సూపర్‌ స్పెషలిస్ట్‌ | Immunity with all-bukhara fruit | Sakshi
Sakshi News home page

సూపర్‌ స్పెషలిస్ట్‌

Published Mon, Jul 9 2018 1:00 AM | Last Updated on Mon, Jul 9 2018 1:01 AM

Immunity with all-bukhara fruit - Sakshi

చిన్న పిల్లల్లో బాగా జ్వరం వచ్చి తగ్గాక తినిపించే పండ్లలో ముఖ్యమైన పండు ఏమిటో తెలుసా? ఆలుబుఖారా! అందులో విటమిన్‌–సి పుష్కలంగా ఉంటుంది.  మంచి రోగ నిరోధక శక్తి సమకూరుతుంది. కేవలం చిన్నారుల్లోనే కాదు.. ఇది అందరిలోనూ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. చూస్తే అందంగా ఉండి... తింటే ఆరోగ్యంగా ఉంచే ఈ పండుతో ఒనగూరే లాభాలెన్నో. వాటిలో ఇవి కొన్ని.

ఆలు–బుఖారా పండు కండరాలు పట్టేయకుండా చూస్తుంది. తరచూ కండరాలు పట్టేయడం (మజిల్‌ క్రాంప్స్‌), పిక్కలు పట్టేయడం వంటి సమస్యతో బాధపడేవారు ఆలు–బుఖారా పండ్లు తప్పక తినాలి.
ఆలు–బుఖారా పండ్లలో పోటాషియమ్‌ ఎక్కువ. అందువల్ల ఇది మన రక్తపోటును క్రమబద్దీకరించి, నియంత్రణలో ఉంచుతుంది.
ఇది రక్తనాళాల్లో కొవ్వులు పేరుకొనే అథెరోస్కి›్లరోసిస్‌ కండిషన్‌ను నివారిస్తుంది.
ఈ పండులోని కొవ్వుల వల్ల కొలెస్ట్రాల్‌ కూడా నియంత్రణలో ఉంటుంది.
పొటాషియమ్‌ ద్వారా హైబీపీని అదుపులో ఉంచడం, చెడు కొవ్వులు పెరగకుండా చూడటం, రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా చూడటం వంటి అన్ని పనులూ చేస్తుంది. పైగా ఇందులోని విటమిన్‌ బి6 గుండెకు హానిచేసే హోమోసిస్టిన్‌ను అరికడుతుంది. ఈ కారణాలవల్ల ఇది గుండెకు చాలా మంచిది. పై అన్నింటి కారణంగా అది గుండెపోటు ముప్పునూ సమర్థంగా నివారిస్తుంది.
ఆల్‌–బుఖారాలో ఐరన్‌ ఎక్కువ. ఇందులో విటమిన్‌–సి కూడా ఉండటం వల్ల ఆ ఐరస్‌ వెంటనే ఒంటికి పడుతుంది. అందుకే రక్తహీనత ఉన్నవారికి ఆలు–బుఖారా ఇస్తుంటారు. పైగా ఇది ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది.
ఇది ఎముక సాంద్రతను పెంచుతుంది. ఆస్టియోపోరోసిస్‌ను అరికడుతుంది. అందుకే అందరూ దీన్ని తీసుకోవాలి. ఈ కారణంగా.. మరీ ముఖ్యంగా మెనోపాజ్‌ వచ్చిన మహిళలు దీన్ని తప్పకుండా తీసుకోవాలి.
ఆలు–బుఖారాలో ఉండే సార్బిటాల్, ఐసాటిన్‌ పోషకాలు మొత్తం జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులోని పీచు (సాల్యుబుల్‌ ఫైబర్‌) కూడా జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.  
ఎండు ఆలు–బుఖారాలో ఫోలిక్‌యాసిడ్‌ పుష్కలంగా ఉంటుంది. అందుకే గర్భిణులు దీన్ని తీసుకుంటే కడుపులోని బిడ్డ ఆరోగ్యం బాగుంటుంది.
ఆలు–బుఖారా అనేక క్యాన్సర్లను అరికడుతుంది. మరీ ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక క్యాన్సర్లు, రెస్పిరేటరీ వ్యవస్థలో వచ్చే క్యాన్సర్లు, నోటి క్యాన్సర్లను నివారిస్తుంది. దీనికి కారణం ఆ పండులో ఉన్న ఫ్రీ–రాడికల్స్‌ను అరికట్టే గుణమే. ఈ పండును ఎర్రగా, అందంగా కనిపించేలా చేసే ఎరుపు రంగు పిగ్మెంటే ఫ్రీ–రాడికిల్స్‌ను తుదముట్టిస్తుంటుంది.
ఆల్‌–బుఖారా సహజ విరేచనకారి కావడం వల్ల మలబద్దకం సమస్యను మందులేమీ లేకుండానే నివారిస్తుంది.
హృద్రోగాలు ఉన్నవారికి, డయాబెటిస్‌ రోగులకు మేలు చేస్తుంది.
అధిక బరువు తగ్గాలనుకునేవారు... బరువును పెరగకుండా చూసుకోవాలనుకునేవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. ఈ రెండు పనులనూ ఇది సమర్థంగా చేస్తుంది.
వయసు పెరుగుతున్న కొద్దీ కంటి చూపును దెబ్బతీసే ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌ డీజనరేషన్‌ను నివారిస్తుంది. ఇందులో విటమిన్‌–ఏ పాళ్లు కూడా ఎక్కువే. దాంతో కంటి ఆరోగ్యాన్ని కూడా ఇది కాపాడుతుంది.
విటమిన్‌ సి, విటమిన్‌ ఏ వల్ల ఇది మేని నిగారింపును మెరుగుపరచి, చర్మం మెరిసేలా చేస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement