నిర్మాతకు రజనీకాంత్‌ బహుమతి! | Rajinikanth Gift To Producer Kalaignanam! | Sakshi
Sakshi News home page

నిర్మాతకు రజనీకాంత్‌ బహుమతి!

Published Fri, Aug 30 2019 10:40 AM | Last Updated on Fri, Aug 30 2019 11:13 AM

Rajinikanth Gift To Producer Kalaignanam! - Sakshi

చెన్నై: తనను హీరోను చేసిన నిర్మాతకు దక్షిణాది సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్థిర నివాసం కల్పించారా? ఇందుకు భిన్నమైన వార్తలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్‌  ఆదిలో ప్రతినాయకుడిగా ఎదిగిన విషయం తెలిసిందే. అలాంటి రోజుల్లో ఆయనను హీరోగా పరిచయం చేసి భైరవా అనే చిత్రాన్ని నిర్మించారు ప్రఖ్యాత కథా రచయిత కలైజ్ఞానం. ఆ చిత్రం రజనీకాంత్‌ సినీ జీవితాన్నే మార్చేసింది. అలాంటి నిర్మాత నివసించడానికి సొంతంగా ఒక ఇల్లు కూడా ఏర్పరచుకోలేకపోయారు. ఈ విషయాన్ని రెండు వారాల క్రితం దర్శకుడు భారతీరాజా నేతృత్వంలో కలైజ్ఞానంకు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో నటుడు శివకుమార్‌ తెలిపారు. 

అంతే కాదు కలైజ్ఞానంకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇల్లు కట్టించాలని విజ్ఞప్తి చేశారు. అదే కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న  రజనీకాంత్‌ ప్రభుత్వానికి ఆ అవకాశం ఇవ్వనని, తానే కలైజ్ఞానంకు ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. అంతే కాదు 10 రోజుల్లో అందుకు డబ్బును తాను అందిస్తానని చెప్పారు. దీంతో దర్శకుడు భారతీరాజా కలైజ్ఞానం కోసం కోటి రూపాయల్లో ఒక ఇంటిని చూసినట్లు, దాన్ని రజనీకాంత్‌ కొనుగోలు చేసి నిర్మాత కలైజ్ఞానంకు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై విచారించగా రజనీకాంత్‌ ఇంకా ఇల్లును కొనలేదని, దర్శకుడు భారతీరాజా ఇల్లు కోసం వెతుకుతున్నట్లు తెలిసింది. అదే విధంగా కలైజ్ఞానంకు ఇంటిని కొనడానికి రజనీకాంత్‌ రూ.కోటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పినట్లు తెలిసింది. 

రజనీతో ఎలాంటి బంధంలేదు.. 
దీనిపై నిర్మాత కలైజ్ఞానం స్పందిస్తూ తనకు నటుడు రజనీకాంత్‌తో ఎలాంటి అనుబంధం, రక్త సంబంధంగానీ లేదన్నారు. ఆయన్ని హీరోగా పరిచయం చేసి చిత్రం నిర్మించానంతేనని పేర్కొన్నారు. అలాంటిది తనకు రజనీకాంత్‌ ఎంత పెద్ద సాయం చేయడానికి ముందుకొచ్చారు. ఆయన మానవత్వానికి ఇది నిదర్శనం అని అన్నారు. కాగా రజనీకాంత్‌ ఇంతకు ముందు నటించిన అరుణాచలం చిత్రానికి తనతో చిత్రాలు చేసి ఆ తరువాత ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్న ఏడుగురిని భాగస్వాములుగా చేశారు. ఆ చిత్రానికి వచ్చిన లాభాలను వారికి పంచారు. అందులో నిర్మాత కలైజ్ఞానం ఉన్నారన్నది గమనార్హం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement