నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు.... ACB attacks on Agent Nagaraj house | Sakshi
Sakshi News home page

నాగరాజు.. సూడో డైరెక్టర్‌

Published Thu, Oct 3 2019 2:53 AM | Last Updated on Thu, Oct 3 2019 8:15 AM

ACB attacks on Agent Nagaraj house - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌ ) కుంభకోణంలో నాగరాజు లీలలు క్రమంగా వెలుగుచూస్తున్నాయి. ఐఎంఎస్‌ కుంభకోణంలో నాగరాజు పాత్రపై బుధవారం ‘అవినీతిలో పోటీపడ్డారు’అనే పేరుతో సాక్షి ప్రచురించిన కథనంపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. అతని ఇంటిపై బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా జరిగిన తనిఖీల్లో రూ.46 కోట్ల విలువైన ఒరిజినల్‌ పర్చేజ్‌ ఆర్డర్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. ఐఎంఎస్‌ డైరెక్టరేట్‌లో ఉండాల్సిన పత్రాలు ప్రైవేటు వ్యక్తి ఇంట్లో ఉండటంపై అధికారులే విస్తుపోయారని తెలిసింది. ఇప్పటికే నాగరాజును అరెస్టు చేసిన ఏసీబీ రిమాండుకు పంపిన విషయం తెలిసిందే. దేవికారాణి డైరెక్టర్‌గా చార్జ్‌ తీసుకున్నాక నాగరాజే డైరెక్టరేట్‌లో చక్రం తిప్పాడని, అతడే సూడో డైరెక్టర్‌గా వ్యవహరించిన వైనం బయటపడింది. 

నాగరాజు ఎంత చెబితే అంత! 
ఐఎంఎస్‌లో నాగరాజు వ్యవహారాలు నడపడం ఇదే కొత్తకాదు. దేవికారాణి రాక ముందు అంతకు ముందున్న డైరెక్టర్లతోనూ చాలా తతంగాలు నడిపాడు. దేవికారాణి డైరెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నాక ఐఎంఎస్‌ డైరెక్టరేట్‌ పేషీలో అతని ఆగడాలు శృతిమించాయి. అతను వచ్చాడంటే తన చాంబర్‌లో ఎంత బిజీ మీటింగ్‌లో ఉన్నా దేవికారాణి అందరినీ పంపించేసేది. ఆఫీసులో తయారు చేయాల్సిన మెడిసిన్స్‌ ఇండెంట్‌ను ఇంటి వద్దే నాగరాజు తయారు చేసుకుని వచ్చేవాడు. నాగరాజు చెబితే ఏకబిగిన పదుల సంఖ్యలో ఇండెంట్లపై దేవికారాణి సంతకాలు చేసేది.

మందుల ధరలు, కొనుగోలు చేయాల్సిన కిట్లు, యంత్రాలు మొత్తం తానే నిర్ణయించేవాడు. అతనికి పేషీలో ఎంత ప్రాధాన్యం ఉండేదంటే.. తనకు నచ్చిన అధికారి సీట్లో కూర్చుని కంప్యూటర్లపై వీడియో గేములు ఆడేవాడని సిబ్బంది గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏ సెక్షన్‌లో ఇతని ఫైల్‌ ఆలస్యమైనా సరే.. ఆ బాధ్యతలు చూసే ఉద్యోగిని అక్కడ నుంచి మరో సెక్షన్‌ను ఆగమేఘాల మీద మార్పించేవాడు. సిబ్బంది మాటల్లో చెప్పాలంటే.. దేవికారాణి కంటే నాగరాజుకే ఎక్కువగా వణికిపోయేవారు. నాగరాజు ఆగడాలపై సమాచారం అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణిని హెచ్చరించడంతో మే నెల నుంచి పేషీకి రావడం కాస్త తగ్గించాడు. దీంతో సంతకాలన్నీ కారులోనే తీసుకునేవాడని సమాచారం. 

 esi nagaraju house

ఏపీలోనూ ఇతనిదే హవా! 
నాగరాజు కమీషన్‌ దందా కేవలం తెలంగాణకే పరిమితం కాలేదు. ఇతడిచ్చే కమీషన్లకు ఆశపడి అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ భారీగా మందుల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల తిరుపతి, విజయవాడల్లోనూ ఏపీ విజిలెన్స్‌ అధికారులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే. అక్కడ కూడా ఇతని అక్రమాలు విస్తరించాయని, దర్యాప్తు చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూస్తాయని సిబ్బంది చెబుతున్నారు.   

కంపెనీలన్నీ అతని వెనకాలే..! 
గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన నాగరాజు పూర్తిపేరు సీహెచ్‌ శివ నాగరాజు. మెడికల్‌ రిప్ర జెంటేటివ్‌గా జీవితాన్ని ప్రారంభించాడు. అధికారులకు విలువైన బహుమతులు, పార్టీలు ఇచ్చి మచ్చిక చేసుకునేవాడు. తర్వాత అధిక ధరలకు ఇండెంట్లు పెట్టుకుని వారికి రూ.లక్షల  కమీషన్లు వచ్చేలా స్కెచ్‌ గీసేవాడు. దీంతో ఇతని ద్వారా మందుల కొనుగోలుకు అధికారులు, రిజిస్టర్డ్, నాన్‌ రిజిస్టర్డ్‌ కంపెనీలు ఆసక్తి కనబరిచేవి. 42 కంపెనీలకు ఇతనే అధికారిక రిప్రజెంటేటివ్‌గా మారాడంటే అతని హవా ఎలా నడిచిందో చెప్ప వచ్చు. దేవికారాణి అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక ఇవ్వగానే అప్రమత్తమయ్యాడు. దేవికా రాణి, జాయింట్‌ డైరెక్టర్‌ పద్మల మధ్య రాజీ కుదర్చడంలో సఫలీకృతమయ్యాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement