20వ స్క్వాడ్రన్‌..4 పైలట్లు... | 4 young IAF pilots hit a Pakistani airbase 50 years ago | Sakshi
Sakshi News home page

20వ స్క్వాడ్రన్‌..4 పైలట్లు...

Published Sat, Mar 2 2019 5:22 AM | Last Updated on Sat, Mar 2 2019 5:22 AM

4 young IAF pilots hit a Pakistani airbase 50 years ago - Sakshi

యుద్ధం లేని సమయంలో తొలిసారి పాకిస్తాన్‌ భూభాగంలోకి చొచ్చుకుని పోయి బాలాకోట్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై చేసిన మెరుపుదాడి భారత వైమానిక దళ ధైర్యసాహసాలకు ఓ ప్రతీక. మనదేశానికి చెందిన యుద్ధవిమానాలు వాస్తవాధీన రేఖను, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ను కూడా దాటి పాక్‌లోకి చొచ్చుకుపోవటంలో చూపిన తెగువను 1971 నాటి బంగ్లా యుద్ధంలోనూ మన వాయుసేన ప్రదర్శించింది. మన దేశానికి చెందిన ఓ నలుగురు యువ పైలట్లు ఇలాగే పాకిస్తాన్‌ భూభాగంలోకి వెళ్లి శత్రు వైమానిక స్థావరాన్ని నాశనం చేశారు

. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్క్వాడ్రన్‌ లీడర్‌ ఆర్‌ఎన్‌ భరద్వాజ్, ఫ్లైయింగ్‌ ఆఫీసర్లు వీకే హెబ్లే, బీసీ కరంబయ, ఫ్లైట్‌ లెఫ్టినెంట్‌ ఏఎల్‌ దియోస్కర్‌లు ఆ ఏడాది డిసెంబర్‌ 8న జెట్‌ విమానాల్లో మురిద్‌ వైపు దూసుకుపోయారు. పాకిస్తాన్‌ సరిహద్దు నుంచి 120 కిలోమీటర్ల లోపల ఉన్న మురిద్‌ వైమానిక స్థావరంలో నిలిపి ఉంచిన శత్రు విమానాలను ధ్వంసం చేశారు. నాటి సాహస కృత్యాలను ఫ్లైయింగ్‌ ఆఫీసర్‌గా పనిచేసిన బీసీ కరంబయ నెమరు వేసుకున్నారు. ఆయన మాటల్లోనే..

ఈ ఆపరేషన్‌కు నలుగురం బయల్దేరాం. ముందు రెండు, తర్వాత రెండు విమానాలు. మొదటి రెండు విమానాలు అనుకున్న ప్రకారం ముందుకెళ్లాయి. వెనకనున్న రెండు విమానాలను ముందు వాటి కంటే ఒకటిన్నర నిముషం ఆలస్యంగా బయలు దేరమన్నాం. ఆకాశంలో కాల్పుల శబ్దం వినపడింది. నేను విమానంలో రేడియో ఆన్‌చేశాను. ముందువెళ్లిన విమానం నుంచి ‘నేను ఇప్పుడే నాలుగు ఇంజన్ల విమానాన్ని షూట్‌ చేశాను’అని వినిపించింది. చుట్టూ చీకటిగా ఉంది. నేను మిగ్‌–19 ఎస్‌ను చూశానని అనుకున్నాను.

(నిజానికి అది చైనా తయారీ ఎఫ్‌–6 విమానం, చూడ్డానికి రష్యా మిగ్‌–19లాగే ఉంటుంది). దియోస్కర్‌ మరో విమానాన్ని గుర్తించాడు. నేను కాల్పులు జరిపాను. విమానాలకు ఇంధనాన్ని నింపే ట్యాంకరుకు మంటలంటుకున్నాయి. నేను కాల్పులు జరుపుతూనే ఉన్నాను. అప్పుడు నేను భూమికి కేవలం 300 అడుగుల ఎత్తులోనే ఉన్నాను. విమానం ఊగటం మొదలుపెట్టింది. శత్రువులు నా విమానాన్ని కాల్చారని గుర్తించాను. నేను దూకేస్తున్నానని మిగతా వారికి చెప్పాను.

బయటకు దూకేందుకు విమానం తలుపు తెరుస్తుండగా, శత్రువులకు యుద్ధ ఖైదీగా చిక్కకూడదని నిర్ణయించుకున్నాను. దాంతో దూకే ఆలోచనను విరమించుకుని తక్కువ ఎత్తులో ప్రయాణించసాగాను. నా విమానం రెక్క ముందు కుడి భాగం, ఇంధన ట్యాంకులు పేలిపోవడం చూశాను. అయినా విమానం ఎగురుతూనే ఉంది. విమానం బాగా ఊగిపోయింది. అవసరమైనంత ఎత్తులో నడుపుతూ ఇండస్,సట్లైజ్‌ నదుల్ని దాటి భారత భూభాగంలో దిగాను’’అని తన అనుభవాన్ని చెప్పారు. 1971లో కరంబయకు వీర్‌చక్ర పురస్కారం లభించింది. ఆ తర్వాత చాలా ఏళ్లకు ఆయన పదవీ విరమణ చేశారు.

మురిద్‌పై దాడి చేసిన కరంబయకు కాని ఇతర పైలట్లకు కాని తామెంత గొప్ప పని చేశామో అప్పట్లో తెలియలేదు. బంగ్లాదేశ్‌ యుద్ధం తర్వాత 47 ఏళ్లకు వచ్చిన ఒక పుస్తకంలో వీరి సాహసోపేత ఘనకార్యాన్ని పొందుపరిచారు. పాకిస్తాన్‌కు చెందిన మాజీ ఎయిర్‌కమాండర్‌ ఎం.కైసర్‌ తుఫైల్‌ ‘ఇన్‌ ద రింగ్‌ అండ్‌ ఆన్‌ ఫస్ట్‌ ఫీట్‌– పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ ఇన్‌ ద 1971 ఇండో–పాక్‌ వార్‌’పేరుతో రాసిన తాజా పుస్తకంలో ఈ ఘటనను వివరించారు. భారత వైమానిక దళం 20వ స్క్వాడ్రన్‌కు చెందిన హంటర్‌ విమానాలు ముదిర్‌ స్థావరంలో ఉన్న 5ఎఫ్‌–86 విమానాలను నాశనం చేశాయని ఆయన పేర్కొన్నారు. అయితే, బంగ్లాయుద్ధం తర్వాత భారత రక్షణ మంత్రిత్వ శాఖ భారత వైమానిక దళంపై ప్రచురించిన పుస్తకంలో దీని గురించి ఎలాంటి ప్రస్తావన లేదు.
–సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement