నిబంధనలకు నీళ్లు Terms of water | Sakshi
Sakshi News home page

నిబంధనలకు నీళ్లు

Published Thu, Oct 23 2014 6:00 AM | Last Updated on Sat, Jul 28 2018 8:51 PM

Terms of water

సాక్షి, బెంగళూరు : పాఠశాలల్లో అత్యాచారాలు, పిల్లలపై భౌతిక దాడులను అరికట్టడానికి వీలుగా పోలీస్ శాఖ ఆగస్ట్‌లో రూపొందించిన భద్రతా చర్యలను రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు పాటించడం లేదు. దీంతో ‘విబ్‌గయార్’ సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ది ఆర్కిడ్ ఇంటర్నేషనల్ పాఠశాలలో మంగళవారం మరో బాలికపై అత్యాచారం జరిగడమే ఇందుకు నిదర్శనం.
 
మరోవైపు పోలీసు శాఖ సూచనలు పాటిస్తే ఆర్థికంగా అటు విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తుందనేది పాఠశాల యాజమాన్యం వాదన. ఇక గత జూలైలో బెంగళూరులోని విబ్‌గయార్ పాఠశాలలో చదువుతున్న ఆరేళ్ల  బాలిక పై అదే పాఠశాలలో స్కేటింగ్ ఇన్‌స్ట్రక్షర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి.

ఈ విషయమై సిద్ధరామయ్య ప్రభుత్వం పై జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన పోలీసు శాఖ ప్రైవేటు పాఠశాలలకు కొన్ని నూతన మార్గదర్శకాలను సూచించింది. వీటిని అమలు చేయడానికి ఈ ఏడాది ఆగస్టు 30 వరకూ సమయం కూడా ఇచ్చింది. అయితే ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం మాత్రం వీటిని అమలు చేయడం పట్ల విముఖత ప్రదర్శిస్తోంది.

పోలీసుశాఖ ఇచ్చిన గడువు పూర్తయి దాదాపు రెండు నెలలు కావస్తున్నా రాష్ట్రంలోని మొత్తం ప్రైవేటు పాఠశాల్లో కనీసం 20 శాతం సంస్థలు కూడా సూచనలను పూర్తిస్థాయిలో పాటించడం లేదని పోలీసుశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే పోలీసు శాఖ ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయాలను తమపై రుద్దడం సరికాదని నగరంలోని విశ్వ పబ్లిక్ స్కూల్ సంస్థ డెరైక్టర్ వివేక్ పేర్కొంటున్నారు. అంతేకాకుండా పోలీసు శాఖ సూచనలు ఆర్థికంగా చాలా ఖర్చుతో కూడుకున్నవని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం చెబుతోంది.
 
 పోలీసు శాఖ చేసిన చేసిన సూచనల్లో ముఖ్యమైనవి కొన్ని...
పాఠశాలల్లో సీసీ కెమరాలు తప్పక ఏర్పాటు చేయాలి.  
 
 విద్యార్థులను రవాణా చేసే వాహనాల్లో తప్పక ఒక మహిళా సహాయకురాలు ఉండాలి.
 
 విద్యాసంస్థలోని ఆటమైదానాల్లో ఇరవైనాలుగు గంటల  పాటు తప్పక సెక్యూరిటీ గార్డ్‌ల పహారా ఉండాలి.
 
 పాఠశాల సిబ్బంది వివరాలు స్థానిక పోలీస్ స్టేషన్‌కు తెలపాలి.
 
 కొత్తగా విధుల్లో చేరే వారితోపాటు ఉద్యోగం వదిలి వెళ్లిన సిబ్బంది   వివరాలను ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాలి.
 
 పాఠశాలల్లో జరిగే ఉత్సవాలు, ముఖ్యఅతిథిగా వస్తున్న వారి  వివరాలు  కనీసం 48 గంటల ముందు పోలీసులకు తెలియజేయాలి.
 
 తరుచుగా పాఠశాల పరిసరాల తనిఖీకి పోలీసులను అనుమతించాలి
 
 పాఠశాల యాజమాన్యం చెబుతున్న అభ్యంతరాలు...
 సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది.   ఈ ఆర్థిక భారాన్ని చివరికి విద్యార్థుల తల్లిదండ్రుల పై వేయాల్సి వస్తుంది.
 
 సెక్యూరిటీ గార్డులు దొరకడం చాలా కష్టంగా ఉంది. ముఖ్యంగా రాత్రి    సమయాల్లో విధులు నిర్వర్తించడానికి ఎక్కువ జీతాలను డిమాండ్ చేస్తున్నారు.
 
 చిన్నారులను రవాణా చేసే వాహనాల్లో డ్రైవర్లగా పురుషులు ఉండటం వల్ల వాహనాల్లో మహిళా ఉద్యోగులను నియమించడం సరికాదు. దీని వల్ల మంచి కంటే చెడు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది.
 
 పాఠశాలలో పనిచేసే సిబ్బంది వివరాలను ఎప్పటికప్పుడు ఇవ్వడం శ్రమతో కూడుకున్నది. ఇందుకు ఎక్కువ మంది సిబ్బందిని నియమించుకోవాల్సి ఉంటుంది. ఇది పాఠశాలపై ఆర్థిక భారాన్ని మోపనుంది.
 
 తనిఖీ పేరుతో పోలీసులు తరుచుగా పాఠశాలల్లోకి రావడం
 
  పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపించే అవకాశం ఉంది.
 
 నివేదిక కోరాను..
 విద్యార్థుల రక్షణ కోసం తీసుకోవలసిన రక్షణ చర్యల విషయమై పోలీసు శాఖ రూపొందించిన మార్గదర్శకాలు చాలా పాఠశాలలు పాటించడం లేదు. తాజాగా ఆర్కిడ్ ఇంటర్‌నేషనల్ స్కూల్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో, పాఠశాలలు పాటిస్తున్న భద్రతా చర్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని నగర కమిషనర్ ఎంఎన్ రెడ్డిని ఆదేశించాను. నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు చేపడుతాం.                 
 -  కే.జే.జార్జ్ , రాష్ట్రహోం శాఖ మంత్రి
 

Advertisement
 
Advertisement
 
Advertisement