కొత్త బంగారులోకం చేద్దాం! PM Narendra Modi to launch BJP is campaign in Maharashtra | Sakshi
Sakshi News home page

కొత్త బంగారులోకం చేద్దాం!

Published Fri, Sep 20 2019 4:10 AM | Last Updated on Fri, Sep 20 2019 5:15 AM

PM Narendra Modi to launch BJP is campaign in Maharashtra - Sakshi

నాసిక్‌: భూతల స్వర్గం కశ్మీర్‌ను మరోసారి కొత్త బంగారు లోకంగా మార్చేద్దామని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రతి కశ్మీరీని హత్తుకుని, కశ్మీర్‌ను మళ్లీ స్వర్గసీమగా మారుద్దామని  పిలుపునిచ్చారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం నాసిక్‌లో జరిగిన ఒక బహిరంగ సభలో ప్రసంగించిన మోదీ.. దశాబ్దాల కశ్మీరీ కష్టాలకు గత కాంగ్రెస్‌ ప్రభుత్వాలే కారణమని దుయ్యబట్టారు. కశ్మీర్‌లో హింసను ప్రజ్వరింపజేసేందుకు సరిహద్దులకు ఆవలి నుంచి నిర్విరామ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పాకిస్తాన్‌పై ధ్వజమెత్తారు.

ఉగ్రవాదం, హింసల నుంచి కశ్మీర్, లద్దాఖ్‌ ప్రజలను దూరం చేసేందుకు ఆర్టికల్‌ 370 రద్దు నిర్ణయం తీసుకున్నామన్నారు. ‘దశాబ్దాల హింసాత్మక వాతావరణం నుంచి బయటపడాలని యువత, తల్లులు, సోదరీమణులు నిర్ణయించుకున్నారు. వారికి ఉద్యోగాలు, అభివృద్ధి కావాలి. జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలోని సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేం కట్టుబడి ఉన్నాం’ అని మోదీ వివరించారు. దేశంలోని యాభై కోట్ల పాడి పశువులకు టీకాలు వేయించాలని తమ ప్రభుత్వం నిర్ణయిస్తే.. ఇదో రాజకీయ నిర్ణయమని విమర్శిస్తున్నారని, పశువులు ఓట్లు వేయవన్న సంగతి వారు గుర్తుచేసుకోవాలని మోదీ ఎద్దేవా చేశారు. ఛత్రపతి శివాజీ వంశస్తుడు బహూకరించిన తలపాగాతో మోదీ బహిరంగ సభలో పాల్గొన్నారు.  

సైనిక అవసరాలను వారు పట్టించుకోలేదు
జాతీయ భద్రతపై గత యూపీఏ ప్రభుత్వం కనీస శ్రద్ధ చూపలేదని మోదీ విమర్శించారు. సైనిక బలగాల కోసం 2009లో 1.86 లక్షల బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్లు కావాలన్న డిమాండ్‌ను పట్టించుకోలేదని గుర్తు చేశారు. ‘2014లో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రమే ఆ డిమాండ్‌ నెరవేరింది. అప్పటివరకు సరిహద్దుల్లో మన జవాన్లు అవి లేకుండానే ప్రాణాలొడ్డి విధులు నిర్వర్తించేవారు. అంతేకాదు, ఇప్పుడు భారత్‌లో తయారయ్యే బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్లు దాదాపు 100 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి’ అని మోదీ వివరించారు.  

పవార్‌పై విమర్శలు...
పాకిస్తాన్‌ అంటే తనకిష్టమన్న ఎన్సీపీ సీనియర్‌ నేత శరద్‌ పవార్‌ వ్యాఖ్యలపై మోదీ ధ్వజమెత్తారు. ‘శరద్‌ పవార్‌కు ఏమైంది? అంతటి సీనియర్‌ నేత పాకిస్తాన్‌ విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూంటే బాధగా ఉంది. ఆయనకు పొరుగు దేశమంటే ఇష్టం కావచ్చుగానీ.. ఉగ్రవాదం మూలాలు ఎక్కడున్నాయో అందరికీ తెలుసు’ అని మోదీ వ్యాఖ్యానించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370ని రద్దు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎన్సీపీతోపాటు ఇతర ప్రతిపక్షాలు సహకరించలేదని, మద్దతుగా నిలవలేదని మోదీ విమర్శించారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ పేరు ప్రస్తావించకుండానే... కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలను భారత వ్యతిరేక శక్తులకు ఊతమిస్తున్న దేశాలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని మోదీ చెప్పారు.

రామమందిర నిర్మాణంపై..  
మిత్రపక్షం శివసేనపైనా మోదీ విమర్శలు గుప్పించారు. సేన పేరును ప్రస్తావించకుండా.. రామ మందిర నిర్మాణం విషయంలో కొందరు పెద్ద నోరేసుకుని మాట్లాడుతున్నారని, వారంతా  సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు సంయమనం పాటించాలన్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకముంచాలని చేతులు జోడించి  కోరుతున్నానన్నారు. మందిర నిర్మాణం కోసం ఇంకా ఎన్నాళ్లు ఎదురుచూడాలని, అందుకు కేంద్రం ఓ కొత్త చట్టం రూపొందించాలని తాము చాన్నాళ్లుగా కోరుతున్నామని శివసేన నేత ఉద్ధవ్‌ ఠాక్రే సోమవారం వ్యాఖ్యానించడం తెల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement