ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం | CM KCR Says Mid Day Meals For Inter And Degree Students | Sakshi
Sakshi News home page

ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం

Published Sat, Jul 18 2020 2:28 AM | Last Updated on Sat, Jul 18 2020 9:19 AM

CM KCR Says Mid Day Meals For Inter And Degree Students  - Sakshi

సాక్షి, హైదరాబాద్ ‌: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఉదయం కాలేజీలకు వచ్చిన విద్యార్థులు మధ్యాహ్నానికి మళ్లీ వెళ్లిపోతున్నారని, దీనివల్ల ప్రభుత్వ కాలేజీల్లో డ్రాపౌట్స్‌ పెరిగిపోతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించడంతోపాటు విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వాలనే లక్ష్యంతో కాలేజీల్లో మధ్యాహ్న భోజనం పెట్టాలని నిర్ణయించినట్లు సీఎం వెల్లడించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గార్డెన్‌ అభివృద్ధి చేసి అక్కడే తెలంగాణ బొటానికల్‌ గార్డెన్‌ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సదాశివయ్యను సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో ప్రత్యేకంగా అభినందించారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్‌ గార్డెన్‌కు కావాల్సిన రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలని ఆకాంక్షించారు. త్వరలోనే అన్ని కాలేజీల బోటనీ అధ్యాపకులతో సమా వేశమై గార్డెన్‌ల అభివృద్ధి కార్యాచరణ రూపొందించాలన్నారు.

ఆ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించింది.. 
జడ్చర్ల జూనియర్‌ కాలేజీ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, అక్కడి ప్రభుత్వ లెక్చరర్‌ రఘురామ్‌ సొంత ఖర్చులతో మధ్యాహ్న భోజనం పెడుతున్నారన్న విషయం తెలిసి సీఎం వారిని అభినందించారు. లెక్చరర్‌ రఘురామ్‌ విజ్ఞప్తి మేరకు జడ్చర్ల ప్రభుత్వ జూనియర్‌ కాలేజీకి నూతన భవనాన్ని కూడా మంజూరు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిస్‌ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రికి సదాశివయ్య బహూకరించారు. కార్యక్రమంలో మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి, మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్‌ పాల్గొన్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement