ఇదీ అవినీతి రంగు!  | Fake Bills Form Contracters | Sakshi
Sakshi News home page

ఇదీ అవినీతి రంగు! 

Published Fri, Mar 8 2019 3:11 PM | Last Updated on Fri, Mar 8 2019 3:11 PM

Fake Bills Form Contracters - Sakshi

ఏలూరు(సెంట్రల్‌): కాంట్రాక్టర్లతో చేతులు కలిపిన నగరపాలక సంస్థ అధికారులు స్వచ్ఛందంగా ప్రైవేట్‌ సంస్థలు చేసిన పనులకు డబ్బులు డ్రా చేసేందుకు కుయుక్తులు పన్నారు.  బిల్లులు సిద్ధం చేశారు. ఈ ఉదంతం నగరపాలక సంస్థలో చర్చకు దారితీసింది. ఈ బిల్లుల తయారీలో నగరపాలక సంస్థ కీలక విభాగంలోని ఓ ముఖ్య అధికారి ప్రత్యేక పాత్ర  పోషించినట్టుగా సమాచారం. 

అసలేం జరిగింది.. 

నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలు, ఫ్లైఓవర్లు, వంతెనలు,  డివైడర్ల గోడలపై కొందరు వాల్‌పోస్టర్లు, సినిమా పోస్టర్లు అంటించడం, ఇతర ప్రకటనల రంగులు వేయడం చేస్తున్నారు. దీనివల్ల అవి అధ్వానంగా తయారవుతున్నాయి. దీనిపై ఎట్టకేలకు కళ్లు తెరిచిన నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక అధికారులు సంబంధిత వ్యక్తులకు, సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. అయినా మార్పు రాకపోవడంతో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు.  నగరంలోని  ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, వంతెనలు, ఫ్లైఓవర్ల గోడలను సుందరంగా ఉంచేందుకు చర్యలు చేపట్టాలని తలంచారు. సుందరీకరణలో భాగంగా 3డీ  బొమ్మలు, రంగులు వేయాలని నిర్ణయించారు. రంగులు, 3డీ డిజైన్లను వేసేందుకు  నగరపాలకసంస్థ ఇంజినీరింగ్‌ విభాగం అధికారులు  ప్రతిపాదనలను సిద్ధం  చేసి ఈ ఏడాది  జనవరిలో టెండర్లను పిలిచారు. విశాఖపట్నానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ కాంట్రాక్టును దక్కించుకున్నట్లు సమాచారం.

స్వచ్ఛందంగా చేసిన వ్యాపార సంస్థలు..

అయితే 3డీ డిజైన్లు, బొమ్మలు  వేసేందుకు నగరంలోని పలు వ్యాపారసంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చాయి. నగరపాలకసంస్థ కార్యాలయం, నగరపాలకసంస్థ కార్యాలయం ఎదురుగా ఉన్న దామరాజు వెంకట్రావు పంతులు పార్కు, కర్రల వంతెన, లోబ్రిడ్జి,  ప్రభుత్వాస్పత్రి,  ఓవర్‌ బ్రిడ్జి  గోడలకు  వివిధ రకాల డిజైన్లతో కూడిన బొమ్మలను వేసి, వారి వ్యాపార సంస్థల పేర్లను వాటి పక్కనే వేసుకున్నారు. ఇదంతా ఉచితంగానే చేశారు. 

కాంట్రాక్టరే చేసినట్టుగా బిల్లులు

అయితే ఈ పనిని కాంట్రాక్టరే చేసినట్టుగా నగరపాలక సంస్థ అధికారులు బిల్లుల కాజేతకు యత్నిస్తున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా రూ.8.14   లక్షలకు  బిల్లు తయారు చేసినట్టుగా తెలుస్తోంది. నగరంలోని గోడలకు ప్రైవేట్‌ సంస్థలు  రంగులు వేసినట్టు స్పష్టంగా కనిపిస్తున్నా.. కాంట్రాక్టరే రంగులు వేసినట్లు అధికారులు బిల్లులు సిద్ధం చేయడంపై  పలు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. వెంటనే దీనిపై చర్యలు చేపట్టాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. 

ప్రైవేట్‌ సంస్థల సౌజన్యంతోనే..

నగరంలోని డివైడర్లు,  ప్రభుత్వ కార్యాలయాల గోడలకు పోస్టర్లను అంటించి అధ్వానంగా చేస్తున్నారు. దీంతో గోడలపై  ఎటువంటి పోస్టర్లను వేయకుండా ఉండేలా 3డీ బొమ్మలు, రంగులు వేసేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేశాం. అయితే వీటిని వేసేందుకు నగరంలోని వ్యాపారసంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో వాటితోనే రంగులు, బొమ్మలు వేయించాం.  ఈ పనికి నగరపాలకసంస్థ నిధులు ఏమీ ఖర్చు చేయలేదు. బిల్లులు సిద్ధం చేసినట్టుగా నా దృష్టికి రాలేదు. దీనిపై విచారణ చేస్తాం.
–ఎ.మోహన్‌రావు, నగరపాలక సంస్థ కమిషనర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement