కేన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేసిందా? | british woman becomes first to receive cancer vaccine | Sakshi
Sakshi News home page

కేన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేసిందా?

Published Thu, Mar 3 2016 2:24 PM | Last Updated on Sun, Sep 3 2017 6:55 PM

కేన్సర్‌కు వ్యాక్సిన్ వచ్చేసిందా?

మానవాళిని పీడిస్తున్న కేన్సర్ మహమ్మారిపై విజయం దిశగా ఓ అడుగు పడింది. బ్రిటన్‌కు చెందిన ఓ యువతికి వైద్యులు ఓ సరికొత్త వ్యాక్సిన్ ఇచ్చారు. దాంతో.. ఆమె శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, శరీరంలో ఎక్కడ ట్యూమర్లు పెరిగినా వాటిని నాశనం చేసే శక్తి వస్తుందని చెబుతున్నారు. కెల్లీ పోటర్ (35) అనే మహిళకు గర్భాశయ ముఖద్వార కేన్సర్ ఉన్నట్లు 2015 జూలైలో గుర్తించారు. అప్పటికే వ్యాధి కూడా ముదిరింది. ఆమెకు తొలిసారిగా ఈ వ్యాక్సిన్ ప్రయోగాత్మకంగా ఇచ్చారు. రాబోయే రెండేళ్లలో 30 మంది వాలంటీర్లకు ఈ వ్యాక్సిన్ ఇచ్చి పరిశీలించబోతున్నారు. సాధారణంగా శరీరంలో కణాలు కొంతకాలం తర్వాత చనిపోతుంటాయి, వాటి బదులు కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ కేన్సర్ కణాలకు మాత్రం అసలు చావు అన్నది లేకపోగా, మరింతగా వృద్ధిచెందుతుంటాయి. సరిగ్గా ఇలాంటి కణాలపై పనిచేసేలాగే రోగనిరోధక శక్తిని పెంపొందించేలా ఈ కొత్త వ్యాక్సిన్‌ను వైద్య పరిశోధకులు రూపొందించారు.

ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్న సమయంలోనే పేషెంట్లకు కెమెథెరపీ కూడా తక్కువ డోస్‌లో ఇస్తారు. ఈ కెమోథెరపీ రోగనిరధక శక్తికి ఉండే అడ్డంకులను తొలగిస్తుంది. సాధారణంగా శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి బయటి నుంచి వచ్చే వాటిని అడ్డుకుంటుంది తప్ప, సొంత శరీరంలోనే పెరిగే కేన్సర్ కణాలను ఏమీ చేయదు. సరిగ్గా ఆ లక్షణాన్నే ఈ కెమోథెరపీ మందు వదిలిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కెల్లీకి కేన్సర్ నాలుగో దశలో ఉన్నట్లు గుర్తించారు. దురదృష్టవశాత్తు శరీరంలోని ఇతర ప్రాంతాలకు కూడా వ్యాధి వ్యాపించింది. లండన్‌లోని గయ్స్ ఆస్పత్రిలో కొంతమేర చికిత్స చేసినా, అప్పటికే కాలేయానికి, ఊపిరితిత్తులకు కూడా వ్యాధి వ్యాపించిందని, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఈ వ్యాక్సిన్ తనకు ఇస్తాననగానే ఎంతో సంతోషించానని ఆమె చెప్పారు. ఆమెకు ఫిబ్రవరి 9వ తేదీన వ్యాక్సిన్ ఇచ్చారు. ఆ తర్వాత ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించొచ్చని వైద్యులు చెప్పినా, అలాంటివేవీ ఇంతవరకు లేవు. ఈ వ్యాక్సిన్ సాయంతో తాను కేన్సర్‌ను జయిస్తే.. ఇతరులకు కూడా ఇది స్ఫూర్తిమంతంగా ఉంటుందని కెల్లీ పోటర్ తెలిపారు. తాము ప్రధానంగా శరీరంలోని రోగ నిరోధక శక్తి మీద పనిచేసేలా వ్యాక్సిన్‌ను రూపొందించామని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ హర్‌దేవ్ పాండా తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement