ఎస్కేప్‌... ఎస్కేప్‌... ఎస్కేప్‌! Escaped Prisoner Arrested In Hyderabad | Sakshi
Sakshi News home page

ఎస్కేప్‌... ఎస్కేప్‌... ఎస్కేప్‌!

Published Tue, Jul 17 2018 10:07 AM | Last Updated on Thu, Jul 11 2019 7:49 PM

Escaped Prisoner Arrested In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిదిపై పగబట్టాడు... అతడితో పాటు కుటుంబాన్నీ అంతం చేస్తానని బెదిరించాడు... చివరకు ఈ నెల 4న నిద్రిస్తున్న వారిపై కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు... ఇద్దరు చిన్నారుల సహా ముగ్గురిని పొట్టనపెట్టుకున్నాడు... ఇంత వరకు కథ కర్ణాటకలోని గుల్బర్గాలో (కాలబురిగి) జరిగినా ఆపై సీన్‌ సిటీకి మారింది... అక్కడి నుంచి పారిపోయిన నిందితుడు అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో తలదాచుకున్నాడు... వెతుక్కుంటూ వచ్చిన పోలీసుల నుంచి మూడుసార్లు తప్పించుకున్నాడు.. చివరకు అజ్మీర్‌లో చిక్కి పారిపోయే ప్రయత్నాల్లో దాదాపు రెండు కాళ్ళూ  పోగొట్టుకున్నాడు.

భార్యాభర్తల మధ్య రాజీ ప్రయత్నం...
గుల్బర్గాలోని హుస్సేన్‌గార్డెన్స్‌ సమీపంలోని ఇక్బాల్‌ కాలనీలో నివసించే మహ్మద్‌ ముస్తాఫాకు కొన్నేళ్ల క్రితం సేదాం రోడ్‌కు చెందిన సయ్యద్‌ అక్బర్‌ సోదరితో వివాహమైంది. భార్యభర్తల మధ్య స్పర్థలు రావడంతో పాటు ముస్తాఫా తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తుండేవాడు. నేరచరితుడైన ఇతడిపై అప్పటికే గుల్బర్గాలోని పలు పోలీసుస్టేషన్లలో కేసులు ఉన్నాయి. తన సోదరికి నిత్యం నరకం చూపిస్తున్న మస్తాఫాతో మాట్లాడి, భార్యభర్తల మధ్య రాజీ చేయాలని అక్బర్‌ భావించాడు. దీనికోసం గత నెలలో ముస్తాఫాను పిలిచి మందలించాడు. అప్పటి నుంచి విచక్షణ కోల్పోయిన ముస్తాఫా నీతో పాటు నీ కుటుంబాన్నీ అంతం చేస్తానం టూ అక్బర్‌ను బెదిరిస్తూ వచ్చాడు. చివరకు ఈ నెల 4 రాత్రి అక్బర్‌ ఇంటికి వెళ్లిన ముస్తాఫా నిద్రిస్తున్న అతడి కుటుంబంపై పోసి కిరోసిన్‌ నిప్పుపెట్టాడు. దీంతో అక్బర్‌తో (45) పాటు అతడి భార్య షైనాజ్‌ (35), కుమార్తె సానియా (17), కుమారుడు యాసీన్‌ (19) లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అక్బర్, షైనాజ్‌ మరణించారు.

సిటీకి మారిన సీన్‌...
దాదాపు 80 శాతం కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడుతున్న సానియా, యాసీన్‌లను మెరుగైన చికిత్స నిమిత్తం గుల్బర్గా పోలీసులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ముస్తాఫా సైతం ఈ నెల 7న నగరానికి వచ్చాడు. ఇతగాడి కోసం ముమ్మరంగా గాలించిన గుల్బర్గా పోలీసులు సాంతికేతిక ఆధారాలను బట్టి అఫ్జల్‌గంజ్‌ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో గుల్బర్గాలోని ఆర్‌జీనగర్‌ సబ్‌–ఇన్‌స్పెక్టర్‌ అక్కమహాదేవి నేతృత్వంలో సిటీకి వచ్చిన ఓ ప్రత్యేక బృందం ముమ్మరంగా గాలించింది. 9న అఫ్జల్‌గంజ్, 10న సికింద్రాబాద్, 13న పటాన్‌చెరుల్లో ముస్తాఫా పోలీసులకు చిక్కినట్లే చిక్కి తప్పించుకున్నాడు. మరోపక్క సానియా చికిత్స పొందుతూ ఈ నెల 8న కన్నుమూసింది. నగరం నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లిన ముస్తాఫాను గుల్బర్గా పోలీసులు పట్టుకున్నారు. అక్కడి నుంచి శుక్రవారం గుల్బర్గా తరలించారు. దర్యాప్తులో భాగంగా సేదాం రోడ్‌లో ఉన్న ఘటనాస్థలికి తీసుకువెళ్ళగా... ముగ్గురు పోలీసులపై దాడి చేసి పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో రెండుకాళ్లపై కాల్పులు జరిపిన పోలీసులు అతడిని నిలువరించారు. ప్రస్తుతం గుల్బర్గా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతడి కాళ్లు పని చేసే అవకాశాలు తక్కువని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement