పెట్రో, డీజిల్‌.. డబుల్‌! | Diesel And Petrol Selling Is Increased In Hyderabad | Sakshi
Sakshi News home page

పెట్రో, డీజిల్‌.. డబుల్‌!

Published Fri, Oct 11 2019 2:09 AM | Last Updated on Fri, Oct 11 2019 8:21 AM

Diesel And Petrol Selling Is Increased In Hyderabad - Sakshi

నగరవాసులు పెట్రోల్, డీజిల్‌ను భారీగా వాడేస్తున్నారు. రోజుకు ఏకంగా 50 లక్షల లీటర్ల పెట్రోల్, 55 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరుగుతున్నాయి. 2014లో రోజుకు 20 లక్షల లీటర్ల పెట్రోల్, 30 లక్షల లీటర్ల డీజిల్‌ అమ్మకాలు జరిగేవి. పెరుగుతున్న జనాభా, ప్రజా రవాణా మెరుగు పడకపోవడం కారణం.

సాక్షి, హైదరాబాద్‌ : విశ్వ నగరం వైపు పరుగుతీస్తున్న హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్‌ వినియోగం ఐదేళ్లలో రెండింతలైంది. పెరుగుతున్న జనవాహినికి తోడు ప్రజా రవాణా ఆశించినంత స్థాయిలో మెరుగు పడ లేదు. మెట్రో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్, మెట్రో రైలు సౌకర్యం అందుబాటులో వచ్చినప్పటికీ వ్యక్తిగత వాహనాలు దూకుడు పెంచాయి. బ్యాంకులతో పాటు ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థలు విరివిగా రుణాలు ఇస్తుండటంతో నగరవాసుల సొంత వాహనాల సంఖ్య అర కోటికిపైగా దాటింది. ఇవి కాలుష్యం వెదజల్లుతుండటంతో పర్యావరణ వేత్తలు ఆందో ళన వ్యక్తం చేస్తున్నారు.

రెట్టింపైన అమ్మకాలు ... 
హైదరాబాద్‌ మహా నగరంలో ఐదేళ్లలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలు రెట్టింపయ్యాయి. 2014లో హైదరాబాద్‌ నగరంలో దినసరి అమ్మకాలు పరిశీలిస్తే పెట్రోలు సగటున 20 నుంచి 25 లక్షల లీటర్లు, డీజిల్‌ 30 నుంచి 33 లక్షల లీటర్లు ఉండగా, 2019 నాటికి పెట్రోల్‌ 42 నుంచి 50 లక్షల లీటర్లు, డీజిల్‌ 50 నుంచి 55 లక్షల లీటర్లకు చేరాయి. పెరుగుతున్న పెట్రోల్‌ ఉత్పత్తుల వినియోగానికి తోడు బంకుల సంఖ్య కూడా పెరిగింది ఐదేళ్ల క్రితం 447 ఉన్న పెట్రోల్‌ బంకుల సంఖ్య 650కు పైగా చేరగా, వాహనాల సంఖ్య 39 లక్షల నుంచి 61 లక్షలకు ఎగబాగింది.

హైదరాబాద్‌ వాటా 60% పైనే.. 
రాష్ట్రంలోనే పెట్రో ఉత్పత్తుల వినియోగంలో హైదరాబాద్‌ మహానగర వాటా 60% పైనే ఉంటుంది. ఐదేళ్ల క్రితం తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద నెలసరి పెట్రోల్‌ వినియోగం సగటున 92,473 కిలో లీటర్లు ఉండగా హైదరాబాద్‌ నగర వాటా 50,317 కిలో లీటర్లు. డీజిల్‌ వినియోగం రాష్ట్రం మొత్తం మీద 1,98,550 కిలో లీటర్లు ఉండగా అందులో హైదరాబాద్‌ నగర వాటా 79,371 కిలో లీటర్లు ఉండేది. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోలు వినియోగం 1,32,219 కిలో లీటర్లు కాగా, నగర వాటా 95,512 కిలో లీటర్లు. అదేవిధంగా డీజిల్‌ వినియోగం 2,84,429 కిలో లీటర్లు ఉండగా అందులో నగర వాటా 1,14,461 కిలో లీటర్లు.  

ప్రతినిత్యం 200 ట్యాంకర్లపైనే
నగర పరిధిలో మూడు ప్రధాన ఆయిల్‌ కంపెనీల టెర్మినల్స్‌ నుంచి బంకుల డిమాండ్‌ను బట్టి ప్రతిరోజు 150 నుంచి 200 ట్యాంకర్ల ద్వారా ఇంధనం సరఫరా అవుతుంటోంది. ఒక్కొక్క ట్యాంకర్‌ సగటున 12 వేల లీటర్ల నుంచి 20 వేల లీటర్ల వరకు సామర్థ్యం కలిగి ఉం టాయి. నగరంలో వివిధ రకాల వాహనాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి నగరానికి రాకపోకలు సాగించే సుమారు లక్ష వరకు వాహనాలు ప్రతినిత్యం పెట్రోల్, డీజిల్‌ను వినియోగిస్తుంటాయి.

పెట్రోల్‌లో 9వ స్థానం.. డీజిల్‌లో 10వ స్థానం
దేశంలోనే పెట్రోల్‌ వినియోగంలో తెలంగాణ తొమ్మిదవ స్థానంలో ఉండగా, డీజిల్‌ వినియోగంలో 10వ స్థానంలో ఉన్నట్లు ఆయిల్‌ కంపెనీల నివేదికలు చెప్తున్నాయి. పెట్రోల్‌లో మహారాష్ట్ర, డీజిల్‌లో ఉత్తర్‌ప్రదేశ్‌లు మొదటి స్థానంలో ఉన్నట్లు తేలింది.

అగ్రభాగంలో ద్విచక్రవాహనాలు.. 
పెట్రోల్‌ వినియోగంలో ద్విచక్ర వాహనాలు అగ్రభాగంలో ఉన్నాయి. మొత్తం వినియో గంలో వీటిది 62.39 శాతం, కార్లు, జీపులు, 27.04%, 3 చక్రాల వాహనాలు 5.17%, ఇతర వాహనాలు 5.39% వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. డీజిల్‌ వినియోగంలో బస్సులు, హెవీ, లైట్‌ వాహనాలు 43.96 %, కార్లు, జీపులు 16.47%, మూడు చక్రాల ప్యాసింజర్‌ వాహనాలు 9.2 %, వాణిజ్య పరమైన వాహనాలు 6.59 % వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద రవాణాకు 76.28%, ఇతరాలకు 23.72 % డీజిల్‌ వినియోగిస్తున్నట్లు ఆయిల్‌ కంపెనీల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement