డెబిట్ కార్డులతోనూ బీమా ధీమా.. | Debit card Insurance said .. | Sakshi
Sakshi News home page

డెబిట్ కార్డులతోనూ బీమా ధీమా..

Published Fri, Jul 18 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 10:29 AM

డెబిట్ కార్డులతోనూ బీమా ధీమా..

ప్రయాణంలో డెబిట్ కార్డు పోవడంతో కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు విజయ్. బ్యాంకు వాళ్లు అప్పటికప్పుడు ఇన్‌స్టంట్ కార్డు జారీ చేశారు. అది తీసుకుని ఇంటికొచ్చిన తర్వాత .. వార్షిక చార్జీలు వగైరాలు ఎంత ఉంటాయో చూసుకుందామని కార్డుతో పాటు ఇచ్చిన బుక్‌లెట్‌ను తీరిగ్గా తిరగేశాడు విజయ్. చార్జీలు వగైరాల గురించి పక్కన పెడితే.. అందులో బీమా ప్రయోజనం అంశం అతని దృష్టిని ఆకర్షించింది. దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకున్నాడు. కొద్ది రోజుల క్రితమే ప్రమాదంలో మరణించిన తన మిత్రుడి కుటుంబానికి కూడా బీమా క్లెయిమ్ మొత్తం లభించేలా సాయం చేశాడు. ఇలా డెబిట్ కార్డులో ఇమిడి ఉన్న ప్రయోజనాలను వివరించేదే ఈ కథనం..
 
ఏటీఎంలలో నగదు విత్‌డ్రా చేసుకోవడానికే కాకుండా ఇతరత్రా కొనుగోళ్లు జరిపేందుకు కూడా ఉపయోగపడేలా బ్యాంకులు తమ ఖాతాదారులకు డెబిట్ కార్డులు ఇస్తున్నాయి. ఈ డెబిట్ కార్డులతో బీమా ప్రయోజనం కూడా ఉంటుంది. వ్యక్తిగత ప్రమాద బీమా మొదలు ఈ కార్డులతో జరిపే కొనుగోళ్లకు కూడా కవరేజీ ఉంటోంది. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ మొదలైన బ్యాంకులు.. వివిధ బీమా కంపెనీలతో టైఅప్ పెట్టుకుని ఈ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. అయితే, పూర్తి స్థాయి బీమా పాలసీలకు ఈ తరహా కవరేజీని ప్రత్యామ్నాయంగా అనుకోవద్దు. దేని ప్రయోజనాలు దానివేనని గుర్తుంచుకోవాలి.
 
వ్యక్తిగత ప్రమాద బీమా..
 
డెబిట్ కార్డులపై వ్యక్తిగత ప్రమాద బీమా కవరేజీ బ్యాంకు, కార్డు, సందర్భాన్ని బట్టి రూ. 2 లక్షల నుంచి రూ. 3 కోట్ల దాకా ఉంటోంది. ప్రమాదంలో ఖాతాదారు కన్నుమూసిన పక్షంలోనే ఈ బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయడానికి అనుమతిస్తారు. సాధారణ రోడ్డు ప్రమాదాల్లాంటి (నాన్-ఎయిర్) వాటితో పోలిస్తే విమాన ప్రయాణాల్లో ప్రమాదాలకి (ఎయిర్) అధిక కవరేజీ ఉంటోంది. ఉదాహరణకు, ఐసీఐసీఐ బ్యాంకు తమ ప్లాటినం డెబిట్ కార్డుపై విమాన ప్రమాదాలకయితే రూ. 20 లక్షల మేర, నాన్-ఎయిర్ ప్రమాదాలకయితే రూ. 10 లక్షల మేర కవరేజీ ఇస్తోంది. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..తమ గోల్డ్ ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుపై రూ. 2 లక్షల మేర, ప్లాటినం ఇంటర్నేషనల్ డెబిట్ కార్డుపై రూ. 5 లక్షల దాకా కవరేజీ ఇస్తోంది.
 
కొనుగోళ్లకు ధీమా..
 
ప్రమాద బీమాతో పాటు కొనుగోళ్లకు కూడా డెబిట్ కార్డులతో బీమా ప్రయోజనం ఉంటోంది. కొన్న రోజు నుంచి సుమారు 90 రోజుల్లోగా సదరు వస్తువు పోయినా, అగ్నిప్రమాదాలు వంటి దుర్ఘటనల్లో ధ్వంసమైనా ఈ కవరేజీని క్లెయిము చేయొచ్చంటున్నాయి బ్యాంకులు. ఇలాంటి సందర్భాల్లో పర్చేజ్ ప్రొటెక్షన్ కింద కార్డును బట్టి రూ. 5 లక్షల దాకా కవరేజీ ఉంటోంది.

షరతులూ ఉంటాయి..
 
క్లెయిమ్ చేసుకోవాలంటే మిగతా బీమా పాలసీల్లాగే వీటికి కూడా కొన్ని షరతులు ఉంటాయి. ఉదాహరణకు విమాన ప్రమాదం కవరేజీ క్లెయిమ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా సదరు డెబిట్ కార్డుతోనే టికెట్ కొన్నట్లయితేనే కుదురుతుంది.
 
క్లెయిమ్‌కి కావల్సినవి ..

క్లెయిమ్ పొందాలంటే ఘటన గురించి సాధారణంగా 15 రోజుల్లోగా తెలియజేయాల్సి ఉంటుంది. ఇందుకోసం పలు పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
     
నామినీ సంతకం చేసిన క్లెయిమ్ ఫారం. ఘటన జరగడానికి ముందు.. ముఫ్ఫై రోజుల పాటు కార్డు స్టేట్‌మెంటు.
     
గెజిటెడ్ ఆఫీసరుతో అటెస్ట్ చేయించిన మరణ ధృవీకరణ
     
పత్రం, పోస్ట్‌మార్టం కాపీ, ఎఫ్‌ఐఆర్ తదితర కాపీలు.
     
ఆస్పత్రిలో చికిత్స పొందిన పక్షంలో చికిత్స పత్రాలు.
     
క్లెయిమ్ మొత్తాన్ని బట్టి పాన్ కార్డు కాపీ, చిరునామా ధృవీకరణ పత్రాలు, క్లెయిమెంటు పాస్‌పోర్ట్ ఫొటోలు, నిర్దేశిత స్టాంపు పేపరుపై డిక్లరేషన్ బాండు, ఇతర వారసుల నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెటు ఒరిజినల్.
     
పర్చేజ్ ప్రొటెక్షన్ క్లెయిముకయితే.. బిల్లులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
 

Advertisement
 
Advertisement
 
Advertisement