ఎన్టీఆర్‌కే కాదు.. ఆంధ్రులకూ బాబు వెన్నుపోటు! | Motkupalli Narasimhulu Fires On AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

Published Sun, Jul 22 2018 1:07 PM | Last Updated on Wed, Oct 17 2018 6:18 PM

Motkupalli Narasimhulu Fires On AP CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : పత్ర్యేక హోదా రావాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబును ఓడించాలని ఏపీ ప్రజలకు టీడీపీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు సూచించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు ఓటమిని చూడాలని వెంకన్నకు మొక్కానని, చంద్రబాబు పతనం కోసం కాలినడకన తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నానని తెలిపారు. మెట్టు మెట్టుకి చంద్రబాబు ఓడిపోవాలని వేడుకున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు జీవితమంతా కపటం, నాటకం, దగా మోసాలేనని మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చలో ఏపీకీ హోదా ఇవ్వాలని ఎవరైనా మాట్లాడారా అని, టీడీపీ పెట్టిన అవిశ్వాసంపై ఎవరైనా కలిసొచ్చారా అని ప్రశ్నించారు.

దివంగత నేత ఎన్టీఆర్‌ జెండాను చంద్రబాబు దొంగతనం చేశాడని మండిపడ్డారు. ప్యాకేజీకి ఒప్పుకున్నామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబే చెప్పారని మోత్కుపల్లి గుర్తు చేశారు. బాబు ఆంధ్రుల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని, ఆయన ఎన్టీఆర్‌కే కాదు.. ఆంధ్రులకు వెన్నుపోటు పోడిచారని దుయ్యబట్టారు. అసెంబ్లీలో ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ చాలా సార్లు హోదాపై బాబును ప్రశ్నించారని, హోదా రాకుండా అడ్డుపడింది చంద్రబాబే అని స్పష్టం చేశారు.

అవినీతి కప్పిపుచ్చుకోవడానికే..
చంద్రబాబు 29 సార్లు ఢిల్లీ వెళ్లింది తన అవినీతిని, దొంగతనాలను కప్పిపుచ్చుకోవడానికేనని విమర్శించారు. బాబు మోసాలపై అందరూ తిరగబడాలని, ప్రజల కోసం రాజకీయాలు చేయడం లేదని, తన కోసం, తన కుటుంబం కోసం రాజకీయాలు చేస్తున్నారని మోత్కుపల్లి ఫైర్‌ అయ్యారు. మోసగాడు, అబద్దాల కోరు చంద్రబాబును అడుగడుగునా నిలదీయాలన్నారు. దళితుల్లో ఎవరైనా పుడతారా అని ఆ జాతినే అవమానించారని, అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలకు చంద్రబాబు తూట్లు పొడిచారని మండిపడ్డారు. కేంద్రం ప్యాకేజీ ఇస్తే అసెంబ్లీ సాక్షిగా బాబు ధన్యవాదాలు చెప్పారని గుర్తు చేశారు.

అధికారం కోసం ఎంతవరకైనా దిగజారే వ్యక్తి చంద్రబాబు అని, వెన్నపోటు పొడవడంలో, మోసాలు చేయడంలో ఆయనను మించిన సీనియర్‌ లేరని తెలిపారు. కులాలరహితంగా ఏకమై చంద్రబాబుపై పోరాటం చేయాలని, తగిన గుణపాఠం చెప్పాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీకి ఆయన విజ్ఞప్తి చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement