు వదిలిపోతున్నట్లు బాధగా ఉంటుందని చెప్పారు గ్రామస్తులు.

ముక్కు పొడవు
పెలికాన్, పెయింటెడ్‌ స్టార్క్‌ పక్షులకు ముక్కు పొడవుగా ఉంటుంది. నీటి మీద ఎగురుతూ నీటి లోపలున్న చేపల జాడ పడతాయి. ఒక్కసారిగా నీటిలోకి దూరి ఈదుతూ వెళ్లి ముక్కుతో చేపలను పట్టుకొస్తాయి. చేపలతోపాటుగా వచ్చిన నీటిని వదిలేసి చేపలను మాత్రం గొంతుకు ఉన్న సంచిలో వేసుకుంటాయి. ఆ చేపలు గూటిలో ఉన్న పిల్లల కోసం. అలా పిల్ల పక్షులను 45 రోజులు పోషిస్తాయి. పెలికాన్‌ కానీ పెయింటెడ్‌ స్టార్క్‌ కానీ పేరుకు పక్షులే కానీ ఎంత బలంగా ఉంటాయంటే.. గుడ్ల మీద దాడి చేసిన ఒక మోస్తరు జంతువులను కూడా ముక్కుతో పొడిచి, కాళ్లతో తన్ని తరిమేస్తాయి. ఈ పక్షులు తొమ్మిది కిలోల బరువుంటాయి. రెక్కలు చాచాయంటే... ఆ చాచిన రెక్కల పొడవు రెండు నుంచి మూడున్నర మీటర్లు ఉంటుంది. పెద్ద పక్షులకు నీటిపాము దొరికిందంటే చాలు.. మనం కళ్లు మూసి తెరిచేలోపు ఒక్క గుటకలో మింగేస్తాయి. వీటి జీవితకాలం పదిహేను నుంచి పాతికేళ్లు. 

త్రేతాయుగపు శివలింగం
తేలినీలాపురం టూర్‌లో భాగంగా ‘రావి వలస’ను కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ ఉన్న శివలింగం ఇరవై రెండు అడుగుల ఎత్తు ఉంటుంది. ఇక్కడ స్వామి స్వయంభువుగా వెలిశాడని చెబుతారు. ఆ శివుడికి
గుడి కట్టాలని టెక్కలి రాజు ముందుకొచ్చాడని, అప్పుడు శివుడు తనను గుడిలో బంధించవద్దని, తనను తాకిన గాలి గ్రామమంతటా వ్యాపించాలని చెప్పాడంటారు. ఇప్పుడు కూడా అక్కడ గుడి లేదు. కానీ
శివలింగంపై భాగాన్ని చూడడానికి వీలుగు మెట్ల నిర్మాణం ఉంది. పై నుంచి పూజాదిక్రతువులు నిర్వహించుకోవచ్చు. రాముడు ఇక్కడ పర్యటించాడని, ఇక్కడి ఔషధ వృక్షాల గురించి అధ్యయనం చేయడానికి
రాముడి ఆస్థాన వైద్యుడు ఇక్కడే ఉండిపోయాడని కూడా చెబుతారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement