పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సర్టిఫికెట్ల పరిశీలన | part-time Instructors Certificates verification | Sakshi
Sakshi News home page

పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సర్టిఫికెట్ల పరిశీలన

Published Mon, Sep 12 2016 10:56 PM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

part-time Instructors Certificates verification

విద్యారణ్యపురి: జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు మళ్లీ ఈ విద్యా సంవత్సరంలో విధుల్లోకి తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నుంచి జిల్లా సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్టు అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ మేరకు జిల్లాలోని పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లలో ఆర్ట్‌​‍, వర్క్‌, ఫిజికల్‌ ఎడ్యూకేషన్‌ విభాగాలల్లోని అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియ సోమవారం హన్మకొండలోని సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్టు కార్యాలయంలో నిర్వహించారు.
 
సబ్జెక్టు నిపుణులతో ఈ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను కొనసాగించారు. గత విద్యాసంవత్సరం (2015-16)లో సుమారు 300 మంది పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు తమకు కేటాయించిన పాఠశాలల్లో విధులను నిర్వర్తించారు. వీరిని ఈ ఏడాది ఏప్రిల్‌ 15వ తేదీ నుంచి విధుల నుంచి తొలగించారు. ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై మూడు నెలలవుతున్నా మళ్లీ విధుల్లోకి తీసుకోకపోవటంతో ఆయా పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లు తమను కొనసాగించాలంటూ ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
చివరికి మళ్లీ వారిని కొనసాగించేందుకు ఎట్టకేలకు నిర్ణయం తీసుకున్నారు. ఆయా కేటగిరీలోని పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లకు సంబంధించిన కేటగిరీల్లో వారి విద్యార్హతల సర్టిఫికెట్లను పరిశీలించాకే విధుల్లోకి తీసుకోవాలనే ఆదేశాలతో వారి ఒరిజనల్‌ సర్టిఫికెట్ల పరిశీలన సోమవారం చేపట్టారు. దీంతో ఆయా అభ్యర్థులు హన్మకొండలోని సర్వశిక్షాభియాన్‌ ప్రాజెక్టు కార్యాలయంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారు. ఎస్‌ఎస్‌ఏ జిల్లా ప్రాజెక్టు అకాడమిక్‌ మానటరింగ్‌ కోఆర్డినేటర్‌ వేణుఆనంద్‌, ఆయా కేటగిరీల సబ్జెక్టు నిపుణులు సర్టిఫికెట్లను పరిశీలించారు. అయితే వంద మంది విద్యార్థులు కలిగిన ఉన్నత, యూపీఎస్‌లలోనే ఆయా పార్ట్‌టైం ఇన్‌స్ట్రకర్టర్లను నియమించనున్నారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం ఈనెల 14వ తేదీ నుంచి పాఠశాలల్లో విధులను నిర్వర్తిస్తారు. ప్రతినెల వీరికి రూ.6వేల చొప్పున వేతనం ఇస్తారు.

Advertisement
 
Advertisement
 
Advertisement